శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 02:39:35

చట్టం సూపర్‌

చట్టం సూపర్‌

  • అందరి నోటా ఒకటే మాట
  • కొత్త రెవెన్యూ విధానంపై సర్వత్రా హర్షం
  • తరాల తగువులు, సమస్యలు ఇకపై సాగవు
  • సామాన్యుడికి చుట్టంలా కొత్త రెవెన్యూ చట్టం

రైతుకు మట్టి వాసననిచ్చిన నేల.. మధ్యతరగతి జీవికి వెలుగు బతుకైన నేల.. మనిషికి బతుకుతనాన్నిచ్చిన ఈ నేలకు.. శతాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి భూమి పుత్రుడు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాహసోపేతంగా వేసిన అడుగు నూతన రెవెన్యూ చట్టం తెలంగాణమంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చింది. ఎప్పటికీ పరిష్కారం కావనుకున్నవాటికి పరిష్కారం చూపడం అందరికీ అద్భుతంగా కనిపిస్తున్నది. ఎప్పటికీ అంతంకాదనుకున్న అవినీతి అంతం కావడం విస్మయాన్ని కలిగిస్తున్నది. మున్సిపాలిటీల నుంచి తండాల దాకా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఏ నోట విన్నా ఇదేమాట.. రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న మున్సిపల్‌ చట్టం అపూర్వమని. నిరుపమానమని.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పొలం దగ్గర, చెల్కల వద్ద పల్లెల్లో, పట్నాల్లో.. ఎక్కడ చూసినా కొత్త రెవెన్యూ చట్టం గురించే ముచ్చట. రైతన్న, ప్రభుత్వ ఉద్యోగి, ప్రైవేటు ఉద్యోగి, వ్యాపారి, రియల్టర్‌, బిల్డర్‌ ఇలా భూ మి ఉన్నవారు, భూమితో వ్యవహారం నడిచే ప్రతి ఒక్కరి దగ్గర దీనిపైనే చర్చ. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌.. అన్నింట్లోనూ ట్రెండింగ్‌ ఇదే. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీసుకొచ్చిన ఈ చట్టం ఇప్పుడు ఓ విప్లవం. ఈ నూత న రెవెన్యూచట్టానికి అన్ని వర్గాల నుంచి ఆమో దం లభిస్తున్నది. రైతుల నుంచి రెవెన్యూ నిపుణుల వరకు అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నా రు. తరాల భూముల తగువులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. ఒక్క రోజులోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తిచేసేలా ఉన్న కొత్త నిబంధనను వేనోళ్ల మెచ్చుకుంటున్నారు. వారసత్వ భూముల విషయంలో కుటుంబసభ్యుల వివరాలను పాసుపుస్తకాల్లో నమోదుచేయటం వల్ల ఆస్తుల గొడవలుండవని అంటున్నారు. భూముల రికార్డు ల్లో భూమి అప్పులు, తనఖా వివరాలు ఉం డటం వల్ల క్రయవిక్రయాల్లో మోసాలు జరగవని చెప్తున్నారు. మొత్తంగా చట్టంపై లోతైన అధ్యయనం జరిగిందని పేర్కొంటున్నారు. 

రైతు కండ్లలో ధీమా

ముఖ్యంగా రైతన్నలో ఎప్పుడూ లేని ధీమా కనిపిస్తున్నది. ఇంతకుముందులా భూమిని ఎవరో, ఏదో చేస్తారన్న భయం లేదని దర్జాగా చెప్తున్నారు. ‘తండ్రి సంపాదించిన భూమి పిల్లలకు పంచాలె. గత రూలు మా భూమిని పంచకుండ అన్నదమ్ములను ఎడబాపింది. కేసీఆర్‌ సార్‌ తెచ్చిన రూలు మంచిగుంటది. నిన్న టీవీ ల జూసిన. పాసుపుసక్తంలో కుటుంబీకుల పేర్లు పెడ్తరట. ఇట్ల లేకనే నేను ఇబ్బందుల పాలైన. మా నాయన 2012లో చనిపోయిండు. భూమి మొత్తం అన్న పేరు మీద బుక్కుల ఎక్కించిండ్లు. రికార్డుల సర్వే అప్పుడు నేను మొత్తుకున్నా ఇనలే. నా మీద కేసు పెడితే జైలు కు పోయిన. అన్నదమ్ములను దూరంచేసిన రూళ్లు అవి. అలాంటియి రావొద్దు’ అని కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండలం మరివానిపల్లెకు చెందిన మర్రి బుచ్చిమల్ల రాంరెడ్డి చెప్పా రు. 

భూ లావాదేవీలను వెంటవెంటనే రికార్డుల్లో ఎక్కిస్తే ఇబ్బంది లేకపోయేదని, ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ఇదే రూలు తెస్తున్నారని రైతులు సంతోషపడుతున్నారు.  ‘తాతల నుంచి వచ్చే భూమిని పట్టా సేయకుండా తిప్పుకున్నరు. భూ సమస్య అంటే పెద్ద సమస్య. సీఎం కేసీఆర్‌ ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుని గాడి లో పెట్టిండు’ అని వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేటకు చెందిన జంగిలి రవీందర్‌ చెప్పా రు. ఆదివాసీ ప్రాంతాల్లోని రైతులు కొత్త చట్టం పై హర్షం వ్యక్తంచేస్తున్నారు. సొంత భూముల విషయంలో అధికారుల వేధింపులు ఉండవని అంటున్నారు. ‘కొత్తం చట్టంతో గిరిజనుల సమస్యలు తీరుతయి. డిజిటలైజేషన్‌తో భూములకు భద్రత పెరుగుతుంది. రోజురోజుకు భూముల రెట్లు పెరుగుతున్నాయి. గిరిజనులు అమాయకంగా మోసపోయే పరిస్థితి ఉండదు’ అని ఉట్నూరుకు చెందిన ఆదివాసీ నాయకుడు మర్సకోల తిరుపతి అన్నారు. వీఆర్వోలతోనే ఎక్కువగా భూ సమస్యలు వస్తున్నాయని, ఆ వ్యవస్థను రద్దుచేయడం సంతోషించతగ్గ పరిణామమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడుకు చెందిన తోళెం ఫకీరయ్య చెప్పారు.


నిపుణులదీ అదే మాట

రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం విప్లవాత్మకమని రెవెన్యూ, న్యాయనిపుణులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం చూపేలా కొత్త చట్టంలోని అంశాలు ఉన్నాయని అంటున్నారు. కులం సర్టిఫికెట్‌ సొంత ఊరిలోనే అందించడం వల్ల పౌరసేవలు మెరుగవుతాయని చెప్తున్నారు. ‘రెవెన్యూ పనులకోసం సామాన్యుడు పడే సమస్యలకు చెక్‌ పడేలా  చట్టం ఉన్నది. పారదర్శకంగా పని జరుగుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది’ అని కరీంనగర్‌ జిల్లా లాయర్ల సంఘం అధ్యక్షుడు గోవిందు భాస్కర్‌ చెప్పారు. ఇన్నేండ్లు రైతు ఆఫీసుల చుట్టు తిరిగేదని, ఇప్పుడు ఆ అవసరం ఉండదని రెవెన్యూ నిపుణులు అంటున్నారు. ‘కొత్త రెవెన్యూ చట్టం రైతులకు సౌలత్‌గా ఉన్నది. రైతులు భూములను సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకుని మ్యుటేషన్‌ కోసం తాసిల్దార్‌ వద్దకు తీసుకెళ్లేది. భూమి అమ్మినోళ్లకు కొన్నోళ్లకు కొన్ని రోజుల గడువుతో నోటీసులు ఇచ్చేది. ఇద్దరు వచ్చినపుడు మ్యుటేషన్‌ అయ్యేది. మధ్యలో ఏదైనా మెలిక పెడితే అంతే. కొత్త చట్టంతో భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ తాసిల్దారు వద్దనే జరుగుతాయి. రైతులకు అదేరోజు పట్టాదారు పాసుపుస్తకం అందుతుంది’ అని వరంగల్‌కు చెందిన మాజీ తాసిల్దార్‌ మార్గం కుమారస్వామి చెప్పారు.

పారదర్శకతకు ప్రాధాన్యం 

తెలంగాణ ప్రభుత్వం ఆదర్శనీయమైన బిల్లును తీసుకొచ్చింది. పూర్తిగా అవినితి రహితంగా రెవెన్యూ సేవలు అందించడం లక్ష్యంగా ఈ బిల్లు ఉంది. ప్రతి అంశంపై స్పష్టత ఉన్నది. కులం సర్టిఫికెట్లు గ్రామంలోనే తీసుకోవడం బాగుంది. తాసిల్దారు, ఆర్డీవోలకు సమావేశాలు, కోర్టులతో సమయం వృథా కాకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశముంటుంది. 

- కొలిశెట్టి లక్ష్మయ్య, రెవెన్యూ సర్వీసెస్‌ 

అసోసియేషన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు 

మెరుగైన సేవలు అందుతాయి కేసీఆర్‌ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ బిల్లు సమగ్రంగా ఉన్నది. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ఒకేచోట ఉండటం మంచిగా ఉన్నది. అన్ని భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సామాన్యులకు మేలు జరుగుతుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి.

- సురేశ్‌ పొద్దార్‌, రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌

ప్రజలకు ఉపయోగం 

ప్రజల కష్టాలు తొలిగి, సత్వర నాయ్యం జరుగుతుంది. ఒక పనికోసం పదేపదే సర్కారు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదు. రెవెన్యూలో ఇది మంచి చట్టం అవుతుంది.

- ఎన్‌.శ్రీనివాసరావు, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌


logo