శనివారం 06 జూన్ 2020
Telangana - May 02, 2020 , 01:44:20

కండ్లకు కనిపించట్లేదా..!

కండ్లకు కనిపించట్లేదా..!

  • పక్కాగా పనిచేస్తుంటే విమర్శలా?
  • విపక్షాలపై మంత్రి ఈటల ఆగ్రహం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు ప్రతిపక్ష నేతల కండ్లకు కనిపించడంలేదా అని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నిర్ణయాలు తీసుకొంటున్నామని స్పష్టంచేశారు. శుక్రవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని విజయవంతంగా కట్టడి చేస్తున్నా విమర్శలు చేయడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ సర్కారుపై ఎంతో నమ్మకం ఉన్నదని, ప్రభుత్వం ఏం చేసినా వారి బాగుకోసమేనన్న భావన ప్రజల్లో బలంగా ఉన్నదని పేర్కొన్నారు. రాష్ర్టానికి వచ్చే రూ.11 వేల కోట్ల ఆదాయాన్ని సైతం పక్కన పెట్టి సీఎం కేసీఆర్‌ ప్రజల ప్రాణాలను కాపాడుకొనేందుకు పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు దాస్తే దాగేవి కావని, ఐసీఎమ్మార్‌ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలున్నవారిని, పాజిటివ్‌ వ్యక్తులతో కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని వివరించారు. 

ప్రధానిని విమర్శిస్తే అడ్డుకున్నాం..

కొవిడ్‌ వ్యాప్తిపై అసెంబ్లీ సమావేశంలో చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించడాన్ని సీఎం కేసీఆర్‌ అడ్డుకున్నారని, కరోనా మానవాళికి ముప్పుగా మారిందని, జాతి అంతా ఎదుర్కోవాలని నిండు సభలో ప్రకటించారని గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల బాధ్యతలేని బీజేపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారని, వారికి స్వప్రయోజనం తప్ప ప్రజాకోణం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్ర బృందాలు ప్రశంసిస్తే ‘మీరు చెప్తున్నది నిజమేనా.. నిజంగా అలా ఉందా’ అని అడుగుతున్నారంట.. ఇది వారి నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. శుక్రవారం నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇప్పటికే పాజిటివ్‌ వచ్చినవారి కుటుంబసభ్యులని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. 

శ్వాస సంబంధ ఇన్ఫెక్షన్లుంటే నమోదు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ దవాఖానల్లో తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో (సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇలెసెన్‌- ఎస్‌ఏఆర్‌ఐ) చేరుతున్న వారి వివరాలను నమోదు చేయాలని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు ఆదేశించారు. ఇదివరకు అందించిన మాన్యువల్‌ వివరాల ఆధారంగా ఏప్రిల్‌లో 1,500 ఎస్‌ఏఆర్‌ఐ రోగులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, అందులో 81 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలిపారు. 

కొత్తగా 6 పాజిటివ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్‌ఎంసీలో 5, రంగారెడ్డి జిల్లాలో ఒక కేసు ఉన్నాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,044కు చేరింది. 22 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం గాంధీ దవాఖానలో 552 మంది చికిత్స పొందుతున్నట్టు ప్రజారోగ్యశాఖ బులెటిన్‌ విడుదలచేసింది. మొత్తం డిశ్చార్జిల సంఖ్య 464కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాలు కరోనా రహితంగా మారాయి.


logo