గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 03:11:18

ఫికర్‌ మత్‌ కరోనా!

ఫికర్‌ మత్‌ కరోనా!
  • కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధం
  • వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రూ.100 కోట్లు
  • సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం
  • వివిధశాఖలతో సమన్వయానికి కమిటీ
  • రాష్ట్రంలో మరిన్ని ఐసోలేషన్‌ వార్డులు
  • వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి
  • కొవిడ్‌-19పై అవగాహనకు విస్తృత ప్రచారం
  • వైరస్‌ వ్యాప్తిపై తప్పుడు ప్రచారం చేస్తే కఠినచర్యలు
  • ముందస్తు చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • హాజరైన మంత్రులు కేటీఆర్‌, ఈటల, ఎర్రబెల్లి

హైదరాబాద్‌/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. కొవిడ్‌-19 వైరస్‌ను గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమయిందని.. వైరస్‌ వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారని.. కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరుచేశారని వివరించారు. కరోనావైరస్‌పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీనిని ఎదుర్కొనేందుకు ఆయాశాఖలు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఎంసీఆర్‌హెచ్చార్డీలో మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు.. వివిధశాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌. వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌సెక్రటరీ ఏ శాంతికుమారి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, వివిధ ఆరోగ్యసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా విస్తరించకుండా ప్రభుత్వశాఖల మధ్య సమన్వయానికి కో-ఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటుచేయాలని సమావేశంలో నిర్ణయించారు.


 కొవిడ్‌-19 వ్యాప్తిచెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందుజాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడంవంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ సోకితే చనిపోతారన్న ప్రచారంలో వాస్తవం లేదని, గతంలో వ్యాపించిన వైరస్‌లతో పోల్చితే.. కొవిడ్‌ వైరస్‌ ద్వారా మరణాలరేటు చాలా తక్కువ అని వివరించారు. వ్యాధి లక్షణాలున్నవారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ప్రజలను చైతన్యం చేసేలా సమాచార, ప్రసారశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని.. తెలుగు, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో కరోనా వైరస్‌పై అవగాహన కల్పించే సమాచారం అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో కరోనాపై అవగాహన కల్పించేందుకు హోర్డింగులు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. వైరస్‌పై ఎవరైనా దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తీసుకోవాలని కేటీఆర్‌, ఈటల, ఎర్రబెల్లి సూచించారు.


అధిక ఉష్ణోగ్రతలో వైరస్‌ వ్యాపించదు

కరోనా వైరస్‌ ఉష్ణోగ్రత తక్కువ ఉన్నచోట మాత్రమే జీవించే ఆస్కారం ఉంటుందని.. మనవద్ద ఉష్ణోగ్రతలు అధికంకావడంతో అది వ్యాప్తిచెందే అవకాశం చాలా తక్కువ ఉంటుందని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ వైరస్‌ సోకినవారిలో ఇప్పటివరకు 3 శాతం మరణాలు కూడా లేవని వివరించారు. మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు. వైరస్‌ పాజిటివ్‌గా తేలిన యువకుడికి గాంధీలో చికిత్స అందిస్తున్నారని.. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. యువకుడు తిరిగిన ప్రదేశాల్లో 88 మంది వ్యక్తులను గుర్తించామని.. వారిలో 45మందిని గాంధీకి రప్పించి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడించారు. మిగిలినవారికి కూడా పరీక్షలు చేయిస్తామన్నారు. ఈ వైరస్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌, ఆ శాఖ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని, మాస్కులు సరఫరాచేయాలని కోరామని ఈటల వెల్లడించారు. 


రాష్ట్రవ్యాప్తంగా 3 వేల బెడ్లు..

కొవిడ్‌-19 ఐసోలేషన్‌ సేవల ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 వేల బెడ్లను అందుబాటులోకి తెస్తున్నట్టు మంత్రి ఈటల చెప్పారు. ఫీవర్‌, చెస్ట్‌ దవాఖానలతోపాటు మిలిటరీ, వికారాబాద్‌ దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డుల్లో 800 బెడ్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని పలు బోధనాసుపత్రుల్లో 2,200 బెడ్లు సిద్ధం చేస్తామన్నారు. వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రజలకు మంత్రి సూచించారు.


గాలిద్వారా వ్యాపించదు

కొవిడ్‌-19 గాలిద్వారా వ్యాపించదని మంత్రి ఈటల స్పష్టంచేశారు. కరోనావైరస్‌ ఉన్నవారు మాట్లాడుతున్నప్పుడు తుంపర్లు ఇతరులపై పడితే వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని.. బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే ఇతరులకు వ్యాపించదని తెలిపారు. కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ నంబర్‌ 104 ఏర్పాటుచేసినట్టు చెప్పారు. కొంతకాలం షేక్‌హ్యాండ్స్‌ ఇవ్వొద్దని.. సన్నిహితులు, బంధువులు కలిస్తే నమస్కారం మాత్రమే చేయాలని సూచించారు. ఇతరదేశాల్లో అనుసరిస్తున్న జాగ్రత్తచర్యలపై అధ్యయనం చేస్తున్నామని.. కేరళకు ప్రత్యేక వైద్యబృందాన్ని పంపనున్నామని తెలిపారు. కొవిడ్‌పై భయాందోళనలు తొలగించే బాధ్యత మీడియాపై ఉన్నదన్నారు. కొవిడ్‌-19 విస్తరించే అవకాశం ఉన్నందున బహిరంగప్రదేశాల్లో తిరిగేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని, చేతిలో దస్తీ, ముఖానికి మాస్కులు ధరిస్తే మంచిందని చెప్పారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలను సాధ్యమైనంతవరకు వాయిదా వేసుకోవడమే ఉత్తమమని ప్రజలకు మంత్రి సూచించారు.


బాధితుడి ఇంటి పరిసరాలు శుభ్రం

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ నమోదుతో అది వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. గాంధీలో చేరిన బాధితుడి ఇంటి పరిసరాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది శుభ్రంచేశారు. ఆ కాలనీకి ఆరు కిలోమీటర్ల పరిధిలో అన్ని కాలనీలను శుభ్రంచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఫాగింగ్‌ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మూడురోజులు దాటి జలుబు, జ్వరం ఉంటే వెంటనే గాంధీ దవాఖానలో పరీక్షలు చేయించుకోవాలని వైద్యఅధికారులు సూచించారు.


గాంధీలో మరో 32 మందికి పరీక్షలు

కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు గాంధీ దవాఖానతోపాటు నల్లకుంట ఫీవర్‌, ఎర్రగడ్డ చెస్ట్‌, ఉస్మానియా దవాఖానల్లో ప్రభుత్వం వైద్యులను అప్రమత్తంచేసింది. వైద్యసిబ్బంది సెలవులను రద్దుచేసింది. ప్రత్యేక ఐసోలేషన్‌ వార్డుల్లో మరిన్ని అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర వైద్య బృందంతోపాటు ప్రత్యేకశిక్షణ పొందిన నగర వైద్యబృందాలు 24 గంటలు ఆయా దవాఖానల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్టు గాంధీ దవాఖాన కరోనా విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మరో 34 మంది అనుమానితులు ముందుజాగ్రత్తగా ఆశ్రయించగా.. పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. ఫీవర్‌ హాస్పిటల్‌లో 40, గాంధీలో 40, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలో 20, ఉస్మానియాలో 10 పడకల సామర్ధ్యంగల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటుచేసినట్టు వైద్యశాఖాధికారులు తెలిపారు. గాంధీ వైద్య కళాశాలలోని వైరాలజీ విభాగంలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని, 5 నుంచి 8 గంటల్లోనే రిపోర్టులను వెల్లడిస్తున్నామని వివరించారు. 


ఇవీ లక్షణాలు

జ్వరం ,దగ్గు,శ్వాస ,తీసుకోవడంలో ఇబ్బంది


ఇలా జాగ్రత్తలు

కరచాలనం వద్దు.. నమస్కారమే శ్రేయస్కరం.

తుమ్మినా, దగ్గినా నోటికి రుమాలు అడ్డంపెట్టుకోవాలి.

కండ్లు, ముక్కును నలుపకూడదు. 

బహిరంగ ప్రదేశాల్లో, జనాభా ఎక్కువగా ఉండే చోట్ల మూతికి మాస్కులు ధరించడం ఉత్తమం.

జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనేవైద్యులను సంప్రదించాలి.

చైనా, దుబాయ్‌, మలేషియా, హాంకాంగ్‌ తదితర దేశాల నుంచి వచ్చినవారు అప్రమత్తంగా ఉండాలి. కనీసం 

14 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రావద్దు. 

అనుమానిత లక్షణాలు  ఉంటే కరోనా నోడల్‌  

కేంద్రాన్ని ఆశ్రయించాలి.

బీపీ, షుగర్‌, హార్ట్‌, కిడ్నీ, లంగ్స్‌, 

అస్తమారోగులు, గర్భిణులు ఈ వైరస్‌ సోకకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి.


logo