శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Aug 11, 2020 , 20:37:19

ఏఎమ్మార్పీ కింద ప్ర‌తీ ఎక‌రాకు సాగునీరు : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

ఏఎమ్మార్పీ కింద ప్ర‌తీ ఎక‌రాకు సాగునీరు : ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి

న‌ల్ల‌గొండ : ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి(ఏఎమ్మార్పీ) ప్రాజెక్టు కింద ప్ర‌తీ ఎక‌రాకు సాగునీరు అందించ‌నున్న‌ట్లు న‌ల్ల‌గొండ ఎమ్మెల్యే కంచ‌ర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. చంద‌న‌ప‌ల్లి వ‌ద్ద‌ డి39, డి 40 డిస్టిబ్యూట‌రీ కాలువ‌ల‌కు ఎమ్మెల్యే నీటిని విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... ఎమ్మార్పీ డిస్టిబ్యూట‌రీ కెన్సాల్స్ కింద ప్ర‌తీ ఎక‌రాకు సాగునీరును అందించ‌నున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటు గ్రామాల్లోని చెరువుల‌ను నింప‌నున్న‌ట్లు చెప్పారు. నీటి వృథా లేకుండా రైతులు ఉప‌యోగించుకోవాల‌ని పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ తీసుకున్న చ‌ర్య‌ల‌తో యాసంగిలో రాష్ర్టంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబ‌డి సాధ్య‌ప‌డింద‌న్నారు. దేశంలో ఎఫ్‌సీఐ కొనుగోలు చేసిన ధాన్యంలో 65 శాతం తెలంగాణ నుంచే సేక‌రించింద‌న్నారు. క‌రోనా సంక్షోభంలో సైతం రైతుల‌కు ఎటువంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు రాష్ర్టం ప్ర‌భుత్వం ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌ల్ల‌గొండ మున్సిప‌ల్ చైర్మ‌న్ మందాడి సైదిరెడ్డి, నీటిపారుద‌ల‌శాఖ అధికారులు పాల్గొన్నారు.