గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 22:35:49

జర పైలం.. కరోనా దయ్యం తిరుగుతోంది..

జర పైలం.. కరోనా దయ్యం తిరుగుతోంది..

జనగామ : జరపైలం.. పొలిమేరల్లో కరోనా దయ్యం తిరుగుతోంది. దానికి మంత్రాలు, మందులు లేవు.. మనమే జాగ్రత్తగా మెదలాలి.. దూరం.. దూరంగా నిలబడి ఉపాధి పనుల్లో పాల్గొనాలి..’ అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఉపాధిహామీ కూలీలకు సూచించారు. 

శుక్రవారం ఆయన హైదరాబాద్‌ నుంచి పాలకుర్తికి వెళ్తూ మార్గమధ్యంలో లింగాలఘనపురం మండలం కుందారం సమీపంలో ఉపాధిహామీ పనులకు వెళుతున్న కూలీలు తారసపడగా తన వాహనాన్ని నిలిపి, మాస్కులను అందించారు. అనంతరం వారితో ‘మీరు ఏఏ పనులు చేస్తున్నారు..? కూలి గిట్టుబాటు ఎలా ఉంది..? ఎంత మంది వెళుతున్నారని మంత్రి ప్రశ్నించారు. 

దీనిపై స్పందించిన కూలీలు గ్రామంలోని బేతన్‌ చెరువు పూడిక పనులకు వెళుతున్నామని, ప్రతీ రోజూ 300 మంది పని చేస్తున్నామని చెప్పారు. కరోనా నేపథ్యంలో వ్యక్తిగత దూరాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ఎర్రబెల్లి స్పందిస్తూ కరోనా కష్టకాలంలో ఉపాధి హామీ పధకం ఎంతో మేలు చేస్తున్నదన్నారు. ఈ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానించాలని సీఎం కేసీఆర్‌కు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చానని ఆయన తెలిపారు. సీఎం సైతం కేంద్రానికి ఇదే విషయాన్ని చెప్పారని ఆయన వివరించారు. 

కూలీలు తప్పకుండా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఉపాధి హామీ పనుల్లో పాల్గొనాలన్నారు. ఉపాధి హామీ పధకంలో గతంలో కూలి రూ.217 ఉండగా, ఈ పర్యాయం రూ .237 గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెంచిన కూలీని ఈ ఏప్రిల్‌ నుంచే చెల్లిస్తున్నామన్నారు. ఈ వేసవిలో భత్యంగా  ఏప్రిల్‌, మే నెలలో 30 శాతం అదనంగా కూలి డబ్బులను చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి మహేందర్‌, కారోబార్‌ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 


logo