మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 03:01:04

బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితుడికి కేటీఆర్‌ భరోసా

బ్రెయిన్‌ ట్యూమర్‌ బాధితుడికి కేటీఆర్‌ భరోసా

  • చికిత్సకు రూ.3 లక్షలు ఎల్‌వోసీ మంజూరు

ఎల్లారెడ్డిపేట: బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ యువకుడికి మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం అందించారు. చికిత్సకు రూ.3 లక్షల ఎల్‌వోసీ ఇప్పించి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన భూక్యా సాయి(19) తండ్రి నాజం అనారోగ్యంతో పదేండ్ల క్రితం మృతిచెందాడు. తల్లి లక్ష్మి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేది. అతడికి చెల్లెలు శ్రావణి ఉంది. తమ కోసం తల్లి పడుతున్న కష్టం చూడలేక తానూ చదువు మానేసి కూలీకి వెళ్లేవాడు. బతుకుదెరువు కోసం మూడేండ్ల క్రితం దుబాయ్‌ వెళ్లాడు. కరోనా కారణంగా పది నెలల క్రితం స్వగ్రామానికి తిరిగివచ్చాడు. ఈ క్రమంలో నెల క్రితం సాయికి తీవ్ర జ్వరం రాగా కరీంనగర్‌ దవాఖానలో పరీక్షలు చేసి బ్రెయిన్‌ ట్యూమర్‌ అని నిర్ధారించి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు పంపించా రు. పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌కు రూ.5.5 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో చేసేదేమీలేక ఇంటికి వచ్చాడు. సాయి సమస్యను రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ శంకర్‌ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్‌ రూ.3లక్షలు ఎల్‌వోసీ మంజూరు చేశారు. శుక్రవారం అల్మాస్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడు రమేశ్‌ ఎల్‌వోసీ పత్రాన్ని సాయికి అందించారు.  

యువకుడి ట్వీట్‌కు మంత్రి స్పందన

నిజాంపేట: అనారోగ్యంతో మృతిచెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఓ యువకుడు పెట్టిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ స్పందించారు. మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం చల్మెడకు చెందిన పవుడాల తిర్మలయ్య(35) గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి 10 ఏండ్లలోపున్న ముగ్గురు కూతుర్లున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామానికి చెందిన స్వామి ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశాడు. స్పందించిన మంత్రి.. రైతు కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంత్రి ఆదేశాలతో శుక్రవారం రాత్రి డీఈవో రమేశ్‌కుమార్‌ తిర్మలయ్య కుటుంబాన్ని పరామర్శించారు. అతని ముగ్గురు కూతుర్లు అర్చన, అక్షయ, నందుల ఉన్నత చదువుకు తోడ్పాటునిస్తామని చెప్పారు.