మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 02:10:20

కరోనా చికిత్సకు అధిక చార్జీలా?

కరోనా చికిత్సకు అధిక చార్జీలా?

  • ప్రైవేటు దవాఖానలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ - 19 చికిత్సకు ప్రభుత్వం నిర్ధారించిన చార్జీల కన్నా అధికంగా ఎలా వసూలుచేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు హాస్పిటళ్లలో ఫీజుల వసూళ్లలో పారదర్శకత లేదని, అధిక ఫీజులను వసూలుచేస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన శ్రీకిషన్‌శర్మ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ - 2005, క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ - 2010, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కాండక్ట్‌ రెగ్యులేషన్స్‌ ప్రకారం ప్రైవేటు హాస్పిటల్స్‌లో పారదర్శకంగా చికిత్స, బిల్లింగ్‌ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు కోవిడ్‌ 19 చికిత్స అందిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌కు చట్టబద్ధమైన మార్గదర్శకాలు జారీచేయాలని విజ్ఞప్తిచేశారు. హైకోర్టు ఆదేశాలకనుగుణంగా 4 ప్రైవేటు హాస్పిటళ్లను పిటిషనర్‌ ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. హైదరాబాద్‌ ఫీవర్‌ హాస్పిటల్‌ డీఎంవో సుల్తానాను నిర్బంధంపై ధర్మాసనం ఆరా తీసింది.  

జీవో స్పష్టంగా ఉన్నది కదా? 

కొవిడ్‌ -19 చికిత్సకు చార్జీలపై జీవోలో స్పష్టంగా ఉన్నప్పుడు అధిక బిల్లులు ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ‘ప్రైవేటు హాస్పిటల్స్‌ జీవోకు విరుద్ధంగా బిల్లులు వసూలు చేస్తున్నాయి. అలాంటి హాస్పిటల్స్‌పై చర్యలు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదో కారణాలు చెప్పాలి’ అని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌లను హైకోర్టు ఆదేశించింది. ఈనెల 14 వరకు కౌంటర్లు దాఖలుచేయాలని ఆదేశించింది. అధిక ఫీజులపై వివరణ ఇవ్వాలని నేషనల్‌, స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, పలు ప్రైవేటు దవాఖానలకు నోటీసులు జారీచేస్తూ.. విచారణను ఈనెల 14కు వాయిదావేసింది. logo