శనివారం 23 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 01:20:48

టీఆర్‌ఎస్‌ వెంటే మాజీ సైనికులు

టీఆర్‌ఎస్‌ వెంటే మాజీ సైనికులు

పేదల కోసం సీఎం కేసీఆర్‌ నిర్ణయాలు భేష్‌  

మాజీ సైనికుల పింఛన్ల కోతకు కేంద్రం కుట్ర

దేశవ్యాప్త ఆందోళనతో వెనక్కి తగ్గిన మోదీ సర్కార్‌  

మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగయ్యగౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సైనికుల సంక్షేమంపై సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వెంటే మాజీ సైనికులంతా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగయ్యగౌడ్‌ చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న సంపూర్ణ విశ్వాసం హైదరాబాద్‌లోని 60 నుంచి 70వేల మాజీ సైనికుల కుటుంబాలకు ఉన్నదని స్పష్టంచేశారు. మాజీ సైనికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న మాజీ సైనికుల భూ పంపిణీ విషయంలోనూ తెలంగాణ సర్కార్‌ సానుకూలంగా ఉన్నదని చెప్పారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యను వివరించామని, వారినుంచి సానుకూల స్పందన వచ్చిందని తెలిపారు. మాజీ సైనికులకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. మున్సిపాలిటీల్లో మాజీ సైనికులకు ప్రాపర్టీ ట్యాక్స్‌ రద్దుతో తమకు కొంతఊరట లభించిందని చెప్పారు. 

సైనికుల కుటుంబాలకు విలువేం ఇచ్చినట్టు!

రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతలో సాయంచేస్తుంటే.. కేంద్రం ఇటీవలే మాజీ సైనికుల పింఛన్లలో కోతల కుట్ర తెరతీసిందని రంగయ్యగౌడ్‌ విమర్శించారు. ఓ అధికారితో కమిటీ వేయించి రిపోర్టు తెప్పించారని, దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తడంతో వెనక్కి తగ్గినట్టు తమకు సమాచారం ఉన్నదని తెలిపారు. దేశంకోసం సేవ చేసిన తమకు కేంద్రం నుంచి ఇచ్చే ఏకైక సాయం పింఛన్‌ అని, అందులోనే కోతలు పెడితే దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు విలువేం ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ భూములు సైనిక విన్యాసాల ప్రదర్శన కోసం కేటాయించినవి ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న వాటిని మాజీ సైనికుల కుటుంబాలకు నివాసం కోసం కేటాయించాలని ఏండ్లుగా పోరాటంచేస్తున్నా కేంద్రం నుంచి స్పందన కరువైందని అన్నారు.   

సైనికుల ఆత్మగౌరవాన్ని గుర్తించి, వారికి అన్నివిధాలా సహాయంగా ఉంటున్న టీఆర్‌ఎస్‌ వెంటే తామంతా ఉంటామని తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రంగయ్యగౌడ్‌ ప్రకటించారు. నగరంలోని 60 వేలనుంచి 70 వేల వరకు ఉన్న మాజీ సైనిక కుటుంబాలన్నీ గులాబీ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం తన పరిధిలో సాయం చేస్తుంటే.. కేంద్రం మాత్రం పింఛన్లలో కోతల కుట్రకు తెర తీసిందని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న సైన్యం పరిధిలోని నిరుపయోగ భూములను మాజీ సైనిక కుటుంబాలకు కేటాయించాలన్న తమ డిమాండ్‌ను కేంద్రం బుట్టదాఖలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.


logo