బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 13:29:36

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను హర్షిస్తున్న దేశం: ఎర్రబెల్లి

సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను హర్షిస్తున్న దేశం: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: అభివృద్ధి, సంక్షేమం సహా కరోనా కట్టడిలోనూ సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను దేశం హర్షిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండల కేంద్రంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో   ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రతి ఇంటికి నిత్వావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో అంతా కలిసి కరోనా వైరస్‌ను కట్టడి చేశామన్నారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ, ప్రజల ప్రాణాలే ముఖ్యమని కరోనాను కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అదిగమిస్తున్నామని చెప్పారు. పంటలను అమ్ముకోవడానికి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి రైతులు తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. మరో ఏడాది వరకు కరోనా ప్రభావం ఉంటుందని బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని, కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.  

అనంతరం పర్వతగిరి మండలం కల్లెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టోకెన్లు వచ్చినవాళ్లే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావలని రైతులకు సూచించారు. కరోనా కారణంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. తాలు పేరుతో రైస్‌ మిల్లర్లు ఇబ్బందులు పెడితే శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.


logo