శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 01:16:49

ఉత్తమ్‌ చెప్పేవన్నీ దొంగమాటలే: మంత్రి జగదీశ్‌రెడ్డి

ఉత్తమ్‌ చెప్పేవన్నీ దొంగమాటలే: మంత్రి జగదీశ్‌రెడ్డి

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
  • ఉద్యోగాలు తొలిగించింది బీజేపే: పల్లా

హుజూర్‌నగర్‌: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబ్బాకలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌, కోదాడలో నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌ అభివృద్ధిపై దుబ్బాక సెంటర్‌లో కూర్చుని మాట్లాడుదామని మంత్రి హరీశ్‌రావు విసిరిన సవాల్‌కు ఉత్తమ్‌ పత్తాలేకుండా పోయాడని ఎద్దేవా చేశారు. హుజూర్‌నగర్‌లో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయడానికి కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు కుయుక్తులు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కేంద్రం నూతన చట్టాలు రైతాంగం పాలిట శాపంగా మారుతున్నాయన్నారు. అనంతరం  పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటి వరకు లక్షకుపైగా సర్కారు ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఐటీ రం గంలో మరో రెండు లక్షలు, టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 5.5 లక్షల ఉద్యోగాలు కల్పించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం  కోటి ఉద్యోగాలను ఇస్తామని చెప్పి 5 కోట్ల ఉద్యోగాలను తొలిగించిందని విమర్శించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో కష్టపడినట్లుగానే వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ శ్రమించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, హుజూర్‌నగర్‌, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌, టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.