శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 19, 2020 , 03:42:29

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌

  • ఎంపీ సంతోష్‌ సహా పలువురు నేతల అభినందనలు
  • నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో దాఖలు పలువురు నాయకుల అభినందనలు 

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి  మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బుధవారం నామినేషన్‌ దాఖలుచేశారు. మంగళవారం రాత్రి అనూహ్యంగా కవిత పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారుచేశారు. బుధవారం ఉదయం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో ఆమె నామినేషన్‌ సమర్పించారు. 

అడుగడుగునా ఘనస్వాగతం

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరును అధిష్ఠానం ఖరారుచేయడంతో కవిత.. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. భవిష్యత్‌కార్యాచరణపై చర్చించారు. అక్కడినుంచి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఒకే వాహనంలో నిజామాబాద్‌ బయలుదేరారు. వీరివెంబడి ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, గంప గోవర్ధన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, జాజల సురేందర్‌, హన్మంత్‌షిండే, మహ్మద్‌ షకీల్‌, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌, రాజేశ్వర్‌, ఆకుల లలిత భారీ కాన్వాయ్‌తో అనుసరించారు. 

కామారెడ్డి జిల్లాకేంద్రం మొదలుకొని ఇందల్వాయి, డిచ్‌పల్లి, నిజామాబాద్‌ జిల్లా కేంద్రం శివారు వరకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఆమెకు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా అభిమానుల ప్రేమాభిమానాలు ఆమెను ముంచెత్తాయి. నేరుగా తన నివాసానికి చేరుకొన్న కవిత అక్కడ తన భర్తతో కలిసి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కలెక్టరేట్‌కు చేరుకొన్నారు. కలెక్టర్‌ సీ నారాయణరెడ్డికి ఒక సెట్టు నామినేషన్‌ పత్రాలు దాఖలుచేశారు. అక్కడినుంచి వాహనంలో నేరుగా కంఠేశ్వర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన గురువారం ఆమె మరో రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీశ్రేణులు తెలిపాయి. సర్వత్రా హర్షం

నిజామాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కల్వకుంట్ల కవితను ఎంపిక చేయడంపట్ల పార్టీ వర్గాల్లో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై శాఖలు అభినందనలు తెలియజేశాయి. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వేదపండితులు ఆశీర్వదించారు. మాజీ ఎంపీ కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడంపట్ల ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ట్విట్టర్‌ ద్వారా మనఃస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ కవితకు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 

రాజ్యసభ సభ్యుడు జే సంతోష్‌కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎక్కడున్నా ఆ ప్రాంతానికి గుర్తింపు తెస్తారంటూ అభినందించారు. కవితకు శుభాకాంక్షలు తెలిపినవారిలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతిరాథోడ్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. కవితకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం పట్ల మండలిలో ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌ హర్షం వ్యక్తంచేశారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని తన కార్యాలయంలో టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర పౌరసరఫరాలసంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ జాగృతి స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమసాధనలో ఎంపీ కవిత కీలకపాత్ర పోషించారన్నారు. 


ఎన్నారై శాఖల హర్షం

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ఎంపీ కవితను ఎంపిక చేయడంపట్ల టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల హర్షం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నారై సలహాదారు, టీఆర్‌ఎస్‌ దక్షిణాఫ్రికాశాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు, ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే సలహామండలి వైస్‌చైర్మన్‌ సిక్కా చంద్రశేఖర్‌,  టీఆర్‌ఎస్‌ ఎన్నారై బహ్రెయిన్‌ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఖతార్‌ శాఖ అధ్యక్షుడు శ్రీధర్‌ అబ్బగౌని తదితరులు హర్షం వ్యక్తం చేసినవారిలో ఉన్నారు.  

ఆర్మూర్‌ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె కాన్వాయ్‌లో వస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కారుకు ప్రమాదం జరిగిం ది. మెదక్‌జిల్లా తూప్రాన్‌ వద్ద జీవన్‌రెడ్డి కారు ను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీవన్‌రెడ్డికి, ఆయన గన్‌మెన్‌, డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఎమ్మెల్యే మరో వాహనంలో నిజామాబాద్‌ చేరుకొన్నారు. 


‘మీరు ఎక్కడున్నారన్నది విషయం కాదు. ఎక్కడ ఉన్నప్పటికీ ఆ పదవికి వన్నె తీసుకొస్తారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నా ప్రియమైన సోదరి కవిత ఎంపిక అయినందుకు హృదయపూర్వక అభినందనలు. సీఎం కేసీఆర్‌ గారు సముచిత స్థానం కల్పించారు.

- ట్విట్టర్‌లో ఎంపీ సంతోష్‌


కవిత రాష్ట్రవ్యాప్తంగా సేవలందించాలి

-ఎమ్మెల్సీగా అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నా

-మీడియాతో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్‌ దాఖలుచేయడాన్ని వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాలలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతేడాది జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కవితకు ఆశించిన ఫలితం రాలేదని చెప్పారు. ఓటమి రాజకీయ జీవితానికి ముగింపు కాదని, అది మరింత బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యురాలైనంత మాత్రాన కవిత ఎమ్మెల్సీ కారాదన్న నిబంధన ఏదీ లేదని చెప్పారు. పార్టీకి ఆమె సేవలు అవసరం ఉన్నందునే అవకాశం కల్పించి ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.  వాస్తవంగా రాజ్యసభకే అవకాశం కల్పిస్తారని తాము ఊహించామన్నారు. కవిత ఎమ్మెల్సీగా నిజామాబాద్‌ జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గిరి నాగభూషణం, కాంగ్రెస్‌ పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి బండశంకర్‌, నాయకులు కొత్త మోహన్‌, గాజంగి నంద య్య, జగదీశ్వర్‌, కండ్లపెల్లి దుర్గయ్య, రఘువీర్‌, గుండ మధు పాల్గొన్నారు.


logo