శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 01:56:56

భగీరథ నీళ్లే మహాభాగ్యం

భగీరథ నీళ్లే మహాభాగ్యం
  • ఆ నీళ్లలో 300 నుంచి 400 పీపీఎం మినరల్స్‌
  • మినరల్‌, ఆర్వో వాటర్‌లో అవి 100లోపే
  • క్షేత్రస్థాయి పరీక్షల్లో తేటతెల్లం
  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కు నిపుణుల నివేదిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మిషన్‌ భగీరథ నీళ్లు ప్రజల ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయని క్షేత్రస్థాయిలో నిఫుణులు జరిపిన పరీక్షల్లో తేటతెల్లమైంది. కృష్ణా, గోదావరి జలాలను అన్నిస్థాయిల్లో ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల ద్వారా శుద్ధిచేసి ఇంటింటికీ అందించే భగీరథ నీళ్లు ప్రజల ఆరోగ్యానికి మహాభాగ్యమని స్పష్టమైంది. వరంగల్‌ నిట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎం పాండురంగారావు ఆధ్వర్యంలో నిపుణులు, ఇంజినీర్లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మిషన్‌ భగీరథ, మినరల్‌, ఆర్వో (రివర్స్‌ ఓస్మోసిస్‌) నీళ్లను పరీక్షించారు. మినరల్‌, ఆర్వోనీళ్లు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని పరీక్షలో తేలింది. మినరల్‌ వాటర్‌-ఆర్వో నీళ్లలో 100 పీపీఎంలోపు మినరల్స్‌ ఉండగా.. మిషన్‌ భగీరథ నీళ్లలో 300 నుంచి 400 పీపీఎం మినరల్స్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 


భగీరథ నీళ్లలో మనిషికి అవసరమైన మినరల్స్‌, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయని వెల్లడైంది. పరీక్షలకు సంబంధించిన నివేదికను ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు బుధవారం హైదరాబాద్‌లో పాండురంగారావు అందజేశారు. మిషన్‌ భగీరథ నీళ్లు తాగడం వల్ల ప్రజలకు జబ్బులు రావని, ఆరోగ్యంగా ఉంటారని పరీక్షల్లో తేలినట్టు పాండురంగారావు ఆయనకు వివరించారు. దేశంలో దాదాపు 70 శాతం జబ్బులకు కలుషిత తాగునీరే కారణమని తెలిపారు. సోషల్‌ స్టేటస్‌గా భావిస్తూ మినరల్‌, ఆర్వో నీళ్లు తాగడం వల్ల ఎముకలు మెత్తబడటం, కీళ్లనొప్పులు, బోన్‌లాస్‌, హెయిర్‌లాస్‌, డిప్రెషన్‌ వంటి అనర్థాలు వస్తాయని చెప్పారు.


రజకులను  ఎస్సీ జాబితాలో చేర్చాలని వినతి 

రాష్ట్రంలోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని  తెలంగాణ రజకసంఘాల సమితి ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు విజ్ఞప్తిచేశారు. మంగళవారం సమితి ప్రతినిధులు బంజారాహిల్స్‌లోని అధికారిక నివాసంలో ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందించారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో రజకులు ఇప్పటికే ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని, అన్ని రంగాల్లో వెనుకబడిన రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ప్రస్తుత బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. వినోద్‌కుమార్‌ను కలిసినవారిలో తెలంగాణ రజకసంఘాల సమితి రాష్ట్ర కన్వీనర్‌, ముస్తాబాద్‌ మండల పరిషత్‌ అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్‌, కోకన్వీనర్లు మానస గణేశ్‌, కొండూరు సత్యనారాయణ, కుమారస్వామి, సంపత్‌, పురుషోత్తం, కోట్ల శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు. 


logo