మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 01:54:24

ప్రతి నోట.. గులాబీ మాట

ప్రతి నోట.. గులాబీ మాట

దుబ్బాకలో కారు జోరు.. కాంగ్రెస్‌, బీజేపీల్లో వణుకు టీఆర్‌ఎస్‌కు ముంపువాసుల బాసట

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో కారు జోరు మీదుంది. ఏ నోట విన్నా.. గులాబీ మాటే వినవస్తున్నది. రచ్చబండ.. హోటళ్లు.. చౌరస్తాలు.. ఇలా అన్ని చోట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనే ప్రధాన చర్చ  సాగుతున్నది. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాలైన పల్లెపహాడ్‌, వేములఘాట్‌, రాంపూర్‌, లక్ష్మాపూర్‌ వాసులు అండగా నిలిచారు. నాడు ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నిలిచిన ఆ ముంపు గ్రామాలు.. ఇవాళ టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నాయి. ముక్తకంఠంతో ఊళ్లకు ఊళ్లు గులాబీ పార్టీకి జైకొడుతున్నాయి. ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు కదిలివచ్చి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు మద్దతు లేఖలు ఇచ్చి, ‘కేసీఆర్‌ వెంటే మేము’ అంటూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. తమకు ఏం కావాలన్న సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ముంపు గ్రామాల వారు బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గంలోని పలు గ్రామాలు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. - సిద్దిపేట, నమస్తే తెలంగాణ

దుబ్బాక నియోజకవర్గంలోని కాంగ్రెస్‌, బీజేపీ, టీజేఎస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, వందలాది మంది కార్యకర్తలు, నాయకులు మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ జోష్‌కు.. గ్రామాల ఏకగ్రీవ తీర్మానాల ధాటికి కాంగ్రెస్‌, బీజేపీల్లో అప్పుడే వణుకు మొదలైంది. ఈ నెల 9 నుంచి ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల వాతావారణం మరింతగా వేడెక్కింది. ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు 20 రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో సుమారుగా 146 గ్రామాలంటాయి. వీటిలో ఇప్పటికే 45కి పైగా గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. ఆయా మండలాలకు బాధ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, వారి అనుచరులు, స్థానిక నాయకులు గడప గడపకూ వెళ్లి, ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆరేండ్లలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకెళ్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. గ్రామాలకు వెళ్లినప్పుడు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణంలో నాడు ప్రతిపక్షాలు చేసిన రాద్ధాంతాన్ని ప్రజలకు విడమరిచి చెబుతున్నారు. ఇవాళ ప్రభుత్వం పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్కో ఇల్లు రూ.20 లక్షల విలువ చేసే డబుల్‌ బెడ్రూం ఇండ్లు కట్టిస్తున్న విషయాన్ని ముంపు గ్రామాల ప్రజలకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు వివరిస్తున్నాయి.

కుల, యువజన సంఘాల మద్దతు

దుబ్బాక: సీఎం కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు.. అభివృద్ధికి కుల, యువజన సంఘాలు జైకొడుతున్నాయి. ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని వారు స్పష్టంచేశారు. సోమవారం దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి సమక్షంలో ఎస్సీ మాల కుల సంఘం వారు, గోసాన్‌పల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ కైలాష్‌ సమక్షంలో ముదిరాజ్‌ కులస్థు లు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు. బల్వంతాపూర్‌లో ముదిరాజ్‌ కులస్థులు ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించారు.

దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి ఇలా..

దుబ్బాక నియోజకవర్గాన్ని ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది. ఈ ఆరేండ్లలో ఇంటింటికి తాగునీటిని అందించి ప్రజల నీటి గోసను తీర్చింది. వచ్చే ఏడాదిలోగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను ప్రతి ఎకరాకు అందించనున్నది. ఇప్పటికే తొగుట, దుబ్బాక మండలాల్లోని కొన్ని చెరువులను గోదావరి జలాలతో నింపింది. ప్రధానకాల్వల నిర్మాణంతోపాటు పిల్ల కాల్వల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతు బంధు పథకం కింద 76,912 మందికిగాను రూ.77.60 కోట్ల మేర ఈ వానకాలంలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించి ఆసరాగా నిలిచింది. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబానికి రైతుబీమా కింద ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందించి భరోసానిచ్చింది. చేనేత, బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లను అందజేస్తున్నది. మొత్తం 52,823 మందికి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నది. కల్యాణ లక్ష్మి పథకం కింద 5,599 మందికి, షాదీముబారక్‌ కింద 322 మందికి చెక్కులను అందజేశారు. ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్ది, మెరుగైన వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దీంతో పేద ప్రజలకు సౌకర్యవంతమైన వైద్యం అందడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్‌ కిట్‌ కింద 29,083 మంది మహిళలు లబ్ధిపొందారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం నియోజకవర్గ ప్రజలకు అందేలా చూడటంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు.


logo