శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:11

నాడు ఎకసెక్కాలు.. నేడు ఏడ్పులు!

నాడు ఎకసెక్కాలు.. నేడు ఏడ్పులు!

  • పిట్టకథల కల్పనలో ఆరితేరిన ఆంధ్రదొర
  • లేనివి ఆపాదించి.. అవే నిజాలని ప్రచారం
  • డిసెంబర్‌ 9 ప్రకటన పునాదిని దెబ్బతీసే కుట్ర
  • వలసరాతల బలుపునకు వకాల్తా ఆర్కే
  • ఆంధ్ర మీడియాలో అందెవేసిన గోబెల్స్‌

మొదట్లో పట్టనట్టు వ్యవహరిస్తారు.  ఇతడితో ఏమవుతుందిలే అంటూ  తేలిగ్గా కొట్టిపారేస్తారు. కానీ ఉత్తమ నాయకుడు ఉద్యమాన్ని ఉధృతం చేస్తాడు. అయినా అతడి నిజాయితీని, సమర్థతను గుర్తించరు. వెకిలి నవ్వులు నవ్వుతారు.

నాయకుడు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకుపోతాడు. ఇక తప్పదు.. పోరాటం మొదలు పెడతారు. వారు పోరాటానికి దిగారూ అంటే, విజయం సాధించేది మనమే!!

మహాత్మాగాంధీకి మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.. 

2001 నుంచి ఉద్యమం పొడుగునా  కేసీఆర్‌ను పలు రకాలుగా అవమానించారు.   ఏ ఉద్యమ నాయకుడు కూడా ఇన్ని అవమానాలను, ఒత్తిళ్లను ఎదుర్కొని ఉండరు. 

వాళ్లు నవ్వినప్పుడు  కేసీఆర్‌ నారాజ్‌ కాలేదు. రెచ్చగొడితే రెచ్చిపోలేదు. యుద్ధం జరుపాల్సిన స్థలకాలాదులను నిర్ణయించేవాడే విజేత అవుతాడు. ఎప్పుడు పోరాడాలో, ఎప్పుడు సంయమనం పాటించాలో కేసీఆర్‌కు తెలుసు. ఉద్యమం ఏ పంథాలో సాగాలో కూడా నిర్దేశించారు. ఉద్యమం గాడి తప్పకుండా నియంత్రిస్తూ లక్ష్యాన్ని సాధించారు. ఆ తర్వాత కూడా రాష్ర్టాన్ని అభివృద్ధిపథంలో  నడిపిస్తున్నzరు. 

కేసీఆర్‌ సాధించిన ఈ విజయమే ఆంధ్ర మీడియాకు మింగుడు పడటం లేదు. అందుకే విషం కక్కుతున్నారు.

ఆనాడు వెకిలిగా నవ్వారు, నేడు ఓర్వలేక ఏడుస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉద్యమకాలం నాటి మాట. కేసీఆర్‌ ఇంటర్వ్యూ తీసుకున్న రెండు టీవీ చానళ్లు అడిగిన ప్రశ్నలు తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంటాయి. ఒకడు మీరు తాగుతారు కదా! అని ప్రశ్నించాడు. దీనికి కేసీఆర్‌ ఎంతో సంయమనంతో చాలా వివరమైన సమాధానం మళ్లీ నోరు తెరువకుండా ఇచ్చారు. ఇదే ప్రశ్న అంతకు ముందే మరొకడు వేశాడు. మీరు తాగుతారని అంటారు కదా అని! దీనికి కేసీఆర్‌ -‘అంటారండీ.. మీరు వ్యభిచారి అని అంటారు’ అని రిటార్టిచ్చారు. దీంతో ఆ పెద్దమనిషి నవరంధ్రాలు మూసుకున్నాడు. ఇదేరకం ప్రశ్నలు ఆంధ్రా పెద్దమనుషులకు వేస్తారా? తెలంగాణవారంటే చులకన. ఉద్యమనాయకుడనే కనీస గౌరవభావం కూడా వీరిలో ఉండదు. 

లేనివి ఆపాదించి.. వాస్తవాలుగా ప్రచారం

తెలంగాణవారు ఏమిచేసినా నేరమేనా? కొంచెం మంచిగా ఉంటే చాలు ఓర్వరు. అది వలస పాలకుల బలుపు. కేసీఆర్‌ హైదరాబాద్‌ శివారులో వ్యవసాయ భూమి కొనుక్కున్నారు. దీనిలో వ్యవసాయంపై ప్రయోగాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. నిజానికి ఆంధ్రలో చాలామంది రాజకీయ నాయకులకు ఫామ్‌హౌజ్‌లు ఉన్నాయి. అదే పేరును ఇక్కడ కేసీఆర్‌ పొలానికి ఖరారు చేసేసింది ఆంధ్ర మీడియా. మహబూబ్‌నగర్‌ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్‌ ఇంటి ముందు ఒక కొత్త కారు కనిపించింది. అంతే ఆంధ్రజ్యోతిలో వరుసగా అదే వార్త. ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం ఉండటం కొత్తకాదు. కానీ కేసీఆర్‌ ఒక్కరే సీఎం కార్యాలయంలో కొత్తగా ఉంటున్నట్టు ప్రచారం! లేనివి ఆపాదించి, అవే నిజాలైనట్టు ప్రచారం చేయడం కూడా ఆంధ్ర మీడియాకు అలవాటు. కేసీఆర్‌ ఏది చేసినా తరతరాలను దృష్టిలో పెట్టుకొని, తెలంగాణకు గర్వదాయకంగా ఉండాలని కోరుకుంటారు. సచివాలయం వాస్తు బాగాలేదని ఆయన ఎన్నడూ అనలేదు. కానీ కేసీఆర్‌కు ఆపాదించి వాళ్లే ప్రచారం సాగిస్తారు. మరి చంద్రబాబు, ఇతర ఆంధ్రా ముఖ్యమంత్రులు ఉత్త పుణ్యానికి కోట్ల రూపాయలు పెట్టి భవనాలు కట్టించుకున్నప్పుడు, మరమ్మతులు సాగించినప్పుడు ఈ మాట ఎందుకు రాలేదు? ఉద్యమ సమయంలోనూ ఇదే అబద్ధపు ప్రచారం. ఆంధ్రా వ్యాపారస్తులను ఎవరినీ వెళ్ళగొట్టబోమని, రెడ్‌కార్పెట్‌ వేసి ఆహ్వానిస్తామని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. అయినా ఎక్కడో ఫిలింసిటీలో నాగళ్ళు పెట్టి దున్నిస్తానని కేసీఆర్‌ అన్నట్టు ప్రచారం మొదలు పెట్టారు.

మంచితనం మసకబార్చేలా రాతలు

కేసీఆర్‌ ఒక మంచి కార్యక్రమం ప్రకటిస్తే చాలు, వెంటనే ఆ మంచితనం మసకబోవాలని మరొక ఘటన సృష్టించడం ఆంధ్రా పాలకవర్గం ఎత్తుగడ. రైతుల కోసం ఒక కార్యక్రమం ప్రకటించగానే ప్రజల్లో అనుకూల స్పందన వచ్చింది. వెంటనే ఖమ్మంలో రైతుల ముసుగులో ఒక దాడి జరిపించారు. ఆ దాడి విజువల్స్‌ చూస్తే, పథకం ప్రకారం దాడి జరిగిందే తప్ప రైతులు ఆగ్రహావేశాలతో చేసింది కాదని తెలిసిపోతుంది. వెంటనే ‘రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం’ అంటూ పాటపాడటానికి మీడియా ఉండనే ఉన్నది. బతుకమ్మ చీరెలు పంచితే, వెంటనే వాటిని తగులబెట్టే కార్యక్రమం సాగుతుంది

మంచి బాబుది.. తప్పు అధికారులది!

.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి కోస్తాలో తుఫాన్‌ వచ్చింది. 15 రోజులు గడిచినా పట్టించుకునే దిక్కులేదు. శవాలను కుక్కలు పీక్కుతింటున్నాయి. చాలారోజులు మీడియా మౌనం వహించింది. చివరకు వాస్తవ పరిస్థితి బయటికి వచ్చింది. అప్పుడు ఒక ఆంధ్రా పత్రిక కార్టూన్‌ వేసింది. చంద్రబాబు తాబేలుపై సవారీ చేస్తున్నట్టు! తాబేలు మీద బ్యూరోక్రసీ అని రాసి ఉంది. అంటే చంద్రబాబు సమర్థుడే కానీ, బ్యూరోక్రసీ వల్ల ముందుకు పోలేకపోతున్నట్టు కవరింగ్‌! అప్పట్లో హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు, వాతావరణశాఖ చాలా ముందుగానే హెచ్చరించింది. అయినా సహాయచర్యలు చేపట్టడంతో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడు. విద్యుత్‌ సరఫరా లేదు. అపార్ట్‌మెంట్లలో మంచినీళ్ళకు దిక్కులేదు. పసిపిల్లల బాధచూసి తల్లిదండ్రులు కంట తడిపెట్టారు. పెట్రోలు ధర అడ్డగోలుగా పెరిగింది. ప్రభుత్వం వాడవాడలా సిబ్బందిని పెట్టి సహాయ చర్యలు తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వమే ఉనికిలో లేదు. అయినా మీడియా అహో ఒహో అంటూ ప్రసారం చేసింది. పుష్కరాల సమయంలోనూ చంద్రబాబు ఘోరంగా విఫలమైతే మీడియా ఆయనను ఎట్లా వెనకేసుకు వచ్చిందో అందరూ గమనించారు. అక్కడ జనం గగ్గోలు పెడుతుంటే షూటింగ్‌లకు దిగిన చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తంకాకుండా దృష్టి మళ్ళించడానికి ఆంధ్రజ్యోతి ఎన్ని కతలు పడ్డదో అందరికీ తెలిసిందే. చివరికి ఒక స్వామీజీని విలన్‌ను చేసేందుకు తెగించింది.

కుక్కలు మొరిగితే ఏంటి?

కొన్నేండ్ల కిందటి మాట.. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రారంభానికి ముందు ఒకసారి కేసీఆర్‌ పాత్రికేయులతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆంధ్రా పాలకవర్గం, మీడియా ఆయనపై చేస్తున్న దాడి గురించి అక్కడ ఉన్న పాత్రికేయులు ప్రస్తావించారు. దానికి కేసీఆర్‌ ఇచ్చిన జవాబు- 

‘చుక్కలు (ప్రజలు) నా పక్కన ఉన్నంక, కుక్కలు ఎంత మొరిగితే నాకేమిటి!’

కరోనా విషయంలోనూ వంకరబుద్ధి

కరోనా ఉధృతి ప్రపంచమంతా ఉన్నది. అన్ని దేశాలూ ఈ వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తంటాలు పడుతున్నాయి. మన దేశంలోనూ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చంద్రబాబే ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రా మీడియా అసలు వైరస్‌ అనేదే లేనట్టు వ్యవహరించేదనటం అతిశయోక్తికాదు. కానీ ప్రజలను చైతన్యపరచడంలో, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం శక్తికి మించి పనిచేస్తున్నది. అయినా ఆంధ్రా మీడియా వంకర బుద్ధి మారలేదు.

నోట్లతో దొరికినవాళ్లూ గొప్పోళ్లే!

ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు.. ఎవడో తలమాసినవాడు తెలంగాణభవన్‌ ముందుకు వచ్చి ఏదో వాగితే, దానిని టీవీ చానళ్లు ఎగబడి ప్రసారం చేస్తాయి! ప్రజా ప్రతినిధులను కొనడానికి బేరసారాలకు దిగిన నాయకుడు నోట్లకట్టలతో అడ్డంగా దొరికిపోతే, సాధారణంగా అయితే అతడి రాజకీయ భవిష్యత్తు శూన్యమైపోతుంది. కానీ ఆంధ్రా మీడియాకు మాత్రం అతడు ప్రీతిపాత్రుడు. అతడు బెయిల్‌పై విడుదలైతే కుటుంబసభ్యుల కన్నీళ్లు.. వీళ్ల టీవీల స్క్రీన్లను పదేపదే తడిపేస్తాయి. అతడి అడ్డమైన ప్రసంగం గంటల తరబడి ప్రసారమవుతుంది. అదే తెలంగాణవాదులైతే చిన్నతప్పు చేసినా ఎంత రాద్ధాంతం చేస్తారు?

జాతీయ మీడియాలోనూ తాబేదార్లు

ఆంధ్రాపాలకవర్గానికి జాతీయ మీడియాలోనూ తాబేదార్ల కొదువలేదు. తెలంగాణ సమాజం సకల కష్టాలు పడుతున్నప్పుడు, ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు ఈ మీడియాకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. కానీ ఉద్యమంలో భాగంగా కొద్దిరోజులపాటు పాఠశాలలు నడువలేదు. వెంటనే ఒక ఆంగ్ల చానల్‌ దీనిపై చర్చ పెట్టింది. విద్యావిధానం మీద అభిమానమా? తెలంగాణ విద్యార్థుల మీద ప్రేమా? ఇదేమీకాదు. ఆంధ్రా లాబీ ‘ప్రభావం’! కేసీఆర్‌ ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేస్తున్నందుకు, ఐఏఎస్‌ అధికారుల ఆత్మైస్థెర్యం దెబ్బతినే విధంగా అవమానకర రాతలు రాసిన నికృష్టపు మీడియా ఇవాళ జర్నలిజం పేర చలామణి అవుతున్నది.

ఆంధ్రలో బెల్టుషాపుల పుణ్యం ఎవరిది?

ఎన్నికల్లో ఎట్లయినా గెలువాలని చంద్రబాబు పాద యాత్ర మొదలుపెట్టిండు. ఈ సందర్భంగా చంద్రబాబును రాధాకృష్ణ మహాత్మాగాంధీతో పోల్చిండు. ‘చంద్రయాన్‌' అంటూ ‘బాబు డైరీ’ని వరుసపెట్టి ప్రచురించిండు. చంద్రయానం 87వ రోజు ఏమి జరిగిందో ‘ఆంధ్ర’ జ్యోతిలోనే చూద్దాం. (ఆంధ్రజ్యోతి 2013 జనవరి ఒకటవ తేదీ.. పేజీ 2)

చంద్రబాబును చూసి పొలాల్లో పనిచేకుంటున్న మహిళలు ఆ పనిని వదిలేసి వచ్చారట! ‘ఊళ్ళోకి బెల్ట్‌ షాపులు వచ్చాక మా బతుకుల్లో అశాంతి తప్ప కాంతులేముంటాయి సారూ.. కాయకష్టం చేసి ఇంటికి కూలి డబ్బులు తీసుకెళితే, ఇంట్లోకి గంజైనా ఉందా అని చూడకుండా మా మొగుళ్ళు ఆ మాయదారి సారాకే తగలేస్తున్నారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితిని ముందే గ్రహించి.. నేను బెల్ట్‌ షాపుల రద్దు నిర్ణయం తీసుకున్నాను. అదే విషయం చెబితే వారు కాస్త ఊరడిల్లారు’. ఈ చంద్రబాబు కథనాన్ని రాధాకృష్ణ బాక్స్‌కట్టి ప్రచురించాడు. 

కానీ ఇంతకూ అధికారానికి రాగానే మద్యపాన నిషేధాన్ని నీరుగార్చింది ఎవరు? ఒక మద్యం దుకాణం పెట్టాలంటే సవాలక్ష నిబంధనలు ఉంటాయి. ఏ నిబంధన లేకుండా ఊరూరా విచ్చలవిడిగా ఎవరికి వారే సీసాలు తెచ్చుకొని అమ్మే బెల్ట్‌షాపులను ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుదే. అంతటి ఘనాపాఠి చంద్రబాబును మద్యపానానికి వ్యతిరేకంగా చూపించడం రాధాకృష్ణ ఘనత. 

తన అక్రమాలు తానే చెప్పుకొన్న ఆర్కే

రాధాకృష్ణకు తన గురించి తానే చెప్పుకోవాలనిపించింది. ఆంధ్రజ్యోతి 2009 సెప్టెంబర్‌ 13వ తేదీన ఈ పెద్దమనిషి ఏమి రాసుకున్నాడో చూద్దాం. (పనిలో పనిగా ఈయనకు తెలంగాణలో భూస్వామ్యం గుర్తుకొచ్చింది. కారంచేడు, చుండూరు వగైరా.. దళితులపై ఊచకోతలు ఆంధ్రాలో జరుగుతాయి. కానీ భూస్వాముల దౌర్జన్యాలు మాత్రం తెలంగాణలో జరిగినట్టు కనిపిస్తాయి రాధాకృష్ణ అండ్‌ కంపెనీకి! తెలంగాణలో భూమి ఉన్నోళ్లను భూస్వాములు అనాలి. ఆంధ్రాలో మాత్రం పొగాకు రైతులు, మిర్చి రైతులు అని ముద్దుముద్దుగా పిలుచుకోవాలి.).. ఇక ఈ పెద్ద మనిషి ఆత్మకథనంలో ఏమి రాసుకున్నాడో చూద్దాం.

‘తెలంగాణలో పెత్తందారీతనానికి, దౌర్జన్యానికి ప్రతీక అయిన మా ఊర్లో ఒక పోలీస్‌ పటేల్‌ ఉండేవాడు. అతని కన్ను పడిన ఏ మహిళ అయినా అతడి ఒళ్ళో వచ్చి వాలిపోవాల్సిందే. అతని బారినపడిన కుటుంబాల వేదన, నా మిత్రుల ఆవేదన నాలో ఎంతో కసిని రగిల్చాయి. ఒక తిరుగుబాటుతత్వాన్ని నాలో ప్రేరేపించాయి. నాకు తెలిసి బాల్యంలోనే నాలో సామాజిక స్పృహ కలిగించిన మొట్టమొదటి అంశమిది. జంపాల చంద్రశేఖరప్రసాద్‌ మా వూరు వాడే. నాకు బంధువు కూడా. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో ఆయనను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. సమాజం కోసం చనిపోయిన ప్రసాద్‌ పేరు మీద పీడీఎస్‌యూ వారు సభలు పెట్టేవాళ్ళు. పాటలు పాడేవాళ్ళు. నా బాల్యంపై ప్రభావం చూపిన, నాలో స్ఫూర్తి రగిలించిన రెండో అంశమిది. (వారెవ్వా..)

 (బలె బలె బలె) ఇంతకూ సామాజిక స్పృహతో రాధాకృష్ణ ఏమి చేశాడయ్యా అంటే.. 

(మళ్ళీ ఆయన రాతల్లోనే.. )

ఆరోజుల్లో కిరోసిన్‌ ధర మహారాష్ట్రలో తక్కువగా ఉండేది. (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉండేది.. కిరాయి సైకిల్‌పై పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని నర్సీపట్టణానికి వెళ్ళేవాడిని. అక్కడ కిరోసిన్‌ తీసుకొని సాయంత్రానికి మళ్లీ బోధన్‌ వచ్చి దాన్ని విక్రయించేవాడిని. సైకిల్‌ కిరాయి, చెక్‌పోస్టులో ఇచ్చే లంచం పోను రోజుకు రెండు రూపాయలు (ఆ రోజుల్లో) మిగిలేవి.. 

మహారాష్ట్రలో బియ్యం ధర ఎక్కువ. మన రాష్ట్రంలో తక్కువ. మొదట్లో ఇంట్లో ఉన్న వడ్లనే మరాడించి పంపాను. ఆ పెట్టుబడితో సెలవు రోజుల్లో ఇక్కడ బియ్యం కొని దాన్ని మహారాష్ట్రకు పంపేవాడిని.. ఇలా పంపడం చట్టవిరుద్ధం కావడంతో ఒక రోజు అధికారులు దాడి చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. (వాళ్ళకు లంచం ఎగ్గొట్టి ఉంటాడా!) ఈ కథనానికి పేదరికాన్ని చక్కగా జోడించాడు. ఇక అక్కడి నుంచి చట్ట విరుద్ధమైన వాటి జోలికి పోకూడదని  నిర్ణయించుకున్నాడట. 

2009 జూన్‌ 13  కొత్త పలుకు

వైఎస్‌కన్నా కేసీఆర్‌పైనే ఆగ్రహం ఎక్కువట!

‘మొదటి దశ పోలింగ్‌ ముగిసిన తర్వాత, మహాకూటమి అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ వెళ్ళడానికి వీసా అవసరం ఉంటుందని నంద్యాలలో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆనాడు నంద్యాలలో అన్న మాటలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం నిండుసభలో నిర్మొహమాటంగా ప్రకటించినప్పటికీ, తెలంగాణలో ఒక్క గొంతు కూడా నిరసన వినిపించలేదు. తెలంగాణవాదులు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మనస్తాపం చెందలేదని కాదు. తమ నిరసన కేసీఆర్‌కు ఉపయోగపడకూదన్నది వారి భావన. రాజశేఖర్‌ రెడ్డిపై కంటే కూడా కేసీఆర్‌పైనే ఎక్కువ ఆగ్రహం ఉండటం విశేషం. 

ఇంత జరిగినా తనకు అండగా ఒక్క గొంతు కూడా వినిపించక పోవడానికి కారణాలను ఆయనే శోధించుకోవాలి. కేసీఆర్‌కు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ మిత్రులు కూడా ఎవరూ లేరు. ఆ ఒక్కడూ తక్క.. కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తే ఏమి జరుగుతుందో కేసీఆర్‌ విషయంలోనూ అదే జరుగుతున్నది. 

కేసీఆర్‌ అంటే ఎంత కసి.. ఎంత విషం? వైఎస్‌ కన్నా కూడా కేసీఆర్‌పైనే ఎక్కువ ఆగ్రహం ఉంటుందా? కేసీఆర్‌ గురించి తెలంగాణవాదులు ఏమనుకుంటున్నారో వారి బుర్రలోకి వెళ్లి ఈయనే చూసిండు. కేసీఆర్‌ శోధించుకోవాలట! ఈయనే సలహా ఇస్తున్నడు. రాధాకృష్ణా.. అడుగడుగునా నిజమైన తెలంగాణవాదులంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారు. తమ గొంతు వినిపిస్తూనే ఉన్నారు. కానీ ఆ గొంతు మీ పత్రికల్లో, చానళ్లలో రావడం లేదు. ఇటీవల ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేపడితే తెలంగాణవాదుల నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో మరిచిపోయావా? ఇవాళ కేసీఆర్‌ ఎక్కడున్నాడు, మీ చంద్రబాబు ఎక్కడున్నాడు? 

2009 మార్చి 28 కొత్త పలుకు

కేసీఆర్‌ ఆగమనం రోజే ఆర్కే ఆయాసం

..చీమల పుట్టలో పాము దూరి ఆక్రమించుకున్నట్టుగా, (కాంగ్రెస్‌) ప్రతిపక్షంలో ఉన్నప్పుడల్లా తెలంగాణ జెండా పట్టుకోవడం, మొదలుపెట్టింది. దీనికి భిన్నంగా కొందరు తెలంగాణ విద్యావంతులు, మేధావులు 2001కి ముందు సమాంతర తెలంగాణ ఉద్యమానికి పెద్దఎత్తున రంగం సిద్ధంచేశారు. తెలుగుదేశంతో సరిపడక బయటికి వచ్చిన కేసీఆర్‌ 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించి తెలంగాణవాదాన్ని చేతిలోకి తీసుకున్నారు. క్రమంగా దాన్ని ఒక ఉద్యమస్థాయికి తీసుకువచ్చారు.

వాస్తవమేమిటి? 

ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా అబద్ధాన్ని నిజం చేయవచ్చుననేది గోబెల్స్‌ మాత్రమే కాదు, రాధాకృష్ణ బాపతు ఆంధ్రా మీడియా నమ్ముతుంది. కేసీఆర్‌ టీడీపీతో సరిపడక బయటికి వచ్చారట! తెలంగాణ సమస్య మొదటి నుంచి కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి కావడం గురించి, ఇక్కడి రైతుల బాధ గురించి తెలుసు. అనుకూల సమయం చూసుకొని రంగంలోకి దిగారు. తనదైన వ్యూహాలతో ఉద్యమాన్ని నడుపుతూ బలమైన ఆంధ్రాలాబీలను దెబ్బకొట్టారు. కేసీఆర్‌ పార్టీని వీడవద్దంటూ చంద్రబాబు కాళ్ళావేళ్ళా పడ్డాడనేది ప్రజలకు తెలుసు. 

1969 ఉద్యమంలో ఆంధ్రా పాలకులు వందలమంది యువకులను కాల్చిచంపించారు. ఆ అనుభవం తర్వాత తాము రాజకీయఛత్రం కిందే ఉద్యమం నడుపాలని, లేకపోతే మళ్ళీ ఆంధ్రా పెత్తందారులు ప్రజలను పిట్టల్లా కాల్చిచంపుతారని జయశంకర్‌ వంటి తెలంగాణవాదులు భావించారు. కేసీఆర్‌ను రెండు చేతులా ఆహ్వానించారు. ఇది అసలు చరిత్ర. కానీ రాధాకృష్ణ మాత్రం ‘కేసీఆర్‌ చెరలో తెలంగాణ’ అంటూ హెడ్డింగ్‌ పెట్టి ‘చెత్త పలుకులు’ నింపాడు. 


logo