ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 10:29:49

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు

సిద్దిపేట‌: దుబ్బాక ఉపఎన్నిక‌లో ఉప‌యోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్‌ల‌ను ప‌టిష్ట భ‌ద్ర‌త నడుమ స్ట్రాంగ్ రూంలో భ‌ద్ర‌ప‌రిచారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను సిద్దిపేటలోని ఇందూరు ఇంజనీరింగ్‌ కాలేజీలో స్ట్రాంగ్ రూంకు అధికారులు ఈరోజు తెల్ల‌వారుజామున తీసుకువ‌చ్చారు. నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం 315 పోలింగ్‌ కేంద్రాల నుంచి ఈవీఎంలను లచ్చపేటలోని మోడల్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్‌లో పోలింగ్ సిబ్బంది ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అందించారు. రాత్రి పొద్దుపోయే వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం వాటిని మూడంచెల పోలీసు భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో సిద్దిపేటలో ఏర్పాటుచేసిన‌ స్ట్రాంగ్ రూంకు ఇవాళ ఉదయం త‌ర‌లించారు.  

ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామలా ఇక్బాల్, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, సీపీ జోయల్ డేవిస్, రిట‌ర్నింగ్ అధికారి బీ చెన్నయ్య, ఎన్నికల్లో పోటీచేసిన‌ పలువురు అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్ రూంకు సీల్ వేశారు. ప‌రిస‌ర ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ నెల 10న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. దీంతో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.