సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 00:57:35

అసలేంటీ టీకా? క్లినికల్‌ ట్రయల్స్‌ ఎలా చేస్తారు?

అసలేంటీ టీకా? క్లినికల్‌ ట్రయల్స్‌ ఎలా చేస్తారు?

  • వలంటీర్ల ఎంపిక ఎలా జరుగుతుంది?‘
  • నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వాక్సిన్‌.. వ్యాధులపై పోరాడే వజ్రాయుధం ఇది. శాస్త్రవేత్తలు అందించిన వరం ఇది. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే సంజీవని ఇది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో దీని గురించే చర్చ జోరుగా సాగుతున్నది. ఇప్పటికే కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైన నేపథ్యంలో చాలా మందిలో క్లినికల్‌ ట్రయల్స్‌ ఎలా జరుగుతాయి? వలంటీర్లను ఎలా ఎంపిక చేస్తారు? ఎంత మందిపై ప్రయోగిస్తారు? వ్యాక్సిన్‌ ఎన్ని రోజులకు అందుబాటులోకి వస్తుంది? వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యాక్సిన్‌ తయారీ వెనుక వందల మంది కఠోర శ్రమ దాగుటుంది. ప్రతీ దశ ఒక అగ్నిపరీక్షే. వ్యాక్సిన్‌ అభివృద్ధిలో భాగంగా మొదట ఎలుకలు, కుందేళ్లు, తదితర జంతువులపై దీన్ని ప్రయోగిస్తారు. వాటిపై సత్ఫలితాలు వస్తే మనుషులపై ప్రయోగాలు ప్రారంభిస్తారు. దీన్నే క్లినికల్‌ ట్రయల్స్‌ అంటారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. 1. వలంటీర్ల ఎంపిక; 2. వ్యాక్సిన్‌ ప్రయోగం; 3. పనితీరుపై పరిశీలన; 4. ఫలితాల విశ్లేషణ.

ఎలా ఎంపిక చేస్తారు?

వ్యాక్సిన్‌ తయారీలో వలంటీర్లను ఎంపిక చేయడం అత్యంత కీలకమైన దశ. క్లినికల్‌ ట్రయల్స్‌కు 18 ఏండ్లకు పైబడిన సంపూర్ణ ఆరోగ్యవంతులనే ఎంపిక చేస్తారు. బీపీ, షుగర్‌, ఆస్తమా, గుండెబ్బులు, కిడ్నీ సంబంధ సమస్యలు వంటి దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు. ఆ రోగాల ప్రభావం వ్యాక్సిన్‌ పనితీరుపై పడొద్దనే ఉద్దేశంతో ఇలా వడపోస్తారు. వలంటీర్ల రక్తనమూనాలు సేకరించి ఢిల్లీలోని సెంట్రల్‌ కమిటీకి పంపిస్తారు. అక్కడ హిమోగ్లోబిన్‌ శాతం, రక్తానికి సంబంధించిన పూర్తి సమాచారం, హెచ్‌ఐవీ వంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా? అని పరీక్షిస్తారు. ఇందులో హిమోగ్లోబిన్‌ శాతం ప్రధానమైనది. చివరగా నివేదికలన్నీ పరిశీలించి వలంటీర్ల తుది జాబితాను తయారుచేస్తారు.నిమ్స్‌లో కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు 200 మందికిపైగా ముందుకురాగా 60 మంది శాంపిళ్లను ఢిల్లీకి పంపినట్టు సమచారం. 

ఎంత డోస్‌ ఇస్తారు?

ఎంపికైన వలంటీర్లలో కొందరిపై మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తారు. తక్కువ మోతాదులో డోస్‌ ఇచ్చి పరీక్షలు చేస్తారు. ఫేజ్‌-2, ఫేజ్‌-3లో డోస్‌ పరిమాణాన్ని, వలంటీర్ల సంఖ్యను పెంచుతారు. 




ఎలా పరీక్షిస్తారు?

ప్రయోగించిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాక్సిన్‌ పనిచేయడం మొదలవుతుంది. మొదటిదశలో వలంటీర్లను 14 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. డాక్టర్లు తరుచూ వారిని పరీక్షిస్తారు. ఫేజ్‌-2లో నిర్ణీత సంఖ్యలో స్త్రీలు, పురుషులను ఎంపిక చేస్తారు. ఇందులో 18 ఏండ్ల నుంచి వృద్ధుల వరకు వివిధ వయస్కులవారు ఉంటారు. వారికి వివిధ పరిమాణాల్లో వ్యాక్సిన్‌ డోస్‌ ఇస్తారు. ప్రారంభంలోనే ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించి నయం చేస్తారు. ఫేజ్‌-3లో వేలమందిపై ప్రయోగాలు చేస్తారు.

వ్యాక్సిన్‌ అంటే.. 

వ్యాక్సిన్‌ అంటే బలహీనపడ్డ, చనిపోయిన వ్యాధికారక సూక్ష్మజీవి. వ్యాక్సిన్‌ అనే పదాన్ని బ్రిటన్‌ వైద్యుడు ఎడ్వర్డ్‌ జెన్నర్‌ తొలిసారి పలికారు. 1798లో మశూచిపై పరిశోధనలు చేస్తున్నపుడు వాడుకలోకి వచ్చింది. లాటిన్‌ భాషలోని వాకా అనే మాట నుంచి వ్యాక్సిన్‌ వచ్చింది. లాటిన్‌ భాషలో వాకా అంటే ఆవు. శాస్త్రవేత్తలు ముందుగా వైరస్‌/బ్యాక్టీరియా కణాలను సేకరించి రసాయన చర్య ద్వారా వాటిని న్యూట్రలైజ్‌ (జీవం లేకుండా) చేస్తారు. ఆ తర్వాత రసాయనాలతో ‘స్టెరిలైజ్‌' చేస్తారు. దీంతో శాంపిల్‌లో ఇంకా అది బతికి ఉన్నా, వాటి మృతకణాల్లో ఏవైనా విషపదార్థాలు ఉన్నా అవన్నీ నూట్రలైజ్‌ అవుతాయి. దీనినే మనం వ్యాక్సిన్‌ అని పిలుస్తాం. 


logo