గురువారం 28 మే 2020
Telangana - May 11, 2020 , 01:56:40

రాష్ట్రాలకు శరాఘాతం

రాష్ట్రాలకు శరాఘాతం

  • కొత్త విద్యుత్‌చట్టం.. మా హక్కులు హరించడమే
  • ప్రైవేటీకరణకు ఊతం..ప్రజాభీష్టానికి వ్యతిరేకం
  • నగదుబదిలీ ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు
  • తమిళనాడు సీఎం పళనిస్వామి
  • ప్రధానమంత్రి మోదీకి లేఖ

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: సమాజంలోని అన్ని వర్గాలను ప్రభావితం చేసే కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం సవరణ బిల్లుపై మరో రాష్ట్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ బిల్లుపై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటారనే అభిప్రాయం ఉన్న తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా కొత్త బిల్లును వ్యతిరేకించింది. దీనిని ఒప్పుకొనే ప్రసక్తే లేదని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. నూతన విద్యుత్‌ చట్టం లోపభూయిష్టమని.. రాష్ర్టాలకు శరాఘాతంగా పరిణమిస్తుందని ఆ లేఖలో తేల్చిచెప్పారు. 

ఈ చట్టంపై తాము గతంలోకూడా పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, విద్యుత్‌ మంత్రికి లేఖరాశామని పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టంలోని అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు. అందరి అభిప్రాయాలకు గౌరవమిచ్చి రాష్ట్రాల పరిధిలోనే విద్యుదుత్పత్త్తి, పంపిణీ ఉండేలా చూడాలన్నారు. తమిళనాడులో విద్యుత్‌సంస్థలు స్వతంత్రంగా, సమర్థంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్టం వల్ల విద్యుత్‌రంగంలో అనూహ్య మార్పులు వస్తాయని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌లో ప్రతిపాదనలు ఆచరణ సాధ్యం కావన్నారు. ‘ప్రతిపాదిత బిల్లు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటుకు అప్పగించేలా ఉన్నది. 

ఇక్కడ ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రైవేటీకరణను మొదలుపెట్టినట్టే అవుతుంది. ఇది ప్రజావ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిని కుదించడమే అవుతుంది’ అని పళనిస్వామి ప్రధానికి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాలు వ్యవసాయ రైతులకు, పేదల గృహ వినియోగదారులకు ప్రస్తుతం సబ్సిడీ, క్రాస్‌సబ్సిడీలు ఇస్తున్నాయని, కేంద్రం ప్రతిపాదించిన చట్టం ప్రకారం సబ్సిడీలు పొందే వ్యవసాయ రైతులు, గృహ వినియోగదారులు తీవ్రంగా నష్టపోతారని లేఖలో స్పష్టంచేశారు. నగదు బదిలీ ఆచరణలో చాలా సమస్యలు వస్తాయని తెలిపారు. రైతులు, గృహ వినియోగదారుల ప్రయోజనాలకు ఇది తీవ్ర విఘాతం కల్పిస్తుందని వెల్లడించారు. రైతులకు సంబంధించిన విద్యుత్‌ సరఫరా విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేయాలన్నది తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. ‘రైతులు నగదు బదిలీ ద్వారా సబ్సిడీ తీసుకోవాలా? పూర్తిగా ఉచితంగానే విద్యుత్‌ పొందాలా అన్నది వాళ్ల ఇష్టం. 

రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలివేయడం మంచిది.  ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (ఈఆర్సీ) ల ఏర్పాటు అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తేవడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం’ అని పళనిస్వామి తెలిపారు. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు అనవసరమని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్‌పై పోరాటంలో తలమునకలై ఉన్న పరిస్థితుల్లో కొత్త చట్టాన్ని ప్రతిపాదించడం, చర్చలు పెట్టడం సరికాదన్నారు. సమయమివ్వకుండా ఏదైనా అనూహ్యమైన నిర్ణయాలను కేంద్రం తీసుకొంటే రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభాలు వస్తాయని చెప్పారు. అందరితో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి రావాలని పళనిస్వామి తన లేఖలో విజ్ఙప్తిచేశారు.


logo