సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 21:42:44

ప్రతి పంచాయతీకి రూ. 5 లక్షలపైనే నిధులు

ప్రతి పంచాయతీకి రూ. 5 లక్షలపైనే నిధులు

హైదరాబాద్‌: 'రాష్ట్రంలో శివారు గ్రామాల్లో కూడా అభివృద్ధి ఆగకూడదని, ప్రతిపల్లే పరిశుభ్రంగా ఉండాలని కొత్త గ్రామాలను ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని గ్రామాల్లో ఐదొందల కంటే తక్కువ జనాభా ఉన్నారు. ఆ గ్రామాలకు కూడా లక్షల నిధులు రావాలి. కనీసం ఐదు లక్షల రూపాయల నిధులకు తక్కువ కాకుండా ప్రతి ఏడాది రావాలి. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి' అంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో  ప్రకటించిన విషయం తెలిసిందే.   దాన్ని అమల్లోకి తీసుకు వస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల అభివృద్ధి కోసం కట్టుబడి పని చేస్తున్నామని ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. 

రాష్ట్రంలో 8,692 పంచాయతీలుండగా... శివారు గ్రామాలతో పాటు వెనకబడిన ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా తెలంగాణ ప్రభుత్వం మార్చింది. దీని ప్రకారం రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,751కి పెరిగింది. చాలా ఏండ్లు నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు పంచాయతీలుగా ఆవిర్భవించాయి. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామం అభివృద్ధిలో ఉండాలని, పచ్చగా, పరిశుభ్రతతో ఉండాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రెండు విడుతల్లో చేపట్టిన విషయం తెలిసిందే. ప్రతినెలా రూ. 339 కోట్లను పంచాయతీలకు విడుదల చేస్తున్నారు. అయితే జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు నిధులు ఇస్తున్నారు. 

దీంతో ఇటీవల కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో 500 జనాభా కంటే తక్కువగా ఉంటే నిధులు తక్కువగా వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిపై సీఎం కేసీఆర్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. జనాభాతో సంబంధం లేకుండా ప్రతి పంచాయతీకి రూ. 5 లక్షల నిధులు ప్రతి సంవత్సరం ఇవ్వాలని ఆదేశించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని సూచించారు. దీంతో శుక్రవారం సాయంత్రం పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పంచాయతీకి రూ.  5 లక్షల నిధులు తప్పకుండా ఇవ్వాలని జీవోలో స్పష్టం చేశారు.


logo