ఆదిలాబాద్ సోయాబీన్‌కు, మహబూబ్‌నగర్ చిరుధాన్యాలకు చిరునామా అని ఎప్పటినుంచో తెలుసు. ఈ రెండే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఒక్కో ఆహార ఉత్పత్తికి కేంద్రంగా ఉన్నాయి. ఒక్కో జిల్లాకు ఒక్కో ఆహారపంట ఫేమస్ అని కేంద్రప్రభుత్వం గుర్తింపునిచ్చింది. వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రొడక్ట్ కింద జిల్లాలవారీ ఉత్పత్తులకు ఆమోదముద్ర వేసింది. బ్రాండింగ్, మార్కెటింగ్‌కు అనుకూలంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నది.
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ‘వన్ డిస్ట్రిక్ట్-వన్ ప్రొడక్ట్’ పథకంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రధాన ఆహార ఉత్పత్తిని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. జిల్లాల్లోని ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్ర నోడల్ ఏజెన్సీ గుర్తించి కేంద్రానికి నివేదించగా, ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారులు జిల్లాలవారీగా ఆయా ఉత్పత్తులకు బ్రాండింగ్‌తోపాటు మార్కెటింగ్‌కు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అసంఘటిత పరిశ్రమలకు ఆర్థికసాయం చేసి, అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 707 జిల్లాల్లో జిల్లాలవారీ ఉత్పత్తులను కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఇటీవల ఆమోదించింది. సొంతగా పరిశ్రమలు నిర్వహిస్తున్నవారికి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓ), స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ), సహకార సంఘాలకు ఆర్థిక సహాయం అందించటం, ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించటం ద్వారా సంఘటిత సైప్లె చెయిన్‌లోకి తేవటం కోసం జిల్లాలవారీ ఉత్పత్తులను ప్రకటించింది. 2025 నాటికి దేశవ్యాప్తంగా 2 లక్షల చిన్న పరిశ్రమలకు రూ.10 వేల కోట్ల సహాయం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రాష్ట్రం నుంచి 4,700 పరిశ్రమలకు దాదాపు రూ.500 కోట్ల ఆర్థిక సహాయం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ సహాయంతో పరిశ్రమలకు కామన్ ప్రాసెసింగ్ సౌకర్యం, ల్యాబోరేటరీలు, స్టోరేజీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్, శిక్షణ, సాంకేతిక సహకారం, ఇంక్యుబేషన్ సేవలు కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణకు తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల కమిటీలను ఏర్పాటుచేశారు. జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలున్నవాటిని ఆమోదం కోసం రాష్ట్రస్థాయి కమిటీకి సిఫారసు చేస్తాయి.
జిల్లాల వారీగా గుర్తించిన ఉత్పత్తులు
ఆదిలాబాద్-సోయాబీన్ ఉత్పత్తులు (సోయా మిల్క్, సోయా టోఫు, సోయా కర్డ్). భద్రాద్రి కొత్తగూడెం-మిరప. హైదరాబాద్-రెడీ టు ఈట్ (స్నాక్స్ అండ్ సావరీస్). జగిత్యాల-మామిడి. జనగామ-బియ్యం ఆధారిత ఉత్పత్తులు (సెంటెడ్ రైస్-చిట్టిముత్యాలు). జయశంకర్భూపాలపల్లి-మిరప. జోగులాంబగద్వాల-వేరుశనగ ఉత్పత్తులు. కామారెడ్డి-సోయాబీన్ ఆధారిత ఉత్పత్తులు. కరీంనగర్-బియ్యం ఆధారిత ఉత్పత్తులు. ఖమ్మం-మిరప. కుమ్రంభీం ఆసిఫాబాద్-చిరుధాన్యాల ఉత్పత్తులు. మహబూబాబాద్-మిరప. మహబూబ్‌నగర్-చిరుధాన్యాలు (జొన్నలు, రాగులు, మైనర్ మిల్లెట్స్, చిరుధాన్యాల ఆధారిత బేకరీ ఉత్పత్తులు, స్నాక్స్). మంచిర్యాల-మామిడి. మెదక్-రెడీ టు ఈట్ (స్నాక్స్ అండ్ సావరీస్). మేడ్చల్‌మల్కాజ్‌గిరి- రెడీ టు ఈట్ (స్నాక్స్ అండ్ సావరీస్). ములుగు-మిరప. నాగర్‌కర్నూల్-మామిడి. నల్లగొండ-స్వీట్ఆరెంజ్. నారాయణపేట-వేరుశనగ ఆధారిత ఉత్పత్తులు (చిక్కీ మేకింగ్, స్నాక్ యూనిట్స్ తదితరాలు). నిర్మల్-సోయాబీన్ ఉత్పత్తులు, నిజామాబాద్-పసుపు. పెద్దపల్లి-బియ్యం ఆధారిత ఉత్పత్తులు. రాజన్న సిరిసిల్ల-చేపల ఆధారిత ఉత్పత్తులు. రంగారెడ్డి-కూరగాయలు (టమాట, వంకాయ, పచ్చి మిరప, పొట్లకాయ, బీన్స్, చిలగడదుంప, పచ్చళ్లు, డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్, ప్యాక్ హౌసెస్, కట్ వెజిటేబుల్స్) సంగారెడ్డి-పాల ఉత్పత్తులు (ఫ్లేవర్డ్ మిల్క్, నెయ్యి, పెరుగు, పనీర్ తదితర కలెక్షన్ సెంటర్లు), సిద్దిపేట-కూరగాయలు (టమాట, పచ్చిమిరప, వంకాయ, పొట్లకాయ, బీన్స్, చిలగడ దుంప, పచ్చళ్లు, డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్, ప్యాక్ హౌసెస్, కట్ వెజిటేబుల్స్). సూర్యాపేట-పాల ఉత్పత్తులు, వికారాబాద్- కూరగాయలు. వనపర్తి-వేరుశనగ ఉత్పత్తులు. వరంగల్ రూరల్-మిరప (బాంబూ చిల్లీ). వరంగల్ అర్బన్-రెడీ టు ఈట్ (స్నాక్స్ అండ్ సావరీస్). యాదాద్రి భువనగిరి-పాల ఉత్పత్తులు.