సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 19:08:34

భూముల మాదిరిగానే ఇండ్లకు భద్రత కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం

భూముల మాదిరిగానే ఇండ్లకు భద్రత కల్పించాలన్నదే  సీఎం కేసీఆర్ ధ్యేయం

హైదరాబాద్ : వ్యవ‌సాయ దారుల‌కు ప‌ట్టాదారు పాసు పుస్తకాల త‌ర‌హాలో గ్రామాల్లో ఇండ్లకు కూడా మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. కావున ఆయా వివ‌రాల‌తో కూడిన రికార్డును ప‌క‌డ్బందీగా త‌యారు చేయాల‌ని అధికారులను పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేర‌కు గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాల‌ని మంత్రి సూచించారు. పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయ‌తీరాజ్ క‌మిష‌న‌ర్ ర‌ఘునంద‌న్ రావు, ఇత‌ర అధికారులతో మంత్రి హైద‌రాబాద్ లోని మంత్రులు నివాసంలో స‌మావేశ‌మై ఆయా అంశాల‌పై చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా వ్యవ‌సాయ భూముల‌కు మాదిరిగానే  గ్రామాల్లోని ఇండ్లు, ఇత‌ర అన్ని ర‌కాల నిర్మాణాల‌కు కూడా భ‌ద్రత క‌ల్పిస్తూ  ప‌ట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించార‌న్నారు. భూముల‌కు భ్రదత క‌ల్పించ‌డంతోపాటు ఆయా భూ, ఇండ్ల య‌జ‌మానుల‌కు భ‌రోసానివ్వాల‌న్నదే సీఎం ల‌క్ష్యమన్నారు. ఇందుక‌నుగుణంగా గ్రామాల్లోని ప్రతి ఇల్లు, ఇత‌ర నిర్మాణాల వివ‌రాలు, వ్యవ‌సాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వ‌గైరాల‌న్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాల‌న్నారు.

అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహ‌లుంటే తొల‌గించాల‌ని చెప్పారు. కేవ‌లం భ్రదత క‌ల్పించ‌డ‌మే త‌ప్పా ఇందులో హిడెన్ ఎజెండా ఏదీ లేద‌నే విష‌యాన్ని ప్రజల‌కు అర్థం చేయించాల‌న్నారు.  ద‌ళారులు, ఇత‌రులెవ‌రికీ డ‌బ్బులు కూడా ఇవ్వాల్సిన ప‌నిలేద‌ని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జ‌రుగుతుంద‌న్న విష‌యంపై ప్రజల్లో అవ‌గాహ‌న‌ పెంచాల‌ని మంత్రి సూచించారు.


logo