గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 06:41:15

యువతుల ఫొటోలతో.. బోల్తా కొట్టించాడు..

యువతుల ఫొటోలతో.. బోల్తా కొట్టించాడు..
  • ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌..

హైదరాబాద్ : అమ్మాయిల ఫొటోలతో ఓ విద్యార్థి బోల్తా కొట్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌ నుంచి అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి.. వాటిని ఓ డేటింగ్‌ సైట్‌లో అప్‌లోడ్‌చేసి... తానే అమ్మాయిలాగా సెక్స్‌ చాట్‌ చేసేవాడు.. చాట్‌ను బట్టి డబ్బులు వసూల్‌ చేసేవాడు... ఇలా చాట్‌ చేస్తూ పలువురు యువకులను మోసం చేశాడు. 10 నెలల కాలంలో రూ.20లక్షల వరకు కాజేశాడు.. ఓ యువతి ఫిర్యాదుతో  సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. విచారణలో పట్టుబడ్డ విద్యార్థి చార్టెడ్‌ అకౌంటెంట్‌ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నాడని తేలింది. 

సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ విజయనగరానికి చెందిన వెన్నెల వెంకటేశ్‌ యూసుఫ్‌గూడ, శ్రీరామ్‌నగర్‌లో నివాసముంటూ సీఏ(చార్టెడ్‌ అకౌంటెంట్‌) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అందమైన అమ్మాయిల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసి... వాటిని టిండర్‌ డేటింగ్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి... ఒక ఐడీని క్రియేట్‌ చేసేవాడు. ఆ ఐడీతో ఆ యాప్‌లో అమ్మాయి మాదిరిగా అబ్బాయిలతో చాటింగ్‌ ప్రారంభించాడు. ఆ ఐడీలో కేవలం వాట్సాప్‌ నంబర్‌ మాత్రమే ఉంటుంది... ఫోన్‌ చేసేందుకు అవకాశముండదు. ఆ డేటింగ్‌ సైట్‌లోకి వచ్చేవారు అమ్మాయి ఫొటో చూసి.. చాటింగ్‌ చేసేవారు. చాటింగ్‌ చేసేవారితో విద్యార్థి మొదట హాయ్‌.. హౌ ఆర్‌ యు అంటూ మాట్లాడుతూ బుట్టలోకి దింపేవాడు. సెక్స్‌ చాట్‌ కావాలంటే రూ. 100 నుంచి రూ. 300,  నగ్న ఫొటోలు కావాలంటే రూ. 300 నుంచి రూ. 500 వరకు డిపాజిట్‌ చేయాలంటూ సూచించేవాడు. దీంతో చాలామంది డబ్బులు డిపాజిట్‌ చేసేవారు. అయితే చాటింగ్‌, నగ్న ఫొటోల వరకు డబ్బులు వసూలు చేసి ఆ తరువాత ఆ నంబర్లను బ్లాక్‌ చేసేవాడు. 

ఫొటోలతో.. యువతి పెండ్లి రద్దయ్యింది..!

నగరానికి చెందిన ఓ యువతికి ఇటీవల నిశ్చతార్థం జరిగింది. అయితే ఆ యువతి ఫొటో డేటింగ్‌ సైట్‌లో ఉందంటూ.. యువకుడికి సంబంధించినవారు చెప్పారు. ఈ విషయం బాధిత యువతికి తెలిసింది. వెంటనే ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. ఆ ఫొటోలతో బాధితురాలి పెండ్లి కూడా రద్దయ్యినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితుడిని పట్టుకోడం కోసం సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. ఒక వ్యక్తితో చాటింగ్‌ చేయించారు. వెంకటేశ్‌ అమ్మాయి మాదిరిగా చాట్‌ చేస్తూ.. సెక్స్‌ చాట్‌ కావాలంటే ఫలాన బ్యాంకు ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ చేయాలంటూ సూచించాడు. ఆ ఖాతాలో డబ్బు డిపాజిట్‌ చేసి, ఆ ఖాతా నంబర్‌ ఆధారంగా అతన్ని గుర్తించారు. పోలీసుల విచారణలో 10 నెలల కాలంలో.. ఆ ఖాతాలో రూ.20 లక్షల వరకు డిపాజిట్‌ అయినట్లు గుర్తించారు. బాధితుల్లో తెలుగు రాష్ర్టాలవారే ఎక్కువగా ఉన్నారు. ఈ మేరకు నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. 


logo
>>>>>>