శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:07:30

అవి ఊహాజనిత పిటిషన్లు

అవి ఊహాజనిత పిటిషన్లు
  • చర్యలు తీసుకొంటే నోటీసులు ఇస్తాం
  • గోపన్‌పల్లి భూములపై హైకోర్టుకు ప్రభుత్వం వివరణ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని భూముల విషయంలో రెవెన్యూ అధికారులు ఇంకా చర్యలు తీసుకోలేదని, ఒకవేళ తీసుకొంటే పిటిషనర్లకు నోటీసులు జారీచేస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రెవె న్యూ అధికారులు ఏమైనా చర్యలు తీసుకొంటారేమోననే ఊహతో మాత్రమే రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి పిటిషన్లు దాఖలుచేశారని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఊహాజనితంగా దాఖలుచేసిన ఈ పిటిషన్లను కొట్టేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తిచేశారు.


గోపన్‌పల్లిలోని తమభూముల విషయంలో జోక్యం చేసుకోకుండా రంగారెడ్డి కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, శేరిలింగపల్లి ఆర్డీవో, తాసిల్దార్‌కు ఆదేశాలు జారీచేయాలని ఎంపీ రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలుచేశారు. ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణచేపట్టిన జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం.. పిటిషనర్లు పేర్కొంటున్న భూముల విషయంలో అధికారులు చర్యలు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తీర్పును వెలువరించింది. ఈ మేరకు కేసుల విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.


logo