ఆదివారం 24 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 18:51:36

ఇక సర్వం ప్రైవేటు మయం : బి. వినోద్ కుమార్

ఇక సర్వం ప్రైవేటు మయం : బి. వినోద్ కుమార్

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌తో దేశంలో ఇక స‌ర్వం ప్రైవేటు మ‌యం కానున్న‌ట్లు రాష్ర్ట ప్ర‌ణాళిక సంఘం ఉపాధ్య‌క్షుడు బి. వినోద్ కుమార్ అన్నారు. నేటి దేశ‌వ్యాప్త సార్వ‌త్రిక స‌మ్మెలో భాగంగా బీఎస్ఎన్ఎల్‌, ఎల్ఐసీ, రైల్వే, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన ఆందోళ‌న‌లో వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాల కార‌ణంగా త్వరలోనే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీ (ఎన్.బీ.ఎఫ్.సీ) లు కార్పొరేట్ బ్యాంకుల రూపంలో మార్కెట్‌లోకి రానున్న‌ట్లు తెలిపారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలో రానున్న కాలంలో సర్వం ప్రైవేటు మయం కానుంద‌న్నారు. కేంద్రం చ‌ర్య‌ల‌తో ఇప్పటికే ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్‌, రైల్వే వంటి సంస్థలు నిర్వీర్యం కానున్నాయి. ఇదే బాటలో మరెన్నో సంస్థలు చేరనున్నాయన్నారు. ప్ర‌స్తుతం జాతీయ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుంటున్న ప్రైవేటు కంపెనీలు ప్రధాని మోడీ పుణ్యామ‌ని కార్పొరేట్ బ్యాంకులను స్థాపించే దిశలో ఉన్నాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకునే దాకా ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. వివిధ ట్రేడ్ యూనియన్లు గురువారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెలో టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాష్, టీఆర్ఎస్ కార్యదర్శి రూప్ సింగ్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు యాదవ రెడ్డి, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ రావు, బ్యాంకు అధికారుల  సంఘం అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.


logo