గురువారం 04 జూన్ 2020
Telangana - May 19, 2020 , 15:23:41

టీఆర్‌ఎస్‌లో చేరిన ఏర్గట్ల జడ్పీటీసీ సభ్యుడు

టీఆర్‌ఎస్‌లో చేరిన ఏర్గట్ల జడ్పీటీసీ సభ్యుడు

నిజామాబాద్‌ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలానికి చెందిన కాంగ్రెస్‌ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌రావు, కాంగ్రెస్‌ నాయకుడు రేండ్ల రవితో పాటు వీరి అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికీ మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఇతర పార్టీల నేతలు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఏర్గట్ల జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు మంత్రి ప్రకటించారు. ఏర్గట్ల మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు మంత్రి. బీడు భూములకు కాళేశ్వరం నీళ్లు పారించి.. పంటలు సమృద్ధిగా పండేలా సీఎం చేస్తున్నారని తెలిపారు. రైతుల సంక్షేమ కోసం సీఎం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. రైతులు లాభసాటి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. నియంత్రిత పంటల సాగుపై త్వరలోనే సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తారని మంత్రి స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రెసిడెంట్‌ పూర్ణానందం, ఎంపీటీసీ జక్కని మధు, సర్పంచ్‌ లావణ్య గంగాధర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


logo