శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 01, 2020 , 03:31:47

కరోనా కాలంలోనూ బాధితులకు న్యాయం

కరోనా కాలంలోనూ బాధితులకు న్యాయం

  • ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌
  • పలు ఫిర్యాదులపై విచారణ.. ఆదేశాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళిత, గిరిజన బాధితులకు అండగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా విచారణలు చేపడుతున్నామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేర్కొన్నారు. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కరోనా కాలంలో కూడా బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తున్నామన్నారు. శుక్రవారం కమిషన్‌ కార్యాలయంలో పలువురు బాధితులు, సంబంధిత అధికారులను పిలిపించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించామని చెప్పారు. 

  • 2015లో రిజిస్ట్రేషన్‌ ద్వారా కొనుగోలు చేసిన ఇంటిని జగన్నాథ్‌రెడ్డి, మరో 8 మంది కలిసి ఆక్రమించుకున్నారని ఖమ్మం జిల్లా కోమపల్లికి చెందిన దళిత మహిళ నాగమణి ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదుచేశారు. ఇందుకు ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్‌, తాసిల్దార్‌ నర్సింహారావు, ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎస్సై హాజరై వివరణ ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ అధికారులను ఆదేశించినట్టు చైర్మన్‌ తెలిపారు. 
  • వేములవాడ రాజరాజేశ్వరాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జయకుమారి తనకు అన్ని అర్హతలున్నా.. ఏఈవోగా పదోన్నతి ఇవ్వడంలేదని చేసిన ఫిర్యాదుమేరకు దేవాదాయశాఖ జాయింట్‌ కమిషనర్‌ కృష్ణవేణి, ఈవో కృష్ణప్రసాద్‌, ఫిర్యాదుదారుతో విచారణ జరిపారు. జయకుమారికి 15 రోజుల్లోగా పదోన్నతి ఇవ్వాలని, 2017 నుంచి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినట్టు చైర్మన్‌ వివరించారు. 
  • తనకు తన పెద్దల నుంచి సంక్రమించిన భూమిని రెవెన్యూ రికార్డులు మార్చి ఇతరులకు అప్పజెప్పారని నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం రేగట్టెకు చెందిన వెంకటయ్య అనే దళిత రైతు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆ జిల్లా రెవెన్యూ అధికారులతో విచారణ చేపట్టారు. వాదనలు విన్న చైర్మన్‌.. మూడు రోజుల్లోగా పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితునికి న్యాయం చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. 


logo