బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:26:20

ఎల్‌ఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం

ఎల్‌ఆర్‌ఎస్‌పై కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం

  • ఉత్తమ్‌ మంత్రిగా ఉన్నప్పుడే ఎల్‌ఆర్‌ఎస్‌ వచ్చింది 
  • మీరు చేస్తే ఒప్పు.. టీఆర్‌ఎస్‌ చేస్తే తప్పా
  • ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు విమర్శ

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ‘ఎల్‌ఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయలేదా?.. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ఏ జీవో ప్రకారం.. ఏ పద్ధతి ప్రకారం అమలు చేసిందో, ఈ రోజు కూడా అదే జీవో ప్రకారం.. అదే పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం.. మీరు చేస్తే ఒప్పు.. టీఆర్‌ఎస్‌ చేస్తే తప్పా’ అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదివారం సిద్దిపేటలోని తన నివాసంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, దుబ్బాక మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు, కోఆపరేటివ్‌ డైరెక్టర్లు, సీనియర్‌ నాయకులు, పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే ఎల్‌ఆర్‌ఎస్‌ వచ్చిందని, ఇప్పుడు వారే ఎల్‌ఆర్‌ఎస్‌పై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేసేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ తెచ్చామని, దీన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ నాయకులు దుబ్బాకలో ఊరూరా మకాం వేస్తున్నారన్నారు. ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కరెంట్‌ ఇవ్వనందుకు ఓట్లు అడుగుతారా..?, రైతులు ఆత్మహత్య చేసుకుంటే రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి ఓట్లు వేయమంటారా..?, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.5 లక్షల బీమా ఇచ్చిందని అడుగుతారా..?, రైతులకు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు’ అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. కార్యక్రమంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకట నర్సింహారెడ్డి, భూంపల్లి మనోహర్‌రావు పాల్గొన్నారు. 


logo