శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 23:24:11

దుష్ప్రచారాలను అడ్డుకునే భాద్యత అందరిది: సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు

దుష్ప్రచారాలను అడ్డుకునే భాద్యత అందరిది: సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు

శ్రీశైలం : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనపై నిరాధారమైన సాంకేతిక లోపాలను ఎత్తి చూపుతూ దుష్ప్రచారాలు చేసే వారిని అడ్డుకునే భాద్యత మన అందరిపై ఉన్నదని జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన ఆయన.. ప్లాంట్ ఉద్యోగులందరితో టన్నల్ ఎదుట గల పార్క్ వద్ద మాట్లాడారు. ఉద్యోగ ధర్మాన్ని భాద్యతాయుతంగా నిర్వహిస్తూ ప్రాణ త్యాగం చేసి ప్లాంటును కాపాడాలని ప్రయత్నించిన సహోద్యోగుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. 

ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్లాంటులో ఇలాంటి విషాద ఘటన జరుగడం దురద్రుష్టకరమని దేవులపల్లి ప్రభాకర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంటులో జరిగిన ప్రమాదం నష్టాన్ని అంచనా వేయడం ఇప్పుడే సాధ్యం కాదన్నారు. అధునాతన పరిజ్ఞానం గల సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచి పనులు వేగవంతం చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటానన్నారు. మృత్యువాతకు గురైన వారి కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. శ్రీశైల భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ అసువులు బాసి అమరులైన సహోద్యోగుల చిత్తశుద్ధిని, అంకిత భావాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని ప్రభాకర్ రావు కోరారు. మన కుటుంబాలు ఆధారపడిన సంస్థను "కన్న తల్లిలా భావిస్తూ మన ఇంటిని మనమే కాపాడుకోవాలి" అని సూచించారు. నిన్న నా సోదరుడి మరణవార్త బాధ కన్నాఎక్కువగా.. ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేసిన యువ ఇంజినీర్ల అకాల మరణాన్ని ఇంకనూ జీర్ణించుకోలేకపోతున్నాను అని తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరుపెట్టారు. నాలుగు రోజులుగా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నాకు.. వారు చెప్తున్న మాటలు నా ఉద్యోగ ధర్మాన్ని, బాధ్యతను రెట్టింపు చేశాయన్నారు.

ప్లాంటును సందర్శించిన సీఎండీ

శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో మూడు రోజులుగా విచారణ చేపడుతున్న ప్రత్యేక బృందంతో కలిసి బుధవారం సాయంత్రం సీఎండీ ప్రభాకర్ రావు ప్లాంటును సందర్శించారు. ప్లాంటులో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఆకస్మికంగా శ్రీశైలం చేరుకున్న సీఎండీ.. కృష్ణవేణి అతిథిగృహంలో జెన్కో, ట్రాన్స్ కో అధికారులతో విచారణలో సేకరించిన సాంకేతిక విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఘటన సమయంలో విధులు నిర్వహించిన అధికారులు రికార్డు చేసిన స్టేట్ మెంట్లను పరిశీలించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది తెలిపిన భద్రతా సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన తక్షణ చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేందుకు వివరణాత్మక నివేదికలు తయారు చేయాలని సూచించారు. ప్లాంట్ అంతర్భాగంలోకి వెళ్ళిన ఆయన.. 6 యూనిట్లతో పాటు సర్వీస్ బే, మొదటి, రెండో అంతస్థులలో ప్రస్థుత పరిస్థితులను పరిశీలించారు. జీరో లెవెల్ డీవాటరింగ్ ఫ్లోర్ నుంచి వస్తున్న ఊటనీటిని తోడేందుకు చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.


logo