శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 12:31:57

ఆడ‌పిల్ల‌ల‌కు అండ‌గా నిలుద్దాం: మ‌ంత్రి గంగుల‌

ఆడ‌పిల్ల‌ల‌కు అండ‌గా నిలుద్దాం: మ‌ంత్రి గంగుల‌

క‌రీంన‌గ‌ర్‌: ఆడపిల్ల‌‌లు సమాజానికి మణిహారమని, అందువ‌ల్ల వారికి రక్షణ కల్పిద్దామని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. ఆడ‌పిల్ల‌ల‌కు స‌రైన పోష‌కాహారం అందించ‌డంతోపాటు విద్య‌నందించ‌డం ద్వార‌ వారి బంగారు భవిష్య‌త్తుకు పునాదివేద్దామని పిలుపునిచ్చారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా క‌రీంగ‌న‌ర్‌లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మ‌నం ఈరోజు స్వేచ్ఛ‌గా జీవిస్తున్నామంటే దానికి మ‌హాత్మా గాంధీ కార‌ణం అని చెప్పారు. బాపూజి కన్నకలలుగ‌న్న గ్రామ‌స్వ‌రాజ్యాన్ని సాకారం చేద్దామ‌ని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే  ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్య‌క్ర‌మాల‌ను చేపట్టింద‌న్నారు. అందుకే స్వచ్ఛ భారత్ కార్య‌క్ర‌మంలో మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. 

జిల్లాలో బేటి పడావో- బేటీ బచావో కార్యక్రమాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆడ‌పిల్ల‌ల‌ను ఇంటికి మ‌హాలక్ష్మిగా భావిస్తామ‌ని, కాబట్టి వారిని చదివిద్దాం అనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తామ‌ని చెప్పారు. ఆడ‌పిల్ల‌ల‌కు స్వేచ్ఛాయుత వాతావరణం క‌ల్పిద్దామ‌ని, 18 ఏండ్లు నిండిన తర్వాతే వివాహం చేద్దామని ప్ర‌తిజ్ఞ చేయించారు.