మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 22, 2020 , 00:22:18

వడగండ్ల వానకు అపార నష్టం

వడగండ్ల వానకు అపార నష్టం

ఉమ్మడి నల్లగొండలో  పంటలకు భారీగా దెబ్బ

ఆదుకోవాలని రైతుల వేడుకోలు

రాగల మూడ్రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ/నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానతో పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీగా పంటనష్టం జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లాలోని పెద్దవూర, దేవరకొండ, పీఏపల్లి, చిట్యాల తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానకు పొట్ట దశకొచ్చిన వరిపంట పూర్తిగా ధ్వంసమైంది. దీంతోపాటు బత్తాయి, అరటి తోటలకు కూడా తీవ్రస్థాయిలోనష్టం చేకూరింది. బత్తాయితోటల్లో కాయలన్నీ రాలిపోవడంతో రైతులు నష్టపోయారు. అధికారులు పంటనష్టం వివరాలను సేకరిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామంలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు కోతకొచ్చిన వరినేలవాలింది. దాదాపు 200 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

యాదాద్రి జిల్లాలోనూ భారీగా నష్టం

యాదాద్రి జిల్లాలో శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా యాదగిరిగుట్ట మండలంలోనే పంటనష్టం జరిగింది. చేతికి అందివచ్చిన పంట కండ్ల ముందే మట్టిపాలు కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి శనివారం మల్లాపూర్‌, సైదాపురం, మసాయిపేట, కొలనుపాక, చల్లూరు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ఆయన ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పంట నష్టాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో 15,707 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు జిల్లా వ్యవసాయాధికారి అనురాధ తెలిపారు.

వచ్చే మూడ్రోజులు వానలు..

పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియల్‌ కర్ణాటక, ఉత్తర ఇంటీరియల్‌ తమిళనాడు మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతున్నది. దీంతో వచ్చే మూడు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. 


logo
>>>>>>