గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 00:18:08

మహిళల కోసం జాతీయ కమిషన్‌

మహిళల కోసం జాతీయ కమిషన్‌

మన పీవీ.. ఘనత ఇదీ!

పీవీ నరసింహారావు ప్రభుత్వం తొలినాళ్ళలోనే తీసుకున్న ప్రధాన చర్యలలో జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఏర్పాటు ఒకటి. ఈ కమిషన్‌ ఏర్పాటుకు అంతకు రెండేండ్ల ముందు చట్టం తయారైంది. అయితే పీవీ ప్రభుత్వం ఈ కమిషన్‌ ఏర్పాటులో సత్వర చర్యలు తీసుకున్నది. 1992 జనవరి 31 వ తేదీన ఈ కమిషన్‌ ఏర్పాటైంది. మహిళలపై ప్రభావం చూపే విధాన నిర్ణయాలకు సంబంధించి ఈ కమిషన్‌ ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. మహిళల హక్కులను పరిరక్షించడం, వారి తరఫున గొంతు వినిపించడం, వారి స్థితిగతులను పట్టించుకోవడం కమిషన్‌ విధులు. వరకట్నం, రాజకీయాలు, మతం, సమాన ప్రాతినిధ్యం, మహిళా కూలీలపై వివక్ష మొదలైన అంశాలన్నీ కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. మహిళలపై పోలీసుల దౌర్జన్యాలు కూడా కమిషన్‌ చర్చకు వచ్చాయి. ‘రాష్ట్ర మహిళ’ పేర ప్రతి నెలా వార్తా లేఖను కమిషన్‌ హిందీ, ఇంగ్లిష్‌ భాషలలో ప్రచురిస్తుంది. 

మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్షణలు అమలయ్యేలా కమిషన్‌ కృషి చేస్తుంది. ఇందుకు సంబంధించిన నివేదికలను క్రమబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను గుర్తించి లోపాలు సవరించే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అధికారులు చట్టాలను ఉల్లంఘించడం ద్వారా మహిళల హక్కులకు భంగకరంగా వ్యవహరిస్తే ఆ ఫిర్యాదులను విచారణకు స్వీకరిస్తుంది. మహిళల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన చట్టాలు అమలయ్యేలా కృషి చేస్తుంది. అన్ని రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరిగే విధంగా తీసుకోవలసిన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తుంది. ఇందుకు సంబంధించిన అధ్యయనాలు చేపడుతుంది. మహిళల సామాజిక ఆర్థికాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో పాల్గొంటుంది. మహిళా ఖైదీల బాగోగుల గురించి పట్టించుకుంటుంది. అవసరమైనప్పుడు దర్యాప్తులు చేపడుతుంది. 

మహిళలపై దాడులకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌కు గత జూన్‌ నెలలో 2, 043 ఫిర్యాదులు అందాయి. ఇది గత ఎనిమిది నెలల్లోనే అత్యంత ఎక్కువ. ఇందులో 452 గృహ హింసకు సంబంధించినవే. గత ఏడాది సెప్టెంబర్‌లో 2,379 ఫిర్యాదులు అందాయి. సోషల్‌ మీడియా ప్రాచుర్యం పొందడమే ఈ ఫిర్యాదుల సంఖ్య పెరుగడానికి కారణమని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ అభిప్రాయపడ్డారు. తాము సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్నామని ఆమె వెల్లడించారు. హింసకు గురవుతున్న మహిళలు తమకు ఫిర్యాదు చేయవచ్చునని కమిషన్‌ దూరదర్శన్‌ ద్వారా ప్రకటనలు ఇచ్చింది. తమ హెల్ఫ్‌లైన్‌ వాట్సాప్‌ నంబరును కూడా ఇచ్చింది. 

గత మార్చి మొదటి వారంలో116 ఫిర్యాదులు కమిషన్‌కు అందాయి. చివరి వారంలో ఫిర్యాదుల సంఖ్య 257 ఫిర్యాదులు వచ్చాయి. మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించడమే ఈ ఫిర్యాదుల సంఖ్య పెరుగడానికి కారణమని అంటున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, జీతాలు రావడం పట్ల అనిశ్చితి, బలవంతపు ఏకాంతం మొదలైన కారణాలన్నీ మహిళలపై హింసకు కారణమయ్యాయి. దీనిని బట్టి మహిళా కమిషన్‌ ప్రాధాన్యం అర్థమవుతున్నది. 


తాజావార్తలు


logo