e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home Top Slides దళిత సోదరుల వెన్నులో ఈటలు!

దళిత సోదరుల వెన్నులో ఈటలు!

  • మాదిగ వర్గాన్ని తిట్టిన ఈటల బావమరిది
  • అభ్యంతరకర పదజాలంతో వాట్సాప్‌ చాట్‌
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంభాషణ
  • తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దళిత సోదరులు
  • తిట్టేందుకు మేమే దొరికామా? అని ఆవేదన
  • మందకృష్ణ వెళ్లినప్పుడూ ఇదే జరిగిందని వెల్లడి
  • ఈటల కబ్జాల అంతు తేలుస్తామని హెచ్చరిక
  • అసైన్డ్‌ భూముల్లో జెండా పాతుతామని ప్రకటన

కరీంనగర్‌, జూలై 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ నేత ఈటల మాటలు దళితులను ఈటల్లా గుచ్చుతున్నాయి. పోైట్లె పొడుస్తున్నాయి. రాజేందర్‌, ఆయన వర్గం నుంచి తిట్లు, శాపనార్థాలు టీఆర్‌ఎస్‌కే పరిమితం కాలేదు. తమ వలలో పడని దళితవర్గాన్నీ ఈటల బ్యాచ్‌ ఇప్పుడు టార్గెట్‌గా చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకం బహుజనులను ఆకట్టుకుంటుండటంతో ఈటల వర్గం నిరాశనిస్పృహలకు గురై నోరు పారేసుకుంటున్నది. దళితబంధు పథకాన్ని ఆపడానికి ఒకవైపు కుట్రలు పన్నడమే కాక, మరోవైపు ఈ పథకంపై హర్షామోదాలు వ్యక్తంచేస్తున్న దళితులనూ కించపరిచేలా వ్యవహరిస్తున్నది. ఈటల బావమరిది కొండవీటి మధుసూదన్‌రెడ్డి దళిత సోదరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక చాట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

తెలంగాణలో, హుజూరాబాద్‌లో ప్రధానంగా ఉన్న దళిత వర్గ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆయన సాగించిన సంభాషణ ఈ చాట్‌లో ఉన్నది. దళితబంధు పథకం నేపథ్యంలో హుజూరాబాద్‌లో రాజకీయ సమీకరణాలపై చర్చలా సాగిన ఈ చాట్‌లో మధుసూదన్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలున్నాయి. ‘… నా కొడుకులు’ అంటూ ఆయన వాడిన భాషపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా దళితుల విషయంలో ఇలాంటి భాషను ఎవరూ వాడదు. రాయరు. రాయకూడదు. దళితులను తిట్టడం, కించపరచడం, అవమానకర భాష వాడడం చట్టరీత్యా నేరం. ఇవన్నీ తెలిసి కూడా మధుసూదన్‌రెడ్డి తన ఫోన్‌చాట్‌లో దళితులను తూలనాడడం గమనార్హం. ‘ఆ వర్గం వారిని నమ్మలేమని’ నిందాపూర్వకంగా పేర్కొంటూ, ఆయన ఈ తిట్టును ఉపయోగించారు.

- Advertisement -

మధుసూదన్‌రెడ్డి ఈటల భార్య జమునకు సోదరుడు. హుజూరాబాద్‌లో ఈటల ఆర్థిక వ్యవహారాలను ఆయనే చక్కబెడుతున్నట్టు ప్రచారంలో ఉంది. సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన మధుసూదన్‌రెడ్డి చాట్‌, దళితవర్గాల్లో తీవ్రకలకలం రేపుతున్నది. ఈటల బృందం వ్యవహారశైలిపై నెటిజెన్లు, దళితులు అభ్యంతరం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటల, మధుసూదన్‌రెడ్డి తీరును నిరసిస్తూ దళితసంఘాల ప్రతినిధులు కొందరు నమస్తే తెలంగాణ కార్యాలయానికి ఫోన్‌చేశారు. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే తాము ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. “40 ఎకరాల అసైన్డ్‌ భూమి తన స్వాధీనంలో ఉన్నట్టు ఈటల రాజేందర్‌ స్వయంగా విలేకరుల సమావేశంలో బహిరంగంగా అంగీకరించారు. తాను తప్పు చేసినట్టు ఒప్పుకొన్నారు. ఆయన కబ్జా పెట్టింది 68 ఎకరాలని విచారణలో తేలింది. అయినా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదు? ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈటల రాజేందర్‌ అహంకారంతో రెచ్చిపోతున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు” అని రమేశ్‌ అనే వ్యక్తి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈటల ధోరణిని సహించే ప్రశ్నేలేదని ఆయన అన్నారు.

“మా భూమిని కబ్జా చేయడమే కాకుండా, మమ్మల్ని అనగూడని మాటలంటున్న ఈటలకు తగినశాస్తి చేయాల్సిందే. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈటల అధీనంలో ఉన్న అసైన్డ్‌ భూమిని విడిపించాలి. ప్రభుత్వానికి వారం పదిరోజులు గడువిస్తాం. లేదంటే దళిత సోదరులతో కలసి ఈటల భూములను మేమే ఆక్రమించి జెండాలు పాతుతాం. అప్పుడు జరిగే కొట్లాటలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ మేరకు మేం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం” అని మరో వ్యక్తి ఫోన్‌లో వెల్లడించారు. “ఈటల ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు మంద కృష్ణమాదిగ ఆయన్ను కలిసినప్పుడు కూడా ఈటల ఇలాగే తీవ్ర అభ్యంతరకంగా మాట్లాడారు. జమ్మికుంటలో 25 ఎకరాలు కేటాయించి, చెప్పుల పరిశ్రమ ఏర్పాటు చేసి దళితుల స్వయం ఉపాధికి సహకరించాలని మంద కృష్ణ కోరితే, దళితుల వృత్తే అంతరించిపోతున్నదని.. చెప్పుల పరిశ్రమ ఎందుకంటూ మా వర్గాన్ని కించపరిచేలా మాట్లాడారు. మమ్మల్ని తిట్టడం ఈటలకు అలవాటుగా మారింది. దీన్ని సహించే ప్రసక్తే లేదు. మా తడాఖా ఏమిటో చూపిస్తాం” అని జగ్గయ్య అనే వ్యక్తి పేర్కొన్నారు. అటు సోషల్‌మీడియాలో కూడా ఈటల- సన్నిహితుల తీరుపై అభ్యంతరాలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana