ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 17:35:07

'సహకరించని వారిపై క్రిమినల్‌ చర్యల పరిశీలన'

'సహకరించని వారిపై క్రిమినల్‌ చర్యల పరిశీలన'

హైదరాబాద్‌ : కరోనా సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు, సంబంధిత లాయర్లు హైకోర్టుకు విన్నవిస్తూ.. యూకే నుంచి వచ్చిన 21 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ నిర్ధారణ కోసం నమూనాలను సీసీఎంబీకి పంపినట్లు వెల్లడించారు. అయితే యూకే నుంచి వచ్చిన వారు తప్పుడు చిరునామాలు ఇస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ..సహకరించని వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునే అంశం పరిశీలించాలని పేర్కొంది.

కరోనా ప్రబలకుండా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచించింది. ప్రజలు గుమిగూడకుండా నిషేధం విధించడాన్ని పరిశీలించాలని ఆదేశించింది. పలు రాష్ర్టాలు రాత్రి కర్ఫ్యూ విధించాయని ప్రస్తావించిన న్యాయస్థానం 144 సెక్షన్‌ అమలును పరిశీలించాలంది. కరోనా కొత్త స్ట్రెయిన్‌ పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలంది. కరోనాపై యుద్ధం ముగియలేదని కరోనా రెండో దశను ఎదుర్కొనేలా వైద్య సౌకర్యాలు పెంచాలని తెలిపింది. వివాహ వేడుకల్లో 50 మందికి మించకుండా చర్యలు తీసుకోవాలంది. అదేవిధంగా రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ బదులు ప్రత్నామ్నాయం చూడాలని పేర్కొన్న న్యాయస్థానం కరోనా కేసులపై విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. 


logo