బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 02:51:32

ముందుచూపే మందు!

ముందుచూపే మందు!

  • ఇమ్యూనిటీ పెంచే ఆహారంపై క్రేజ్‌
  • ఇంటర్నెట్‌లో ఆరోగ్యకర ఆహారంపై శోధన
  • బలాన్ని పెంచే మందుల కోసం అన్వేషణ
  • వివిధ ఉత్పత్తులకు విపరీతంగా పెరిగిన డిమాండ్‌

ఇంతకాలం ఏదో తిన్నామా.. పనిచేశామా.. పడుకొన్నామా.. తెల్లారిందా అని నిర్లిప్తంగా గడిపే రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సంరక్షణపై భయం పట్టుకొంది. కొవిడ్‌ తమ దాపుల్లోకి రాకముందే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి చేయాల్సిన కసరత్తు అంతాచేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇమ్యూనిటీ పెంచే ఆహార ఉత్పత్తుల విక్రయాలు 40% పెరిగినట్లు గూగుల్‌ నివేదికే చెప్తున్నది. ఇంటర్నెట్‌లో బలవర్ధకమైన ఆహార పదార్థాల గురించి అన్వేషించేవారి సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కాలంలో మాస్క్‌, శానిటైజర్‌తోపాటు పౌష్టికాహారం అనే విభాగం నిత్యావసరాల చిట్టాలో చేరిపోయింది. ఇందుకోసం ప్రతి కుటుంబం అదనంగా కొంత డబ్బును ఖర్చుచేస్తున్నది. కొవిడ్‌ను జయించేందుకు రోగనిరోధకశక్తి పెంచుకోవడమే మార్గమని అన్నివర్గాలు నమ్ముతున్నాయి. దీంతో ప్రొటీన్లు అధికంగా ఉన్న పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారు.  మటన్‌, చికెన్‌తోపాటు పప్పు దినుసులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ధర ఎంత ఉన్నప్పటికీ డ్రైఫ్రూట్లను కొంటున్నారు. వేడినీరు, గ్రీన్‌ టీ కషాయం, చాయ్‌ వంటివి తరుచూ తాగితే మంచిదని చెప్తుండటంతో అల్లం, వెల్లుల్లి, ఇలాచి, లవంగం, పసుపు, శొంఠి వంటి పదార్థాలకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగిపోతున్నది. లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటివరకు ఔషధ గుణాలున్న ఈ పదార్థాల ధరలు 30% దాకా పెరిగినట్లు కొనుగోలుదారులు చెప్తున్నారు. 

ఎక్కువ ఖర్చు వాటికే

రాష్ట్రంలో 56 శాతం వినియోగదారులు తమ ఖర్చుల్లో అధికభాగం ఆరోగ్యం, ఆర్గానిక్‌ ఫుడ్‌, మెడికల్‌ అవసరాలు, ఫిట్‌నెస్‌, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ వంటి వాటికి వెచ్చిస్తున్నట్లు నీల్సన్‌ మార్కెట్‌ పరిశోధనాసంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దీంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే బిస్కట్లు, స్నాక్స్‌ వంటి ఉత్పత్తులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో పలుసంస్థలు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదలచేస్తున్నాయి. అల్లం, తులసి కాంబినేషన్‌లో మిల్క్‌ బ్రాండ్‌ను విడుదలచేసే యోచనలో ఉన్నట్టు అమూల్‌ సంస్థ ఇప్పటికే ప్రకటించగా, తాను తయారుచేసే అశ్వగంధ, ఘన్వ టీ ట్యాబ్లెట్లకు డిమాండ్‌ పెరిగిందని, వీటని డిజిటల్‌ మీడియాలో ప్రమోట్‌చేస్తామని డాబర్‌ కంపెనీ వెల్లడించింది. ఇక రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులను తయారుచేసే ప్రముఖ కంపెనీలైన హిమాలయ, డాబర్‌, నెస్లే, న్యూట్రికా, హెర్బాలైఫ్‌, అబ్బట్‌ ఇండియా వంటివి నూతన ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు పరిశోధన కొనసాగిస్తున్నాయి. 

విటమిన్‌ ట్యాబ్లెట్లకు డిమాండ్‌

ఈ రోజుల్లో మెడికల్‌ షాపులకు వెళ్లిన ప్రతిసారి రోగనిరోధక శక్తిని పెంచే ట్యాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నారు. మల్టీ విటమిన్‌, విటమిన్‌ సీ, డీ, జింక్‌, బీ 12 వంటి ట్యాబ్లెట్లకు పెద్ద ఎత్తున డిమాండ్‌ వస్తున్నట్లు కరీంనగర్‌లోని ఓ మెడికల్‌ షాపు నిర్వాహకుడు తెలిపారు. మరికొందరు బలాన్ని ఇచ్చే పౌడర్లను అడుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో రోగనిరోదక శక్తిని పెంచే పండ్లను కొనుగోలు చేస్తున్నారు. పోషకాలను ఇచ్చే యాపిల్‌, జామ, ద్రాక్ష, బత్తాయి వంటి పండ్లను ఎక్కువగా కొంటున్నట్టు పండ్ల వ్యాపారులు చెప్తున్నారు. కోడిగుడ్ల వినియోగమూ పెరిగింది. సీ విటమిన్‌ అందించే నిమ్మకాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నది. కొవిడ్‌ నిరోధానికి చాలామంది వేడినీళ్లలో నిమ్మరసం, పసుపు, అల్లం, శొంఠి వంటి సుగంధ ద్రవ్యాలను కలిపి తీసుకొంటున్నారు. అల్లోపతి వంటి వైద్యాలకు చెక్‌పెట్టి.. మళ్లీ సంప్రదాయ భారతీయ వైద్యవిధానం వైపు మళ్లుతున్నారు. 

గూగుల్‌ ఇండియా రిపోర్టు ప్రకారం, అంతర్జాలంలో ఎక్కువగా శోధించిన అంశాలు- పెరుగుదల శాతం 

1, రోగనిరోధక శక్తి పెంపు ఎలా- 500% 

2, విటమిన్‌ సీ ఉండే ఆహారం- 150% 

3, ఔషధ గుణాలున్న మొక్కలు- 380%

4, వంటింటి వైద్యం- 90%

మందులు కొనడానికి వస్తున్న వారిలో.. ఎక్కువమంది విటమిన్‌ సీ, జింక్‌, డి ట్యాబ్లెట్లను ఎక్కువగా కొంటున్నారు. మల్టీ విటమిన్‌తో పాటు సీ, డీ, ఈ, జింక్‌ టాబ్లెట్లను ఎక్కువ మంది కొంటున్నారు. 

-తిరుమలేశ్‌, మందుల దుకాణం యజమాని నాచారం, హైదరాబాద్‌

కరోనా వల్ల ఎంత ప్రమాదం ఉందో అందరికి అర్థమైంది. వైరస్‌ సోకిన తర్వాత ఆందోళన చెందే కంటే ముందునుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు తీసుకోవటం అవసరం. ఇందుకోసం నేను ప్రతినెలా రూ.2000 వరకు అదనంగా ఖర్చు చేస్తున్నా. ప్రొటీన్‌ ఫుడ్‌, పండ్లు, డ్రైఫ్రూట్‌ ప్రతిరోజు ఆహారంలో ఉండేలా ప్లాన్‌ చేసుకొంటున్నా. 

-జి ప్రవీణ్‌, బ్యాంకు ఉద్యోగి హైదరాబాద్‌


logo