శనివారం 04 జూలై 2020
Telangana - Jun 22, 2020 , 01:26:48

ఉపాధి ఘనం..సేద్యానికి జలం

ఉపాధి ఘనం..సేద్యానికి జలం

  • 23 రకాల పనులకు నరేగా అనుసంధానం
  • రూ.700 కోట్లతో సాగునీటి కాలువల నిర్వహణ  
  • సీజన్‌ మొదలయ్యేలోగా పూడికతీత, పొదల తొలిగింపు
  • మరో రూ.500 కోట్లతో 30 వేల చెరువుల పునరుద్ధరణ

పూడికతో నిండిన కాలువల పునరుద్ధరణ  ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేస్తున్నది. ఉపాధిహామీ పథకం కింద ఈ పనులు నిర్వహిస్తూ గ్రామాల్లో కూలీలకు ‘ఉపాధి’ కల్పించడంతోపాటు చివరి ఆయకట్టుకు నీరందించాలని సంకల్పించింది. 30వేల చిన్న చెరువులు, కుంటల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది.   

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పనికి ఆహారపథకం కింద కూలీలకు ఉపాధి కల్పిస్తూనే అద్భుతఫలితాలు సాధించవచ్చని ఇటీవల ధర్మపురి నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఆ స్ఫూర్తితో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని (నరేగా) పలుశాఖలకు అనుసంధానం చేస్తున్నది. పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా 23 రకాల పనులను నీటిపారుదలశాఖ పరిధిలో చేపట్టేందుకు సిద్ధమయింది. రూ. 1,200 కోట్లతో ప్రాజెక్టుల కాలువల నిర్వహణ, చెరువులు, కుంటల పునరుద్ధరణ పనుల కోసం  ప్రతిపాదనలు తయారవుతున్నాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి నియోజకవర్గంలో 418 కిలోమీటర్లమేర చేపట్టిన కాలువల నిర్వహణ పనులతో కూలీలకు పనులు దొరకడంతోపాటు 1,108 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం ఉన్న ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ కాలువలన్నీ బాగుపడ్డాయి. 8వేల మంది కూలీలకు 17-18 రోజులు ఉపాధి దొరికింది.  

రూ. 700 కోట్ల పనులకు అంచనాలు

ఉపాధి కింద కాలువల నిర్వహణ విజయవంతమవడంతో అన్ని ప్రాజెక్టుల పరిధిలోని కాలువల మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అధికారులు రూ.700 కోట్ల విలువైన పనులకు అంచనాలు సిద్ధంచేశారు. వానకాలం మొదలైన నేపథ్యంలో కాలువల్లో పూడికతీత, పొదలు, ప్రవాహానికి అడ్డుగా ఉన్న రాళ్ల తొలి గింపు పనులు చేపట్టనున్నారు. కాలువకట్టలపై హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు గుంతలు కూడా తీయించనున్నారు. వందెకరాలలోపు ఆయకట్టుకు సాగునీరందించే పిల్లకాలువలు నిర్మించనున్నారు. నీటిపారుదలశాఖ ఇంజినీర్లు గ్రామాలను యూనిట్‌గా తీసుకొని అంచనాలు సిద్ధంచేసే పనిలో నిమగ్నమయ్యారు. సంబంధిత అధికారుల ద్వారా నరేగా జిల్లా పీడీలకు సమర్పించి అనుమతులు తీసుకొంటారు.

30 వేల చెరువుల పునరుద్ధరణ

మిషన్‌కాకతీయ కింద ఐదుదశల్లో చేపట్టిన పనులతో రాష్ట్రంలో దాదాపు 28వేల చెరువుల పునరుద్ధరణ జరిగింది. తద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఇప్పటివరకు జరిగిన పునరుద్ధరణలో పెద్ద చెరువులే అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ కింద చిన్నచెరువుల పునరుద్ధరణకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. దాదాపు 30 వేల చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నట్టు తెలిసింది. గ్రామాలు యూనిట్లుగా సాగునీటి ప్రాజెక్టుల కాలువల నిర్వహణ పనులను నరేగాకు అనుసంధానించడం ద్వారా ఉత్తమఫలితాలు వస్తాయని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


logo