శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:16

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్ష

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్ష

  • పరీక్షలు, చికిత్సకు ప్రైవేట్‌కు అనుమతి
  • ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వైద్యం
  • భయాందోళనలకు గురిచేస్తే కఠినచర్యలు
  • ప్రభుత్వ దవాఖానల్లో ఉచితమే
  • గాంధీలో రెండువేలమందికైనా చికిత్స
  • ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాల మేరకే చర్యలు
  • మిగతా నగరాలతో పోలిస్తే మనం బెటర్‌
  • వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రైవేటు దవాఖానల్లో పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వడంతోపాటు.. అందుకు వసూలు చేయాల్సిన ధరలను కూడా నిర్ణయించింది. కరోనా  లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కరోనా పరీక్షకు గాను ఒక్కొక్కరికి రూ. 2,200 మాత్రమే ఫీజుగా తీసుకోవాలని 

ఆదేశించింది. ప్రైవేటు దవాఖానల్లో అందిస్తున్న చికిత్సకు నిర్దిష్ట ధరలను ప్రకటించింది. 

సాధారణ చికిత్సకు రోజుకు రూ.4 వేలు, వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూ లో ఉంచితే రోజుకు రూ.7500, వెంటిలేటర్‌పై ఉంచితే రోజుకు రూ.9 వేలు వసూలు చేయాలని నిర్దేశించింది. సోమవారం బీఆర్కే భవన్‌లో మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌తో కలిసి వైద్యశాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కోఠి కమాండ్‌ సెంటర్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రైవే టు దవాఖానల్లో కరోనా పరీక్షలకు, చికిత్సకు అనుతించామన్న మంత్రి ఈటల.. అందుకు సంబంధించిన ధర లు, అనుసరించాల్సిన మార్గదర్శకాలను వెల్లడించారు.

లక్షణాలు ఉంటేనే పరీక్ష

కరోనా లక్షణాలు ఉంటేనే డాక్టర్‌ సూచన మేరకు పరీక్ష చేయాల్సి ఉంటుందని ఈటల  చెప్పారు. లక్షణాలు లేకుండా ఉంటే ఐసీఎంఆర్‌ ప్రకారం, హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలిపారు. లక్షణాలు ఉండి దవాఖాన అవసరముంటేనే చికిత్స అందించాల్సి ఉంటుందని, ఇం దుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుంను వసూలు చేయాలని సూచించారు. 

పది రోజుల్లో 50 వేల పరీక్షలు 

హైదరాబాద్‌లో ఎంత వ్యాప్తి ఉందో తెలుసుకొనేందుకు ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో కంటైన్‌మెంట్‌ జోన్లు, వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోసహా అన్ని ప్రాంతాల్లో  మొత్తం 50వేల పరీక్షలు చేయనున్నామని ఈటల చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ కింగ్‌కోఠి దవాఖానలో ఎంతమంది వస్తే అంతమందికి పరీక్షలు చేస్తున్నామని ఈటల తెలిపారు. ఆరోగ్యశాఖ,  మున్సిపల్‌, పోలీసు, జర్నలిస్టులు వంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు టెస్టులుచేయాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. 

17,000 బెడ్లు సిద్ధం 

మన దగ్గర ముంబై, అహ్మదాబాద్‌, ఢిల్లీలాగా పరిస్థితి లేదని మంత్రి ఈటల స్పష్టంచేశారు. ‘ఇప్పటికిప్పుడు 17,000 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. అందులో 4, 5 వేల బెడ్లకు ఆక్సిజన్‌ ఫెసిలిటీ ఉన్నది. ప్రతి రోజు 7500 టెస్టులుచేసే సామర్థ్యం కలిగి ఉన్నాం. పేయింగ్‌ సామర్థం ఉన్నవారి కోసం, డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ప్రైవేటు పరీక్షలకు అనుమతిచ్చాం. గాంధీలో అవసరమైన చికిత్స అందిస్తున్నాం. ఇవ్వాల్టికి కూడా మన దగ్గర 400 కంటే ఎక్కువ మంది పేషెంట్లు లేరు. గాంధీలోనే 2000 మంది చికిత్సకు సిద్ధంగా ఉన్నాం. 800 దాకా బెడ్లు ఆక్సిజన్‌ ఫెసిలిటీ కలిగి ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ప్రభుత్వ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నా. ఎవరికైనా పేయింగ్‌ కెపాసిటీ ఉందనుకొంటే ప్రైవేట్‌కు వెళ్లొచ్చు’ అని మంత్రి ఈటల చెప్పారు.  


ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే ఇంటికి 

 ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను ఆచరించాం కాబట్టే ఇలా ఉన్నామని, లేకుంటే ఢిల్లీ, ముంబైలాగా మొత్తం దవాఖానలు నిండేవని ఈటల తెలిపారు. నిజమైన పేషెంట్లను కాపాడేందుకు వనరులు, శక్తిని ఉపయోగించాలన్నదే మా ఉద్దేశం. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్యాకేజీలో వచ్చేవి 

సీబీసీ, మూత్ర పరీక్ష, హెచ్‌ఐవీ, యాంటీ హెచ్‌సీవీ, హెచ్‌బీఎస్‌ ఏజీ, సీరం క్రియాటినైన్‌, యూఎస్‌జీ, 2డీ ఇకో, ఎక్స్‌రే, ఈసీజీ, డ్రగ్స్‌, డాక్టర్‌ కన్సల్టేషన్‌, బెడ్‌ చార్జెస్‌, ఆహారం, రైలెస్‌ట్యూబ్‌ ఇన్సెర్షన్‌, యూరినరీ ట్రాక్ట్‌ క్యాతెటరైజేషన్‌ 

ప్యాకేజీలో రానివి

పీపీఈ, సెంట్రల్‌ లైన్‌ ఇన్సెర్షన్‌, కెమోపోర్ట్‌ ఇన్సెర్షన్‌, బ్రాంకో స్కోపిక్‌ ప్రొసీజర్స్‌, బయాప్సీ, అసిటిక్‌, ప్లీరల్‌ టాపింగ్‌ సేవలకు 2019, డిసెంబర్‌ 31 నాటి ధరలను వసూలు చేయాలి. కరోనా టెస్టుకయ్యే ఖర్చు రూ. 2,200, అధిక విలువ గల ఔషధాలకు వాటి ఎంఆర్‌పీ ప్రకారం వసూలుచేస్తారు. సిటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్‌, ఇతర ల్యాబ్‌ పరీక్షలకు డిసెంబర్‌ 31, 2019 నాటి ధరలు వర్తిస్తాయి. 

దవాఖానల్లో నాణ్యమైన భోజనం

గాంధీతోపాటు మిగతా దవాఖానల్లో కరోనా బాధితులకు నాణ్యమైన భోజనం అందించే ప్రతిపాదనల కోసం డైటీషియన్ల కమిటీ ఏర్పాటుచేయాలని మంత్రి ఈటల నిర్ణయించారు. ఉదయం టిఫిన్‌, 11 గంటలకు టీ, బిస్కె ట్‌, మధ్యాహ్నం లంచ్‌, సాయంత్రం డ్రై ఫ్రూట్స్‌, టీ- రాత్రి భోజనంతో కూడిన నాణ్యమైన డైట్‌ అందించేందుకు ఎంత ధర అవుతుందో నిర్ణయించాలని కోరారు. 

ప్రైవేటు హాస్పిటల్‌ ఫీజులు ఖరారు

ప్రైవేటు దవాఖానలు, ల్యాబొరేటరీల్లో టెస్టులు, చికిత్స నిమిత్తం విధించాల్సిన ఫీజులపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో నం.248) జారీ చేసింది.  పరీక్షలు, చికిత్సకోసం గరిష్ఠంగా వసూలుచేయాల్సిన ధరలను ప్రభుత్వం ప్రకటించింది. జీవోలో పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. దవాఖానలు, ల్యాబొరేటరీల్లో ధరల పట్టికను అందరికీ కనిపించేలా ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. చికిత్స, ఇతర సేవలకు అయ్యే ఖర్చుల గురించిన వివరాలను పేషెంట్లకు, వారి బంధువులకు వివరించాలి. లక్షణాలు లేనివారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారికి దవాఖానలో చికిత్స అవసరం లేదు. వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలి.

అది సాధ్యంకాకుంటే వారిని ప్రభుత్వ క్వారెంటైన్‌ కేంద్రాలకు తప్పనిసరిగా పంపాలి. కొవిడ్‌ పరీక్షలు చేసేందుకు కొన్ని ప్రైవేటు లాబోరేటరీలకు మాత్రమే ఐసీఎంఆర్‌ అనుమతించింది. ఈ ల్యాబ్‌లు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. వివరాలను ఐసీఎంఆర్‌, ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయాలి. కరోనా చికిత్సకు  ముందుకొచ్చే ప్రైవేటు దవాఖానలు ఆరోగ్యశాఖ డైరెక్టర్‌కు అనుమతి దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ప్రైవేట్‌ ల్యాబ్‌లో కరోనా పాజిటివ్‌ వస్తే వెంటనే వివరాలను www.chfw. telangana.gov.in  వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. తద్వారా కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ఇతర చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. మార్గదర్శకాలు ఉల్లంఘిస్తే ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది. 

 ప్రైవేట్‌ ధరలు ఇవి..

కరోనా పరీక్ష 2,200

ఇంటి వద్ద నమూనా సేకరిస్తే 2,800

దవాఖానలో రోజువారీ చార్జీలు

సాధారణ చికిత్సకు 4,000

ఐసీయూలో ఉంచితే 7,500

వెంటిలేటర్‌పై ఉంచితే  9,000


logo