సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 01:58:31

పోరుగడ్డపై పోగుబంధం

పోరుగడ్డపై పోగుబంధం
  • కూలీలుగా వలసవెళ్లి యజమానులుగా తిరిగొచ్చిన నేతన్న
  • నౌకరీ చోడో.. వ్యాపార్‌ కరో స్ఫూర్తితో వేలమందికి ఉపాధి
  • సొంతరాష్ట్రంపై మక్కువతో వెల్ఫేర్‌ సొసైటీగా సంఘటితం
  • మడికొండ పవర్‌లూమ్‌ క్లస్టర్‌లో సొంతయూనిట్ల స్థాపన

పూటగడవడమే కష్టంగా మారిన స్థితిలో తెలంగాణ నేతన్నలు యాభైఏండ్ల క్రితం కూలీలుగా వలస       వెళ్లారు. పరాయిగడ్డపై పడరాని పాట్లు పడ్డారు. పనే దైవంగా.. మగ్గమే బంధంగా ఒక్కో నూలు పోగును పేర్చుకుంటూ ఒక్కో మెట్టు పైకెదిగారు.    దశాబ్దాల అనుభవం తోడుగా, ‘నౌకరీ చోడో.. వ్యాపార్‌ కరో’ స్ఫూర్తితో చిన్న చిన్న మగ్గం యూనిట్లను ఏర్పాటుచేసుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ప్రకటనతో ఇక తమ బతుకులు మారనున్నాయంటూ సొసైటీగా సంఘటితమై.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన భరోసాతో స్వరాష్ర్టానికి తిరుగు పయనమయ్యారు. వరంగల్‌లోని మడికొండలో రూపుదిద్దుకుంటున్న తొలి పవర్‌లూమ్‌ క్లస్టర్‌లో దాదాపు 364 మంది యజమానులుగా యూనిట్లను ప్రారంభించడంతోపాటు, తోటి నేతన్నలకు ఉపాధి కల్పించేందుకుసిద్ధమయ్యారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు.

వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దాదాపు అర్ధశతాబ్దం క్రితం పుట్టినఊరు, కన్నవాళ్లు, కట్టుకున్నవాళ్లు, కడుపున పుట్టినవాళ్లను వదిలి తెలంగాణ నుంచి చేనేత కార్మికులు మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల్లోని షోలాపూర్‌, భివండీ, ముంబై, సూరత్‌, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాలకు వలసవెళ్లారు. అక్కడ కూలీలుగా ఒక్కపూట తిండి దొరకని స్థితిని అనుభవించారు. డ్యూటీ అయ్యాక పడుకొనేందుకు జాగా కూడా దొరికేది కాదు. చెరుకుతోటల్లో పడుకుందామని వెళితే ఆసాములు చద్దర్లు గుంజుకుపోయేవారు. మగ్గం బొందలో నిల్చుని బట్టలు మార్చుకునేవారు. పాట్లు ఎన్నిపడ్డా పనిని నమ్ముకుంటే దేన్నైనా జయించవచ్చని తెలంగాణ నేతన్న నిరూపించాడు. పరాయిరాష్ట్రంలో బతకడమే సవాల్‌గా మారినస్థితిలో పనిని, తనకు అన్నం పెట్టే మగ్గాన్ని నమ్ముకుని ఒక్కోమెట్టు ఎదిగారు. కూలీలుగా పనులు చేస్తూనే చేనేతరంగంలో వివిధ విభాగాల్లో నైపుణ్యం సంపాదించారు. స్వయంగా మరమగ్గాలు నడపడమే కాకుండా.. వస్త్రతయారీలో అన్నిరకాల విభాగాల్లో ఆరితేరారు. రెండు మూడుదశాబ్దాల అనుభవాన్ని రంగరించుకొని ఆయాప్రాంతాల్లో చిన్నచిన్న మగ్గం యూనిట్లను నెలకొల్పే స్థాయికి చేరుకున్నారు. పోటీతత్వాన్నీ అలవర్చుకొన్నారు. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, నల్లగొండ ఖమ్మం జిల్లాల నుంచి దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల మంది వలసవెళ్లినవారి పుణ్యమా అని మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల్లో చేనేతరంగం వృద్ధిచెందింది. 


ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో స్ఫూర్తి

ప్రత్యేక తెలంగాణ కోసం కే చంద్రశేఖర్‌రావు ప్రాణాలకు తెగించి నడిపిన ఉద్యమం వలసవెళ్లిన నేతన్నల్లో కొత్తకాంతులను నింపింది. 2009లో తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే సూరత్‌, షోలాపూర్‌, భివండీ ప్రాంతాల్లో ఉన్నవారంతా కాకతీయ టెక్స్‌టైల్‌ అండ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ పొదుపు, పరపతి సహాయసంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌ నుంచి వెళ్లి ఆయాప్రాంతాల్లో మిల్లులు నడిపే సామర్థ్యం ఉన్న వాళ్లంతా ఏకమయ్యారు. పోరుగడ్డ పట్ల తమకున్న అభిమానాన్ని చంపుకోలేక స్వరాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టి చేనేతను అభివృద్ధి చేయడంతోపాటు, పలువురికి ఉపాధి కల్పించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రం ఏర్పాటుకాగానే.. కాకతీయ వీవర్స్‌ సొసైటీ సభ్యులు కేంద్ర ఎంఎస్‌ఎంఈ (మైక్రో స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) స్కీం కింద మడికొండ పారిశ్రామికవాడలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.


చలించిన సీఎం కేసీఆర్‌..

రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తొలినాళ్లల్లో (2014లో) సూరత్‌-తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితి ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు ఆరుగంటలపాటు చర్చించారు. అక్కడ తెలంగాణ చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు తెలుసుకొని చలించిపోయారు. ఆజంజాహి మిల్లును తలదన్నే రీతిలో భారీ టెక్స్‌టైల్‌పార్క్‌ను నిర్మించుకుందాం అంటూ వరంగల్‌లో జరిగిన ఎన్నికల సభలో మాటఇచ్చిన విషయాన్ని  ఈ సందర్భంగా వారికి గుర్తుచేశారు. త్వరలోనే రాష్ట్రప్రతినిధి బృందాన్ని మహారాష్ట్ర, గుజరాత్‌కు పంపిస్తామని హామీఇచ్చారు. ‘రాష్ర్టాన్ని సాధించుకున్నాం. ఆత్మగౌరవంతో బతుకుదాం. రాష్ర్టానికి రండి’ అంటూ పిలుపునిచ్చారు. అందులోభాగంగానే మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీవీ పాపారావు, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ తదితరులను సూరత్‌, భివండీ, షోలాపూర్‌ తదితర ప్రాంతాలకు పంపి సమగ్ర అధ్యయనం చేయించారు. అనంతర పరిణామాల పర్యవసానంగానే రాష్ట్రప్రభుత్వం చేనేత విధానాన్ని ప్రకటించింది. కొద్దిరోజుల్లోనే వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లో రెండువేల ఎకరాల సువిశాల ప్రాంతంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌కు శంకుస్థాపనచేశారు. దక్షిణకొరియా సహ దేశంలోని అనేక కంపెనీలు కాకతీయ మెగాటెక్స్‌టైల్‌ పార్క్‌లో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.


తొలి పవర్‌లూమ్‌ క్లస్టర్‌ మడికొండ

వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండ పారిశ్రామికవాడలో 60 ఎకరాల్లో కాకతీయ టెక్స్‌టైల్‌ అండ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌కి చెందిన 364 మంది సభ్యుల టెక్స్‌టైల్‌ వ్యాపార సముదాయం రాష్ట్రంలోనే తొలి పవర్లూమ్‌ క్టస్టర్‌గా రూపుదిద్దుకుంటున్నది. ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, కాకతీయ వీవర్స్‌ సొసైటీ వాటాగా దాదాపు రూ.10 కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇప్పటికే 260 షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు. సూరత్‌, భివండీ,. షోలాపూర్‌ తదితర ప్రాంతాల్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మిషన్లకు ధీటైన యంత్రాలు, యంత్ర పరికరాలను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికే 45 షెడ్స్‌లో మిషన్లను కూడా అమర్చారు. 


మగ్గం నుంచి మరయంత్రం దాకా..

ఒకవైపు దారం కండెను సరిచేస్తూ.. మరోవైపు మగ్గం గుంటలో కాళ్లుపెట్టి మగ్గాన్ని టక్‌.. టక్‌మని కొడుతూ నడిపినకాలం నుంచి ఓరుగల్లు వలస నేతన్న నేడు మరమగ్గాన్ని నడపటమే కాదు.. దాని నిర్వహణనూ ఔపోసన పట్టాడు. నైపుణ్యంగల నేతన్నగా మారాడు. రాట్నంపై నూలు వడకడం, కండెలకు దారం ఎక్కించడం, రంగుపూయడం, సాంచాలు నడపడం ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కోపని. కానీ కాలం మారుతున్న కొద్దీ అన్నిపనుల్లో ఆరితేరి నైపుణ్యం కలిగిన పారిశ్రామికవేత్తగా మారాడు. సొంతగడ్డను వదిలి పేగుబంధాన్ని వదిలి పోగుబంధం పెనవేసుకున్న ఒకనాటి కూలీలే నేడు యజమానులుగా తరలివచ్చి పుట్టినగడ్డమీద ఉత్పత్తి శ్రామికులుగా అవతారం ఎత్తబోతుండటం విశేషం.
నౌకరీ చోడో.. వ్యాపార్‌ కరో..

నౌకరీ చోడో..వ్యాపార్‌ కరో.. ఇది నాలుగు దశాబ్దాల క్రితం గుజరాత్‌ను ప్రభావితం చేసిన నినాదం. పెద్దపెద్ద పెట్టుబడిదారులు రాష్ట్రంలో భారీస్థాయి పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చినప్పటికీ గుజరాతీలు మాత్రం ఉద్యోగాలు చేయడం మానేసి తమకున్న తెలివితేటలు, జ్ఞానంతో చిన్నచిన్న పెట్టుబడులతో కుటీరపరిశ్రమలను ఏర్పాటుచేసుకున్నారు. వాటితోనే వ్యాపారాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆ నినాదం అక్కడ కూలీలుగా చేరిన తెలంగాణ చేనేత కార్మికుల్లోనూ స్ఫూర్తి నింపింది. ప్రత్యేక రాష్ట్ర స్వప్నం సాకారంకావడంతో ఆ నినాదస్ఫూర్తితో తెలంగాణలో కొద్దిపాటి పెట్టుబడిని పెట్టి.. తమకున్న అనుభవాన్ని, ప్రభుత్వప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని పరిశ్రమలు ఏర్పాటుచేయాలని సంకల్పించారు.


ప్రత్యేక శిక్షణ కేంద్రం 

కాకతీయ టెక్స్‌టైల్‌ అండ్‌ వీవర్స్‌ వెల్ఫేర్‌ సొసైటీ రూపొందిస్తున్న ప్రాంగణంలో ప్రత్యేకంగా శిక్షణకేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన ఉద్యోగార్థులకు (చేనేత కార్మికుల పిల్లలు, ఇతర ఆసక్తిగల వారికి) టెక్స్‌టైల్‌రంగంలో వస్తున్న మార్పులు, ఉపాధి అవకాశాలు, యంత్రవినియోగం, పనివిధానం, మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చి ఇక్కడే ఉపాధి కల్పించేలా ఏర్పాట్లుచేశారు. 


ప్రభుత్వ సహకారం మరువలేం 

గుజరాత్‌, మహారాష్ట్రకు వలసవెళ్లిన లక్షల మంది చేనేత కార్మికుల జీవితాలను బాగుచేయాలని సీఎం కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో చేనేతరంగం అభివృద్ధిలో మన రాష్ట్ర నేతన్నల శ్రమ ఎంతో ఉన్నది. రాష్ట్రం వచ్చాకకూడా అక్కడే ఎందుకుండాలె అన్నది ప్రభుత్వ లక్ష్యం. మేమూ మా ప్రాంతానికి వెళ్లాలని ఇక్కడికొచ్చినం. ఇక్కడ యూనిట్‌ మొదలుపెట్టినం. రాష్ట్ర ప్రభుత్వం అందుతున్న సహకారం మరువలేం. కష్టపడేవారితో సొసైటీ ఏర్పాటు చేసుకున్నాం.  కాకతీయ మెగా టెక్స్‌టైల్‌పార్క్‌ శంకుస్థాపనతో లక్షల మంది నేత కార్మికులకు ధైర్యమొచ్చింది.

  -దర్గా స్వామి, అధ్యక్షుడు, కాకతీయ వీవర్స్‌ సొసైటీ, మడికొండ 


ఉద్యమకల నెరవేరుతున్నది 

ఉద్యమకాలంలో సూరత్‌ తెలంగాణ వలస ప్రజల ఐక్యసమితి ఆధ్వర్యంలో అక్కడా ఉద్యమాలు చేసినం. తెలంగాణ సాధించిన కొద్దిరోజుల్లోనే సీఎం కేసీఆర్‌ మమ్ములను పిలిపించుకొని చర్చించారు. అప్పుడు గట్టి నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే ఇక్కడ యూనిట్‌ ప్రారంభిస్తున్నాం. పవర్‌లూమ్స్‌ నిర్వహణలో కలిసి ఉండాలని అనుకున్నం. ఆ కల నెరవేరింది. 

 -మచ్చా వీరన్న, కురవి, మహబూబాబాద్‌ జిల్లా 


పుట్టిన గడ్డమీద బతకటం కోసమే

నలభై ఏండ్ల క్రితం అక్కడకుపోయి కూలీ పనులు చేసినం. కూడులేక బతికినం. తిరిగి వస్తామో రామో అనుకునేవాళ్లం. మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడొద్దని ఆలోచించినం. ఇప్పుడు ఇక్కడ యూనిట్‌ యజమానులుగా మారినం. అసలు పుట్టిన గడ్డమీద బతకటం అనేది అన్నిటికన్నా సంతోషాన్ని ఇస్తున్నది.

 -కూరపాటి ఐలయ్య, పెనుగొండ, కేసముద్రం 


logo