ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 02:34:31

సజావుగా సన్నాల కొనుగోళ్లు

సజావుగా సన్నాల కొనుగోళ్లు

  • ధాన్యం కొనుగోలుకు 6 వేల కేంద్రాల ఏర్పాటు 
  • ఇప్పటివరకు 12 లక్షల టన్నులకుపైగా సేకరణ
  • రెండుమూడు రోజుల్లోనే రైతు ఖాతాల్లోకి పంటసొమ్ము
  • 2 లక్షల మంది ఖాతాల్లో రూ.700 కోట్లు జమ
  • కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా వరికోతలు ఊపందుకున్నాయి. రైతులు సన్నరకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇప్పటికే 12 లక్షల టన్నులకు పైగా సన్నరకం ధాన్యాన్ని సేకరించింది. దాదాపు 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.700 కోట్లు పంట సొమ్ము జమచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటికి తోడు ఈసారి సకాలంలో విస్తారమైన వర్షాలు కురవడంతో ఈ వానకాలంలో రికార్డుస్థాయిలో ఏకంగా 53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయింది. ఉత్పత్తి కూడా అదేస్థాయిలో వస్తుందనే అంచనా వేసిన ప్రభుత్వం ముందస్తుగానే పంటల కొనుగోలుకు ప్రణాళికలు తయారుచేసింది. ఈ మేరకు వరి కోతలు మొదలైన అక్టోబర్‌ చివరివారం నుంచే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకు పైగా కేంద్రాలను ప్రారంభించింది. వీటిద్వారా 12 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. అధికారుల సూచన మేరకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందుతున్నారు. 

కేంద్రం నుంచి పైసా రాలేదు

ధాన్యం కొనుగోలుకు కేంద్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకు నయాపైసా రాలేదు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం విక్రయించగానే రెండు మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకున్నది. ఇప్పటివరకు ధాన్యం విక్రయించిన 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమచేసింది. వాస్తవానికి ధాన్యం కొనుగోలు సంబంధించి కేంద్రం నుంచి ఒక్కరూపాయి రాకపోయినా బీజేపీ నేతలు అబద్ధపు ప్రచారాలకు దిగుతున్నారు. రాష్ర్టానికి రూ.5 వేల కోట్లు అప్పు తీసుకొనేందుకు మాత్రమే అనుమతిస్తే.. రాష్ర్టానికి నిధులు విడుదల చేసినట్టు అసత్యాలు ప్రచారం చేస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. అప్పు తీసుకున్న డబ్బుకు అసలు, వడ్డీ కలిపి రాష్ట్రమే చెల్లిస్తుంది కానీ, కేంద్రం చెల్లించడం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రం పట్టించుకోకున్నా.. సీఎం కేసీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తున్నారని, ఎక్కడికో వెళ్లి ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బందులు పడుతారని ఆలోచించి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారని రైతులు పేర్కొంటున్నారు. తడిసిన ధాన్యం కూడా ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఇప్పటికే పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. ఆ మేరకు కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు కూడా చేశారు.