మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 02:29:59

ప్రతి రిజిస్ట్రేషనూ పండుగే

ప్రతి రిజిస్ట్రేషనూ పండుగే

  • ధరణితో అదనపు ఖర్చుల నుంచి విముక్తి
  • జిరాక్స్‌ ప్రతులు, ఫొటోల అవసరమే లేదు
  • సామాన్యుడికి అండగా తెలంగాణ సర్కారు

రిజిస్ట్రేషన్‌ అంటేనే పెద్ద తలకాయనొప్పి. పొద్దుగాల లేచి తాసిల్‌ ఆఫీస్‌కు ఉరుకాలె. జిరాక్స్‌లు, ఫొటోలు అన్నీ ఒకటికి రెండుసార్లు సూసుకోవాలె. సాక్షులను వెంట తీసకపొయ్యి వాళ్ల మర్యాదలు సూడాలె. అంత అయినంక.. ఏదో పేపర్‌ లేదనో, ఈ రోజు మస్తు మంది ఉండ్రు రేపు రాపో అని అధికారులంటరేమోనని ఒకటే భయం.. అట్లంటే మళ్లా తెల్లారి అదే ఉరుకుడు. జల్ది పని చేపిచ్చుకోనీకె బెంచికింద చేతులు పెట్టి పైసలిచ్చుడు అలాగనే.. ఇదంతా గతం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను ప్రహసనం కాదు పండుగలా చేశారు. టెక్నాలజీ వినియోగంతో పావుగంటలో పని ఖతమయ్యేలా ధరణి పోర్టల్‌ తీసుకొచ్చారు. రైతులకు అదనపు ఖర్చులు తగ్గించి అండగా నిలిచారు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతున్నది. ధరణి పోర్టల్‌ వల్ల ఈ-టెక్నాలజీ సాయంతో రిజిస్ట్రేషన్‌ సులభతరంగా.. అత్యంత పారదర్శకంగా మారింది. క్రయవిక్రయదారుల ఇబ్బందులను తీర్చింది. 

అదనపు ఖర్చుల భారం

గతంలో భూమిని కొనడం ఒక ఎత్తయితే.. దానిపై హక్కులను సంపాదించడం మరో ఎత్తుగా ఉండేది. సాధారణంగా కొనుగోలుదారుడే రిజిస్ట్రేషన్‌ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అందుకోసం విక్రయదారుడిని, సాక్షులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం అనేది కొనుగోలుదారుడి బాధ్యత. కొందరు విక్రయదారులు మాత్రం వారే ఆ ప్రక్రియను పూర్తిచేసినా.. ఖర్చును ముందుగా భూమి రేటులోనే కలుపుతారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఒక్కరోజులో.. అది నిర్ణీత వ్యవధిలో పూర్తయితే ఏం పర్వాలేదు. కానీ, ఈ తతంగమంతా రోజుల తరబడి సాగుతుండేది. ముందుగా ఒకరోజు విక్రయదారుడిని, సాక్షులను ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ వద్దకు తీసుకెళ్లి వివరాలను నమోదు చేయించుకునేవారు. అందుకు ఖర్చులన్నీ భూ కొనుగోలుదారే భరించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ రోజున కూడా అదే పరిస్థితి. అనుకోని కారణాల వల్ల నిర్ణీత సమయానికి విక్రయదారుడు రాలేకపోయినా, సాక్షులు లేకపోయినా, రిజిస్ట్రేషన్‌ అధికారి అందుబాటులో లేకున్నా అంతేసంగతి. మళ్లీ మరో రోజు ఆ పని పూర్తిచేసుకోవాల్సి వస్తుంది. ఇలా కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారీ భూ కొనుగోలుదారే ఖర్చులు భరించాల్సిన దుస్థితి. ఇద్దరు సాక్షులు, ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు నియమించుకున్న మధ్యవర్తి/ డాక్యుమెంట్‌ రైటర్‌కు టీలు, టిఫిన్లు.. భోజనాలు.. ప్రయాణ ఖర్చులు.. ఇతరత్ర ఖర్చులన్నీ కొనుగోలుదారే చెల్లించుకుంటాడు. భూలావాదేవీల్లో డాక్యుమెంట్లతోపాటు ఇతర ధ్రువీకరణ పత్రాలు అత్యంత కీలకం. చాలావరకు కొనుగోలుదారుడు, విక్రయదారుడు, వారి కుటుంబీకులు, సాక్షులు, వారి చిరునామాలను తెలిపే ఆధార్‌కార్డులు, ఫొటోలు కూడా అవసరం. వాటన్నింటికి సంబంధించిన ఖర్చులు కూడా కొనుగోలుదారే భరిస్తాడు. భూమి రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేనాటికి ఎంత లేదన్నా కనీసం రూ.10 నుంచి 15 వేల వరకు అదనంగా భారం పడేది. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక హక్కు పత్రాలను తీసుకునేందుకు సైతం కార్యాలయం చుట్టూ ఒకటికి పదిసార్లు తిరుగాల్సిన దుస్థితి.

మ్యుటేషన్‌కు ముప్పుతిప్పలు

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవడం ఒక వంతయితే.. భూమి మ్యుటేషన్‌ చేయించుకోవడంలోనూ అదే కాలాయాపన. పనులన్నీ పక్కన పెట్టుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతూ, పైసలు ముట్టజెప్పాలిన పరిస్థితి. వ్యవసాయ భూమి మ్యుటేషన్‌ కోసం ఎకరాకు 3 వేల వరకు కూడా వసూలుచేసిన సందర్భాలున్నాయి. అయినా పని పూర్తవుతుందా? అంటే అదీలేదు. మ్యుటేషన్‌ ప్రక్రియ ముగిసి హక్కుపత్రాలు, దస్తావేజులు వచ్చినా భూమి కొనుగోలుదారులకు మనసులో ఎక్కడో ఒక మూల అనుమానం.. భయం ఉండేది. ఆ భూమిని ఎవరు కబ్జా చేస్తారో? ఎవరు? ఎప్పుడు ఏ వివాదాల్లోకి లాగుతారోనని నిత్యం ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి. కొందరయితే ఆర్థికభారమైనా కొన్న భూమిచుట్టూ ఫెన్సింగ్‌ నిర్మించుకున్నారు. 

బిడ్డలకు పసుపు కుంకుమ

మిర్యాలగూడ రూరల్‌: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కాల్వపల్లికి చెందిన మెండెబోయిన లక్ష్మయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద బిడ్డను 2010లో రమేశ్‌కు ఇచ్చి పెండ్లిచేసి కానుకగా 30 గుంటల భూమిని, రెండోబిడ్డ మంగమ్మను 2014లో నగేశ్‌కు ఇచ్చి పెండ్లిచేసి.. పసుపు కుంకుమల కింద 23 గుంటల భూమిని కానుకగా ఇస్తానని రాసిచ్చారు. ఎప్పుటి నుంచో భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఇద్దరి బిడ్డలను తండ్రి కోరుతున్నా అంత ఖర్చు పెట్టుకోలేమని, రెవెన్యూ అధికారులు ఇబ్బంది పెడుతారని కాలం గడుపుతూ వచ్చారు. ధరణి గురించి తెలుసుకొన్న తండ్రి.. స్లాట్‌ బుక్‌ చేశారు. పెద్ద కూతురుకు బుధవారం, చిన్న కూతురుకు శుక్రవారం భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీంతో భూమి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలనే వారి రంది తీరిపోయింది. తన బిడ్డల కండ్లల్లో ఆనందం చూసి ఆ తండ్రి ఖుషీ ఆయ్యాడు.

నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌.. ఇంటికే దస్ర్తాలు..

ధరణి పోర్టల్‌ కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిస్తున్నది. అదనపు ఖర్చులకు చెక్‌ పెడుతున్నది. కట్టుదిట్టమైన భూహక్కులను కల్పిస్తుండడంతో మానసిక ప్రశాంతతను చేకూర్చుతున్నది. పదిసార్లు కార్యాలయాలకు తిరుగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నది. విక్రయదారుడు, సాక్షుల వివరాలు ఉంటే చాలు.. వాటిని ఒక్కరే ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఎక్కడా ఎలాంటి జిరాక్స్‌ కాపీలను, ఫొటోలను సమర్పించాల్సిన అవసరమే లేదు. కేవలం స్లాట్‌బుక్‌ చేసుకున్న రోజున నిర్ణీత సమయానికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అధికారులు బయోమెట్రిక్‌ ద్వారా భూకొనుగోలుదారులు, విక్రయదారుడు, సాక్షుల వివరాలను నమోదు చేసుకుంటారు. తరువాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను, మ్యుటేషన్‌ను నిముషాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవేళ అప్పటికే పాస్‌బుక్‌ ఉంటే అందులో కొనుగోలు చేసిన వివరాలను నమోదుచేసి అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసి అందజేస్తున్నారు. లేదంటే అధికారికంగా వెంటనే ఈ-పాస్‌బుక్‌ను ఇస్తున్నారు. తరువాత కొత్త పాస్‌బుక్‌లను తయారుచేసి నేరుగా కొనుగోలుదారుడి ఇంటికే పంపడం విశేషం. రిజిస్ట్రేషన్‌ కోసం దూరం వెళ్లకుండా సమీప తాసిల్దార్‌ కార్యాలయంలోనే ఆ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రయాణభారం తప్పింది. భూ ఆక్రమణలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆన్‌లైన్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేయడంతో కబ్జాకు గురవుతాయోననే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. పోర్టల్‌ సేవలతో భూలావాదేవీలు పండుగలా మారాయి.