సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 01:42:53

ప్రతి సంక్షేమ పథకమూ పేద ప్రజల ముంగిట్లోకి

ప్రతి సంక్షేమ పథకమూ పేద ప్రజల ముంగిట్లోకి

  • సంక్షేమ.. కుటుంబం
  • ఒక్క ఇంటికి.. అనేక పథకాలు
  • కూతురుకు కల్యాణలక్ష్మి.. మనుమడికి కేసీఆర్‌ కిట్‌
  • పిల్లలకు ఉచిత చదువు.. ఆమెకు వితంతు పింఛను
  • కుటుంబానికి రైతుబంధు, రైతుబీమా పథకాలు
  • సబ్సిడీ గొర్రెల కోసం కుటుంబం దరఖాస్తు 
  • వరంగల్‌ జిల్లాలో లక్ష్మి ఇంటి పెద్దగా సర్కారు
  • ప్రతి సంక్షేమ పథకమూ పేద ప్రజల ముంగిట్లోకి

‘కుందాపన పట్టిన. పిల్లి కూనలోలిగ పిల్లలు.. మా బతుకెట్ల.. మేమెట్ల.. చేసిన అప్పులు తీరేదెట్ల.. మమ్మల్ని దిక్కులేని పచ్చుల చేసిపోయిండు. కూడుగ్గవడితే ఊరు ధైర్యమిచ్చింది. దేవుడోలె సర్కారు ధీరనిచ్చింది. బతికేందుకు ఆదెరువిచ్చింది. ఆయింత ఆ రైతుబీమా పైసలు రాకుంటే ఉన్నభూమిని అమ్ముకొని అప్పులు కట్టి ఇంటింటి రాజులం తలోదిక్కుకు పోయెటోళ్లం. కానీ ఇప్పుడు ఆ భూమి గాయిన ఆనుకొని బతుకుతున్నం’ ఇది వరంగల్‌ జిల్లాలో ఆవుల లక్ష్మి అనే ఇల్లాలి మాట!!

శిశువు కడుపున పడ్డప్పటినుంచి తల్లికి పౌష్టికాహారం. ఉచితంగా కాన్పు, ఆ తరువాత శిశువుకు అవసరమైన సంభారాలతో కేసీఆర్‌ కిట్‌.. 12 వేల రూపాయల నగదు.. ఆ తర్వాత ఉచితంగా చదువు.. అనంతరం ఆడబిడ్డకు పెండ్లిచేస్తే కల్యాణలక్ష్మి.. షాదీ ముబారక్‌, ఎవుసానికి రైతుబంధు.. పండిన పంటకు భరోసా.. చనిపోతే రైతుబీమా.. గొర్లు పెంచుకొంటే సబ్సిడీ..  వృద్ధాప్యంలో వితంతు పింఛను.. ఇవన్నీ తెలంగాణలోని ఒక పేద కుటుంబానికి అందిన పథకాలు. ఇంటిపెద్దను కోల్పోయిన కుటుంబానికి ప్రభుత్వం ఇంటిపెద్దగా నిలిచి ఆదుకొన్నది. ఇది ఒక కుటుంబ గాథ. ఇలాంటి గాథలు తెలంగాణలో ఊరూరా ఎన్నెన్నో.. 

ఇది దేశంలోని ఒకే ఒక్క ప్రభుత్వంతో.. ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలోనే సాధ్యపడింది. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేండ్లలో యావత్‌ దేశమే ఆశ్చర్యపోయేలా ఒక ప్రభుత్వం వందలకొద్దీ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేయడం 70 ఏండ్ల స్వతంత్ర దేశంలో కనీవినీ ఎరుగనిది!

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి నమస్తే తెలంగాణ: ఇంట్లో సంపాదించేటాయన చనిపోతే.. కుటుంబం ఛిన్నాభిన్నమై దిక్కుతోచని పరిస్థితి తలెత్తితే గతంలో అయితే ప్రభుత్వాలు పట్టించుకొనేవి కావు. కానీ తెలంగాణ ప్రభుత్వం మానవీయ దృక్ఫథంతో తీసుకొన్న విధాన నిర్ణయాలు లక్షల కుటుంబాల తలరాతల్ని మార్చేశాయి. వీధినపడాల్సిన ఎన్నో జీవితాలకు గొడుగులై నీడనిచ్చాయి. విధిరాతకు ఎదురు నిలిచే ధైర్యాన్నిచ్చాయి. కుటుంబం సాఫీగా నడిచేందుకు భరోసా కల్పించాయి. ఆత్మనిర్భరంతో జీవించేందుకు ఊతకర్రై నిలిచింది. ఇందుకు ఉదాహరణ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఓ గ్రామంలోని చిన్న రైతుకుటుంబం పరిస్థితి. ఎల్కతుర్తి మం డలం దామెర గ్రామంలో ఆవుల వెంకటయ్యది చిన్న రైతు కుటుంబం. ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఆయన రెండెకరాల భూమి ఉన్న సన్నకారు రైతు.

 బావిలోనే బోరేసుకొని వ్యవసాయం చేసుకొంటూ జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. ఏడాది క్రితం వెంకటయ్య అనారోగ్యంపాలై మరణించాడు. కడుపుల మం ట.. అల్సరన్నరు. ఆయన పట్టించుకోలేదు. తీరా క్యాన్సర్‌ నాలుగో స్టేజీ అన్నరు. అప్పటికే వ్యవసాయానికి అయిన అప్పులు. పెద్ద బిడ్డ పెండ్లికి చేసినవే ఐదారు లక్షల దాకా ఉన్నవి. ఊళ్లో వెంకటయ్యకు మంచి పేరుండేది. ఎవలకు కష్టమొచ్చినా తనకే వచ్చిందని ఉన్నదాంట్లో పదిమందికి సాయం చేసేగుణం ఉండేది. చేసిన అప్పులు మనసును నిమ్మలం లేకుండా చేస్తున్నా.. శరీరం లో రోగం ముదిరిపోతున్నా పట్టించుకోకుండా కాలం వెళ్లదీశాడు. తన అత్తగారి ఊరికే (వీణవంక మండలం వల్బాపూర్‌) బిడ్డను ఇచ్చిండు. బిడ్డ పెండ్లి అయిన కొద్దికాలానికే ఆయన తల్లి మరణించింది. ఆ తర్వాత 45 రోజులకే వెంకటయ్యను క్యాన్సర్‌ కబళించింది. ‘ఆయిన ఉన్నప్పుడు నాకేమీ తెల్వదు. అన్నీ ఆయినే చూసుకునేది. ఇప్పుడు మొత్తం చూసుకోవాల్సివస్తాంది.’ అని ఆయన భార్య లక్ష్మి తెలిపారు. 

ఊతకర్రలా నిలిచిన సర్కారు

వెంకటయ్య ఇల్లు చిన్నది. చిన్న దర్వాజా.. లోపలికి వెళ్లే రెండు గదులు.. ఇంటిముందు రేకులు. వెంకటయ్య చనిపోయిన తర్వాత ఆ కుటుంబం విచ్ఛిన్నం కాలేదు. ప్రభుత్వమే కుటుంబపెద్దగా నిలిచి కుటుంబాన్ని నిలిచేలాచేసింది. ప్రభుత్వం నుంచి అందిన ఒక్కో సంక్షేమ పథకం వారి జీవితానికి కొత్త వంతెనను నిర్మించాయి. ఆవుల వెంటయ్యకు ఉన్న రెండెకరాల వ్యవసాయభూమికి ప్రభుత్వం రైతుబంధు కింద రెండు దఫాలుగా నాలుగువేల చొప్పున ఎనిమిదివేలు అందించింది. వెంకటయ్య చనిపోయిన తర్వాత రైతుబీమా పథకం కింద పదిరోజుల్లోనే ఆయన భార్య లక్ష్మి బ్యాంక్‌ ఖాతాలో ఐదు లక్షల రూపాయలు జమయ్యాయి. వెంకటయ్య బిడ్డపెండ్లికి చేసిన అప్పులు, ఆయన వైద్యానికి అయిన అప్పులే ఐదారు లక్షలున్నాయి. ఒకదశలో బిడ్డకు పెట్టిన నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలను సైతం కుదువ పెట్టారు. ఈ పరిస్థితుల్లో బీమా సొమ్ము రావడంతో ఊరి పెద్ద మనుషులు, బంధువుల సమక్షంలో అప్పులు తీర్చారు. ‘సర్కారు మాకు పెద్దదిక్కు అయింది. దేవునోలే కేసీఆర్‌ ఆదుకున్నడు. లేకుంటే ఆ అప్పులు కట్టేందుకు ఉన్న భూమిని అమ్మి బాసిపోయెటోళ్లం. ఇంట్ల చేసే మనిషే పోయిండు. ఇగ ఉండి సాధించేది ఏంది అనుకున్న. పొరగాండ్లకు ఇంతపోసి నేనింత ఇసం (విషం) మింగుతే ఖతమైతది అనుకున్న (కంటిధారలుగా నీళ్లు).. కానీ బీమా సొమ్ము ఆదుకున్నది. అప్పులు కట్టినం. ఇంకా కొన్నున్నవి. పెద్దకొడుకు (శిమకుమార్‌) పన్నెండు చదివిండు. కవలలైన లక్ష్మణ్‌, రమ ఎల్కతుర్తి మోడల్‌స్కూల్‌లో తొమ్మిది చదువుతున్నరు’ అని వెం కటయ్య భార్య లక్ష్మి ఏడాదిక్రితం తనచుట్టూ ముసురుకున్న అప్పుల కుంపటిని వివరించింది.

ఒక కల్యాణలక్ష్మి.. రెండు కేసీఆర్‌ కిట్లు..

లక్ష్మి పెద్ద బిడ్డ పుష్పలీలకు మూడేండ్ల కిందట పెండ్లయింది. అప్పుడు కల్యాణలక్ష్మి కింద రూ.51,116 వచ్చినయి. ‘లేమిడి సంసారం. బిడ్డ పెండ్లి పెట్టుకున్నం. పైసలెట్లా అని రంది పడ్తాంటే మా ఊరోళ్లు ‘రంది పడకు బిడ్డ. కేసీఆర్‌ కల్యాణలక్ష్మి తెచ్చిండు, అప్పు ఇయ్యాల్నో రేపో తీరుద్ది. పెండ్లి అయితే చేయి అన్నరు. అప్పుడాయనే (భర్త వెంకటయ్య) అన్నీ చూసుకున్నడు. పెండ్లి అయినంక కొద్ది రోజులకు కల్యాణలక్ష్మి పైసలొచ్చినవి. అల్లుడు మంచోడు. మ్యా నరికం కాదు. నా లెక్కనే న్యాతోళ్లే. మా రాత బాగుండి మంచి అల్లుడు దొరికిండు. తొలుసూ రి కాన్పు మిషనాస్పటల్‌ (ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రి)లో అయింది. కేసీఆర్‌ కిట్‌ వచ్చింది. రెండో కాన్పు కూడా అక్కడే అయింది. అప్పుడూ కేసీఆర్‌ కిట్‌ ఇచ్చిండ్లు (ఇద్దరు మనవలే అని లక్ష్మి పేర్కొన్నప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు). నాక్కూడా పింఛన్‌ ఇస్తామంటున్నరు. మంజూరైంది అన్నరు’ లక్ష్మి చెప్పారు. లక్ష్మికి వితంతు పింఛన్‌ మంజూరైందని, కొత్తవాళ్లకు వేసినప్పు డు ఆమెకూ వస్తాయని గ్రామ కార్యదర్శి పేర్కొన్నారు. మా పెద్దబ్బాయి పుట్టిన కొద్దిరోజులకు  కేసీఆర్‌ కిట్‌ కింద రూ.12 వేలు ఖాతాలో డబ్బు లు పడ్డయి. రెండో కొడుకు పుట్టిన తరువాత  మూడు వేలు పడ్డవి అని పుష్పలీల పేర్కొన్నది. 

 గొర్ల సబ్సిడీకి డీడీ తీసినం

మా ఊళ్లో యాదవులం ఎక్కువ. మొదటిసారి 150 మందికి గొర్ల సబ్సిడీ వచ్చింది. మేము కూడా డీడీ తీసి ఇచ్చినం (రూ.32,250). ఆఫీసర్లు వచ్చి అన్ని అడిగిపోయిండ్లు. నాన్న చనిపోయినప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నం. మా నాన్న ఉన్నప్పుడు ఎకరానికి నాలుగువేల చొప్పున రెండుసార్లు ఎనిమిది వేలు వచ్చినవి. నాన్న చనిపోయాడు కాబట్టి పట్టా పాస్‌బుక్‌ (పట్టాదార్‌ పాస్‌బుక్‌) మార్చుకోమన్నరు. మొన్ననే మా అమ్మపేరు మీద మార్చినం. ఇప్పుడు ఎకరానికి ఐదు వేలు చొప్పున సంవత్సరానికి పదివేలు వస్తానయి. రెండెకరాల్లో వరిపెట్టినం. బోర్‌బాయిల నీళ్లకు కొదవలేదు. రెండు పంటలు పండిచ్చుకుంటున్నం. కేసీఆర్‌ సార్‌ పుణ్యమా అని ఇప్పటివరకైతే మంచిగనే ఉన్నం. కేసీఆర్‌ ఇచ్చిన రైతుబీమా రాకపోతే ఉన్న రెండెకరాల పొలం అమ్ముదామనుకున్నం. నిజంగా భూమి అమ్మితే చేసే పనిలేక, బయటికిపోయి బత్కలేక ఎట్లుండేదో. మా తమ్ముడు చెల్లె మోడల్‌ స్కూల్‌లో చదువుతున్నరు. వ్యవసాయం పనులు లేనిరోజుల్లో టైల్స్‌ వర్క్‌చేస్తా. ఇండ్లల్లో టైల్స్‌ పరుచుడు కూడా నేర్చుకున్న. కానీ ఇప్పుడు వ్యవసాయం పని తీర్తలేదు. మా పొలంలో పనిలేనప్పుడు అమ్మ వ్యవసాయ కూలీకి పోతది’ 

- శివకుమార్‌, లక్ష్మి పెద్దకొడుకు 

ఎవలకు ఒక్కపైస ఇవ్వలేదు...

రైతుబీమా సందర్భంలోకానీ, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు వచ్చిన సందర్భంలోకానీ, రైతుబంధు సొమ్ము వచ్చినప్పుడు కానీ, మళ్లీ నా పేరిట పట్టాదార్‌ పాస్‌బుక్‌ మార్చినప్పుడు కానీ ఎవరికీ ఒక్క పైస ఇవ్వలేదు. అన్యాలం ముచ్చట. నన్నెవరూ పైసలు అడగలేదు. నేను ఇయ్యలేదు.

- లక్ష్మి, వెంకటయ్య భార్య


logo