మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:31:50

భూమికి భద్రత.. భవిష్యత్తుకు భరోసా

భూమికి భద్రత.. భవిష్యత్తుకు భరోసా

  • ఎల్‌ఆర్‌ఎస్‌తో స్పష్టమైన యాజమాన్య హక్కులు
  • అనధికారిక స్థలాలను క్రమబద్ధీకరించుకొనే అవకాశం
  • ఆటంకాలు లేకుండా క్రయవిక్రయాలు జరుపొచ్చు
  • పలు సందేహాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏండ్ల పాటు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్న స్థలంపై మనకు స్పష్టమైన యాజమాన్య హక్కులు లేకుంటే ఆ బాధ వర్ణణాతీతం. సొంతిల్లు కట్టుకొనేందుకు కొన్న జాగ అనధికారికమని తేలితే కుటుంబం మొత్తం బాధపడుతుంది. అందుకే, కొందరు రియల్టర్లుచేసిన మోసం ప్రజ లపాలిట శాపంగా మారకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఎల్‌ఆర్‌ఎస్‌' పథకాన్ని ప్రకటించింది. గతంలో హైదరాబాద్‌కే పరిమితమైన ఈ పథకాన్ని ఈసారి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసింది. దరఖాస్తుల స్వీకరణ మొదలైననాటి నుంచే ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన కనిపిస్తున్నది. ఆదివారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే కొందరిలో ఇప్పటికీ కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు, అపోహలపై నిపుణుల సమాధానాలతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

ఏయే స్థలాలకు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలి?

మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థలు, గ్రామపంచాయతీల పరిధిలో పాలకవర్గం నుంచి అనుమతి తీసుకోకుండా వేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరమా? అని ఎలా తెలుసుకోవాలి 

సంబంధిత లేఔట్‌ స్థానిక పాలకవర్గం ఆమోదం పొందినట్టు ఏవైనా పత్రాలు ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠం పరిధిలో ఉన్న భూములకు సైతం ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేదు. ఈ వివరాలన్నీ సేల్‌డీడ్‌లో ఉంటాయి. లేదా సంబంధిత మున్సిపాలిటీ/పంచాయతీ అధికారులను అడిగి తెలుసుకోవచ్చు. చాలామంది రియల్టర్లు లేఔట్‌ అప్రూవల్‌ కోసం దరఖాస్తు చేసి, తుది అనుమతులు రాకముందే ప్లాట్లు అమ్మేస్తుంటారు. అలాంటివాటికి రిజిస్టర్డ్‌ నంబర్‌ మాత్రమే ఉంటుంది. అలాంటివి అనధికారిక లేఔట్ల కిందే లెక్క.

ఒక వ్యక్తి ఈఎంఐ పద్ధతిలో ప్లాట్‌ కొనుగోలు చేస్తూ సగానికిపైగా వాయిదాలు చెల్లించారు. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరు కట్టాలి? కొనుగోలుదారుడా, లేక రియల్టరా? ఈ అంశంలో రియల్టర్‌, కొనుగోలుదారు కలిసి చర్చించుకొని నిర్ణయించుకోవాలి. ధరల్లో ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటాయేమో స్పష్టంగా మాట్లాడుకోవాలి. లేఔట్‌లో 20 ఫీట్ల రోడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం స్థలానికి ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలా? రోడ్డు వెడల్పును మినహాయించాలా? ఒక లేఔట్‌లో కనీసం 30 ఫీట్ల వెడల్పుతో రోడ్లు ఉండాలనేది ప్రభుత్వ నిబంధన. ప్రస్తుతం క్రమబద్ధీకరణకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇది మొదటి అడుగు మాత్రమే. రెండో దశలో దరఖాస్తుల సాంకేతిక తనిఖీలు ఉంటాయి. దరఖాస్తులో పొందుపరిచిన వివరాలు, సేల్‌డీడ్‌, లేఔట్‌ ప్లాన్‌ వంటివన్నీ సరిపోలుతున్నాయో లేదో చూస్తారు. తర్వాతి దశలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఎంత విస్తీర్ణానికి ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలో నిర్ణయిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. రిజిస్టరై ఉన్న మొత్తం విస్తీర్ణానికి ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాల్సి ఉంటుంది. భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు రోడ్డు వెడల్పు ఆధారంగా ఎంతమేర వెనక్కి జరిగి కట్టుకోవాలో (సెట్‌బ్యాక్‌) సూచిస్తారు.

అనధికారిక లేఔట్‌లో 10శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉంటే 14 శాతం పన్నును మినహాయిస్తారా?

అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అనధికారిక లేఔట్‌లో కొనుగోలు చేసిన ప్లాట్‌లో గతంలోనే ఇల్లు నిర్మించుకొంటే ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టాలా? వద్దా?ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఆ ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పర్మిషన్‌ ఫీజుతోపాటు ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు కలిపి వసూలు చేస్తారు. అలాంటివారు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలు కట్టకుండా, బిల్డింగ్‌ పర్మిషన్‌ ఫీజు మాత్రమే చెల్లించినవారు తప్పనిసరిగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

ప్లాట్‌ కొనుగోలు చేసిన వ్యక్తి చనిపోతే, వారసులు నేరుగా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టుకోవచ్చా? హక్కు మార్పిడి చేయించుకున్న తర్వాతే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకోవాలా? ఎల్‌ఆర్‌ఎస్‌ తుది గడువు సమీపిస్తున్నది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి. కాబట్టి ముందుగా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఆ తర్వాత వారసత్వ హక్కు పత్రాలను జతపరిచి, మార్పిడి ప్రక్రియ చేపట్టవచ్చు.

ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రయోజనం ఏంటి?

ఎల్‌ఆర్‌ఎస్‌తో ఆ స్థలానికి ప్రభుత్వ అనుమతులు వస్తాయి. యజమాని వివరాలు, విస్తీర్ణం, హద్దులు వంటి వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర పక్కాగా ఉంటాయి. కాబట్టి కబ్జా, అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉం డదు. భవన నిర్మాణ అనుమతులు వేగంగా వస్తాయి. క్రయవిక్రయాలు సులభంగా అవుతాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టకుంటే వచ్చే నష్టాలేంటి? 

స్థలం విక్రయించినప్పు డు, పంపకాలు, హక్కు మా ర్పిడి సమయంలో రిజిస్ట్రేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటిని నిర్మించుకోవాలన్నా ఎల్‌ఆర్‌ఎస్‌ ఉంటే నే అనుమతులు ఇస్తారు. ఆ సమయంలో ఎల్‌ఆర్‌ఎస్‌ భారం ఎక్కువగా ఉంటుంది.


logo