మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 17:10:41

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

సిద్దిపేట : దుబ్బాక శాసన సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోలికేరీ పిలుపు నిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హక్కుగా మాత్రమే చూడకుండా బాధ్యతగా భావించాలన్నారు. నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు స్వీప్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులకు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను ఆమె కలెక్టరేట్‌లో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 

వచ్చే నెల 3 వ తేదీన దుబ్బాక ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లను జాగృతం చేసేందుకు స్వీప్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథిల ద్వారా పల్లె పల్లెనా ప్రచారం నిర్వహిస్తూ ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నామన్నారు. వీటితో పాటు ప్రచార కరపత్రాలు, స్టిక్కర్లు, ఫ్లెక్సీ బ్యానర్ల ద్వారా అందరికీ అర్థమయ్యేలా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు.

కొవిడ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నాని పేర్కొన్నారు. ఓటర్లు ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగింకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. అలాగే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 80 సంవత్సరాల పైబడిన ఓటర్లకు, దివ్యాంగులకు, కొవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.