గురువారం 28 మే 2020
Telangana - Apr 30, 2020 , 15:02:38

బీజేపీ, కాంగ్రెస్‌ నేతల దుష్ప్రచారం తగదు..

బీజేపీ, కాంగ్రెస్‌ నేతల దుష్ప్రచారం తగదు..

హైదరాబాద్‌ : రైతుకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్‌ నేతల దుష్ప్రచారం తగదు అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కనీస మద్దతు ధరకు రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ పరిపాలిస్తున్న రాష్ర్టాల్లో పూర్తిగా పంటలను కొంటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఓర్వలేకపోతున్నారని వినోద్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతుల పట్ల వారికి ప్రేమ లేదు.. మొసలి కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు పండించిన వరి, మొక్కజొన్న, కందులు వంటి పలు ఉత్పత్తులను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు రైతు ముంగిట్లోనే కొనుగోలు చేయడం దేశంలోనే చారిత్రాత్మకమని వినోద్‌ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఈ ఫార్ములా లేదని ఆయన తెలిపారు. ఆ రెండు పార్టీల నాయకులకు చిత్తశుద్ధి ఉంటే.. తమ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల కుట్రలను రైతులు గమనిస్తున్నారని, వారి ఆగడాలను ప్రజలు ఎండగట్టడం ఖాయమని వినోద్‌ కుమార్‌ అన్నారు. 


logo