ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 01:26:25

దుబ్బాకలో కాంగ్రెస్‌ ఖాళీ

దుబ్బాకలో కాంగ్రెస్‌ ఖాళీ

  • టీఆర్‌ఎస్‌లోకి క్యూకట్టిన క్యాడర్‌
  • పల్లెల్లో ఆ పార్టీకి కానరాని స్పందన
  • తిరుగుముఖం పట్టిన పీసీసీ నేతలు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఖాళీ అయింది. ఆ పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులతోపాటు కాంగ్రెస్‌ ముఖ్యనేతలైన భూంపల్లి మనోహర్‌రావు, వెంకట నర్సింహారెడ్డి తమ అనుచరులతో గులాబీగూటికి చేరారు. వీరందరి చేరికలతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు క్యాడర్‌ లేకుండాపోయింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామంటూ హైదరాబాద్‌ నుంచి సూట్‌ కేసులతో వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మొదలుకొని ఆ పార్టీ ముఖ్య నాయకులంతా రెండు రోజులపాటు ప్రచారం చేశారు. ఆ పార్టీకి గ్రామాల్లో స్పందన లేకపోవడంతో తిరుగుముఖం పట్టారు.

అసమ్మతి సెగ..

ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు అసమ్మతి సెగ తగులుతున్నది. కాంగ్రెస్‌ టికెట్‌ చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి దక్కగా, బీజేపీ అభ్యర్థిగా గత సాధారణ ఎన్నికల్లో పోటీచేసి ఓడిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. టికెట్ల కేటాయింపు పూర్తి కావడంతో కాంగ్రెస్‌, బీజేపీలో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. ఆ పార్టీ నాయకుల తీరుపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తున్నారు. పార్టీని పట్టుకుని ఉన్న వారికి కాకుండా, నిన్న మొన్న వచ్చిన వారికి టికెట్‌ ఇవ్వడంపై ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో మొదటి నుంచి ఉండి పార్టీ జెండామోసిన వారికి కాకుండా, రాత్రికి రాత్రి వచ్చిన వారికి టికెట్‌ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్ని రోజులు ఉన్నా.. కాంగ్రెస్‌లో పార్టీ జెండా మోసిన వారికి స్థానం లేదంటూ, ఆ పార్టీలకు రాజీనామా చేస్తూ టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నారు. నవజ్యోతి స్వచ్ఛంద సంస్థల ద్వారా దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన భూంపల్లి మనోహరరావు, కాంగ్రెస్‌ పార్టీ పటిష్ఠతకు సొంత డబ్బులు పెట్టుకుని కృషిచేసిన వెంకట నర్సింహారెడ్డి దుబ్బాక టికెట్‌ ఆశించారు. కానీ, కాంగ్రెస్‌లో వారికి తగిన న్యాయం జరగలేదు. దీంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తమ అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదిలావుండగా గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి ఓడిన మద్దుల నాగేశ్వర్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలిసింది. ఆరు రోజుల కిందట సుప్రీం కోర్టు న్యాయవాది ఆర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, గొడుగుపల్లి ఎంపీటీసీ లక్ష్మీనర్సవ్వ, చీకోడ్‌ ఎంపీటీసీ రాంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నర్సింహులు, తిమ్మాపూర్‌ ఎంపీటీసీ మాధవి తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయింది. జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీని కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం తలలు పట్టుకుంటున్నది.

దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌ 

దుబ్బాక ఉప ఎన్నికతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. యావత్తు తెలంగాణ దుబ్బాక వైపు చూస్తున్నది. ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్‌ ఇచ్చి, సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. గడిచిన నెల రోజులుగా ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి ముమ్మరంగా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 


logo