గురువారం 09 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 02:04:39

బ్రాండ్‌ తెలంగాణ!

బ్రాండ్‌ తెలంగాణ!
 • కల్తీలేని ఆహార పదార్థాల తయారీ కేంద్రాల ఏర్పాటు
 • అంతర్జాతీయ ప్రమాణాలతో సరుకుల తయారీ
 • దేశ, విదేశాలకు ఎగుమతి
 • రేషన్‌ డీలర్ల ద్వారా రాష్ట్రంలో సరఫరా
 • పంటలవారీగా జిల్లాల్లో పరిశ్రమల స్థాపన
 • మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్రయవిక్రయాలు
 • రైతులకు గిట్టుబాటు ధర
 • యువతకు ఉపాధి అవకాశాలు
 • ప్రాథమిక నివేదికలు, ప్రణాళికలు సిద్ధం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: మార్కెట్‌లో ఏం కొందామన్నా కల్తీ.. ఏం తిందామన్నా కల్తీ. పసుపు, కారం, నూనె, అల్లం.. సర్వం కల్తీమయం. కల్తీకాటుకు జనం అలవిగాని రోగాలబారిన పడుతున్నారు. మరోవైపు రైతులు కొన్నిసార్లు తమ పంటకు సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతుండగా, మరికొన్నిసార్లు టమాట వంటి పంటలను కొనేవారులేక నేలపాలు చేస్తున్నారు. ఇటు వినియోగదారులకు, అటు రైతులకు లబ్ధిచేకూర్చడంతోపాటు మహిళలు, యువతకు ఉపాధి కల్పించే బృహత్‌ కార్యక్రమం ‘బ్రాండ్‌ తెలంగాణ’కు సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారు. బ్రాండ్‌ తెలంగాణ పేరిట ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేందుకు ఆహార తయారీకేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకొన్నది. వీటివల్ల ప్రజలకు కల్తీలేని ఆహారపదార్థాలు అందుబాటులోకి వస్తాయి. రైతులు తమ పంటను కిలోమీటర్ల దూరం వెళ్లి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు. గ్రామాల్లో ఉండే మహిళా సంఘాలే పంటను కొనుగోలు చేసి పరిశ్రమలకు తరలిస్తాయి. 


అక్కడ వాటిని శుద్ధిచేసి వివిధరకాల ఆహార పదార్థాలను తయారుచేస్తాయి. ఉదాహరణకు రైతుల వద్ద కొనుగోలు చేసిన టమాటాలు మార్కెట్‌లో విక్రయించగా మిగిలినవాటితో సాస్‌ తయారుచేస్తారు. మిర్చిపంటను కారంపొడి చేస్తారు. ఏ జిల్లాల్లో ఎటువంటి పంటలు పండుతాయి, తాము ఏ పంటలు వేయాలి అనే విషయం రైతులకు ముందుగానే తెలిసిపోతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారుచేసిన సరుకులను దేశ, విదేశాలకు చెందిన మార్కెటింగ్‌ ఏజెన్సీలతో విక్రయాలు జరుపుతారు. ఈ ప్రక్రియలో రేషన్‌ డీలర్లను కూడా భాగస్వాములను చేయనున్నారు. రేషన్‌షాపుల ఈ ఆహార ఉత్పత్తులను పంపిణీ చేస్తారు. ఆయా జిల్లాల్లో పండే పంటల ఆధారంగా స్థానికంగా పరిశ్రమలను నెలకొల్పనున్నారు. దీంతో ఎంతోమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 


రాష్ట్రంలో ఆహార తయారీ కర్మాగారాల ఏర్పాటుతోపాటు వాటిద్వారా దేశ, విదేశాలకు మన ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు ప్రాథమిక నివేదికలను సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో సాగుచేసే పంటలు, వాటిపై ఆధారపడి నెలకొల్పడానికి అవకాశం ఉన్న పరిశ్రమల జాబితాను సిద్ధంచేశారు. ఏయే జిల్లాల్లో ఎటువంటి ఆహార తయా రీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందో ఓ నివేదికను రూపొందించారు. 


పంటలు అమ్ముకునేదెలా?

రాష్ట్రంలో సాగునీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో లక్షలాది ఎకరాల్లో లక్షల టన్నుల్లో పంట దిగుబడి జరుగుతున్నది. అయితే ఆశించినస్థాయి కంటే అధిక దిగుబడి వస్తే.. ధర తగ్గుతుంది. ఉల్లి, టమాటా, పసుపు వంటి పంటల విషయంలో అనేకసార్లు ఇది ఉత్పన్నమయింది. రైతులకు అన్ని సమయాల్లో గిట్టుబాటు ధర కచ్చితంగా రావాలనే ఉద్దేశంలో నుంచి వచ్చిందే ఆహార తయారీ కర్మాగారాల (ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు) ఆలోచన. రైతులు పండించిన పంట ఆన్‌ డిమాండ్‌ అమ్ముడయ్యేలా ఓ అద్భుత వ్యవస్థను రూపొందిస్తున్నారు.  


మహబూబాబాద్‌లో ప్లాంట్‌ లిపిడ్స్‌ పరిశ్రమ

మహబాబాబాద్‌ జిల్లా కురవి మండల పరిధిలో భారీ ప్లాంట్‌ లిపిడ్స్‌ పరిశ్రమ ఏర్పాటవుతున్నది. సుమారు 60 ఎకరాల్లో నెలకొల్పనున్న ఈ ప్లాంట్‌ లిపిడ్స్‌ సంస్థ నుంచి రెడ్‌రెజీనా మిర్చిపౌడర్‌, వంటనూనె, మిరప విత్తనాలు తయారు చేయనున్నారు. దీనికి మహి ళా సంఘాలతో ఒప్పందం చేసుకుని రెజీనాకు సంబంధించిన ముడిసరుకును అందించనున్నారు. మహిళా సంఘాలు సాగు చేసిన మిర్చి ని ఈ పరిశ్రమకు సరఫరా చేయనున్నారు. దీనికి సంబంధించిన ఒప్పందంలో ప్రీమియంను కూడా ప్రభుత్వమే భరించనుంది.


పాలమూరు, పాలకుర్తిలో మిల్లెట్స్‌ పరిశ్రమలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలో చిరుధాన్యాల పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. వనపర్తి, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లో ఈ మిల్లెట్స్‌ పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అదేవిధంగా పాలకుర్తిలో కూడా ఇవే పరిశ్రమల ఏర్పాటుకు పలువురు ముందుకొచ్చారు. దీనిని పూర్తిచేసేందుకు మంత్రి ఎర్రబెల్లి దృష్టి సారించారు. ఈ ప్రాంతాల్లో మల్టీపర్పస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. 


ఆహార ఉత్పత్తులపై ‘తెలంగాణబ్రాండ్‌'

రాష్ట్రంలో తయారుచేసి, ఎగుమతిచేసే ఆహార ఉత్పత్తులకు బ్రాండ్‌తెలంగాణ ఇమేజ్‌ రానున్నది. రైతుల నుంచి పంట కొనుగోలు, పరిశ్రమలకు తరలింపు, మార్కెటింగ్‌, ఆ తర్వాత ఉత్పత్తులను బ్రాండ్‌ తెలంగాణ పేరుతో విక్రయించడం, ఈ పనులన్నింటినీ మహిళా సంఘాలే నిర్వహించనున్నాయి. అలాగే మన దగ్గర ఏర్పాటు చేసే ఆహార శుద్ధికేంద్రాల నుంచి వచ్చే ఉత్పత్తులను బ్రాండ్‌ తెలంగాణ పేరుతోనే మార్కెటింగ్‌ చేయనున్నారు.  అంటే టమాట నుంచి సాస్‌, మిరప నుంచి మిర్చి పౌడర్‌, మొక్కజొన్న నుంచి బేబీ కార్న్‌, స్వీట్‌కార్న్‌, ఎండు అల్లం, సీతాఫలాలు, ఇలా పలు యూనిట్లను ఏర్పాటు చేసి, వాటిని బ్రాండ్‌ తెలంగాణ ఉత్పత్తులను విక్రయించనున్నారు. 


కూరగాయల్లో సక్సెస్‌

కూరగాయల వ్యాపారంలో మహిళా సంఘా లు ఇప్పటికే విజయం సాధించాయి. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి కూరగాయలను హైదరాబాద్‌ కేంద్రంగా విక్రయిస్తున్నారు. దీనితో గత ఆరు నెలల్లో రూ. 1.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ కూరగాయలను వాల్‌మార్ట్‌, మెట్రో సంస్థలకు విక్రయిస్తున్నారు. 


పంటల ఆధారంగా పరిశ్రమలు

ఆయా జిల్లాల్లో సాగుచేస్తున్న పంటలు, దిగుబడి, వాటి నిల్వ, గోదాముల సామర్థ్యంపై అంచనా వేసిన అధికారులు ప్రాథమికంగా ప్రతిపాదనలు రూపొందించారు. పంటకు వస్తున్న గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ అంశాలను పరిశీలించారు. మొత్తంగా ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న వ్యవసాయ ఉత్పత్తులపై ఒక అంచనాకు వచ్చారు. ఆ అంచనాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆహార తయారీ కేంద్రాలను ఏర్పాటుచేసేందుకు పూనుకుంటున్నారు. జిల్లాల వారీగా ప్రధానంగా పండుతున్న పంటలు, వాటి ఆధారిత పరిశ్రమలపై ప్రాథమిక నివేదికను జిల్లాల వారీగా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేశారు. ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో సంబంధిత పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నివేదికల్లో పేర్కొన్నారు. అక్కడ పండించే పంటలు, ఏర్పాటుచేయాల్సిన పరిశ్రమలను ఈ కింది విధంగా సూచించారు. 


మిర్చి ఆధారిత పరిశ్రమలు: జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌.

వేరుశనగ ఆధారిత పరిశ్రమలు: జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌.

జొన్నలు: ఆసిఫాబాద్‌

సీతాఫలం: మహబూబ్‌నగర్‌

ఎండుఅల్లం(డ్రై జింజర్‌): సంగారెడ్డి

బత్తాయి: నల్లగొండ

చింతపండు: వికారాబాద్‌

కాటన్‌సీడ్‌ ఆయిల్‌: రాజన్న సిరిసిల్ల

పప్పుదినుసులు: ఆదిలాబాద్‌, జనగామ, కామారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి.

మామిడి: జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి. 

మామిడి పచ్చళ్ల పరిశ్రమలు: నాగర్‌కర్నూల్‌, జగిత్యాల. 

వివిధరకాల పచ్చళ్ల పరిశ్రమ: మేడ్చల్‌ మల్కాజ్‌గిరి

మామిడి పౌడర్‌(ఆమ్‌చూర్‌): వికారాబాద్‌

చిరుధాన్యాల పరిశ్రమలు : మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌. 

మొక్కజొన్న ఆధారితం: వరంగల్‌ అర్బన్‌, నిర్మల్‌, రంగారెడ్డి, సిద్దిపేట

స్వీట్‌కార్న్‌, బేబీకార్న్‌: కరీంనగర్‌

పసుపు ఆధారిత పరిశ్రమలు: నిజామాబాద్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌

కూరగాయల ఆధారితం: కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి. 

టమాటా ఆధారితం: కరీంనగర్‌

టమాటా సాస్‌ పరిశ్రమ: యాదాద్రి , భువనగిరి

సోయాబీన్‌ ఆధారితం: నిర్మల్‌, కామారెడ్డి. 

గోధుమ: ఆదిలాబాద్‌

గోధుమ పిండి పరిశ్రమ: జనగామ. 

బియ్యం: యాదాద్రి భువనగిరి

ముడి బియ్యం: మెదక్‌

రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ పరిశ్రమలు: కరీంనగర్‌, మెదక్‌. 


ఆరోగ్యం... ఆదాయం

 • ‘బ్రాండ్‌ తెలంగాణ’తో ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి.
 • మన భూమిలో.. మన వాతావరణంలో పండిన పంటలు తింటే ఆరోగ్యం బాగుంటుంది.. ఇది స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన వాస్తవం.
 • మన దగ్గర పండించిన ఉత్పత్తులతోనే మనం తినే ఆహారం తయారు కానున్నది.
 • కల్తీలేని ఆహారం అందుతుంది. రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది.
 • మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడుతాయి. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెరుగుతుంది.
 • ఐకేపీ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు నోచుకుంటారు.
 • స్థానికంగా ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి.


logo