శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 12:32:16

సీతారామ ప్రాజెక్ట్ తో అందరూ లబ్ధి పొందాలి : మంత్రి సత్యవతి రాథోడ్

సీతారామ ప్రాజెక్ట్ తో అందరూ లబ్ధి పొందాలి : మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్ : మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లందు, పాలేరు, వైరా, సత్తుపల్లి, పినపాక, ములుగు నియోజక వర్గాల్లో ని భూములకు సాగునీరు అందించేందుకు వీలుగా.. సీతారామ ప్రాజెక్ట్ ను విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి భక్త రామదాసు ప్రాజెక్ట్ తీసుకొచ్చి జిల్లాను సస్య శ్యమలం చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టు బయ్యారం వరకు వచ్చి పాలేరు రిజర్వాయర్ వరకు వస్తది అనుకున్నాం. అలా కాకుండా కొత్త ప్రతిపాదన వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ని కలిసి గ్యాప్ వస్తుందని చెప్పినట్లు వివరించారు. కనెక్టివిటీ కోసం సర్వే చేయమని సీఎం చెప్పారన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం లబ్ధి పొందాల్సి ఉందన్నారు. గతంలో రాదు అనుకున్న సీతారామ ప్రాజెక్ట్ డోర్నకల్ కు రావడం సంతోషంగా ఉందన్నారు.


అయితే కాళేశ్వరం ద్వారా డోర్నకల్ కు నీరు అందుతున్నా.. గార్ల, బయ్యారంలో సాగునీరు ఇబ్బంది ఉందన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న గార్ల, బయ్యారం ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ మండలాలు సీతారామ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేలా ప్రాజెక్ట్ ను తీసుకెళ్లాలన్నదే తన అభిమతమన్నారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ప్రభుత్వ విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్య రాములు నాయక్, సీతారామ ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ అధికారులు, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు.