శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 25, 2020 , 04:04:54

సకాలంలో ఫ్లైఓవర్‌ పనులు

సకాలంలో ఫ్లైఓవర్‌ పనులు
  • పనులను వేగవంతం చేసేలాచర్యలు చేపట్టండి
  • ఎస్సార్డీపీ సమీక్షలో అధికారులకుమంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగవంతంగా సకాలంలో పూర్తిచేయాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్‌ సమస్యను అధిగమించడంతోపాటు రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును నిర్ధారిత గడువులోగా పూర్తిచేసేందుకు అవసరమైన మెటీరియల్‌, మ్యాన్‌పవర్‌, యంత్ర సామగ్రిని సమకూర్చుకోవాలని సూచించారు. సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎస్సార్డీపీతోపాటు వివిధ ఇంజినీరింగు పనులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.


 ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రోజుకు ఐదారు గంటలు మాత్రమే పనులు జరుగుతున్నాయని, వీటిని అవసరమైతే 24 గంటలూ నడిపించేలా ఆయా ప్రాంతాల్లో ఒకవైపు రహదారిని మూసి ట్రాఫిక్‌ను మళ్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏకకాలంలో అన్నిచోట్లా పనులు జరిపేలా చూడాలని సూచించారు. ఫ్లైఓవర్‌లో ఒక్కో స్పాన్‌ అమర్చుకొంటూ పోతే చాలా సమయం పడుతున్నందున.. అన్ని స్పాన్‌లూ ఒకేసారి జరిపించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. ఏజెన్సీలతో వేగంగా పనులు చేయించే విషయంలో సూక్ష్మస్థాయి ప్లానింగ్‌ ఉండాలని, సృజనాత్మకంగా ఆలోచించాలని పేర్కొన్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నాయని, బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నామని చెప్పారు. భూసేకరణ, పబ్లిక్‌ యుటిలిటీ నిర్మాణాలను తొలగించడంలో జాప్యం చేయరాదని సూచించారు. వాటర్‌బోర్డు, డిస్కమ్‌ అధికారులు ఇందుకు సహకరించాలన్నారు. పనులను సకాలంలో పూర్తిచేయాల్సిన బాధ్యత ఆయా ఏజెన్సీలపైనే ఉన్నదని మంత్రి స్పష్టంచేశారు.


logo