బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 02:52:49

సడలింపు సంబురం

సడలింపు సంబురం

  • లాక్‌డౌన్‌ సడలింపులతో సర్వత్రా ఆనందం
  • ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో ఊపందుకున్న పనులు
  • రైతుల కండ్లలో ఆనందం, వ్యాపారుల్లో హర్షాతిరేకాలు
  • రాష్ట్రవ్యాప్తంగా  కూలీలకు చేతినిండా దొరికిన పని
  • సరి- బేసి విధానంలో ఎరువుల షాపుల నిర్వహణ
  • భూ క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు మొదలు
  • నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కొవిడ్‌-19ను అదుపుచేసేందుకు దాదాపు నెలన్నరగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను పాక్షికంగా సడలించటంతో రైతులు, దుకాణాదారులు, వ్యవసాయకూలీలతోపాటు అన్నివర్గాల్లో పట్టరాని ఆనందం వ్యక్తమవుతున్నది. లాక్‌డౌన్‌ కారణంగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు మళ్లీ తమ పనుల్లో నిమగ్నమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెడ్‌జోన్లు మినహా ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో దుకాణాల షట్టర్లు తెరుచుకున్నాయి. అన్నిరకాల వ్యాపారాలు కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. వ్యవసాయం, భవన నిర్మా ణం, హార్డ్‌వేర్‌ తదితర రంగాల వస్తువులు అమ్మే షాపుల్లో సందడి నెలకొంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూనే ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నా రు. పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ నిబంధనలు అమలుచేస్తున్నారు.

సందడి.. సందడి

వరంగల్‌రూరల్‌, మహబూబాబాద్‌, ము లుగు, జనగామ, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఎరు  వులు, విత్తనాల షాపులు తెరుచుకోవడంతో రైతులు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తున్నారు. మద్యం దుకాణాలు, భూముల రిజిస్ట్రేషన్లు, చిన్న, మధ్య తరహా పరిశ్ర మలు, భవన నిర్మాణరంగం, వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు జోరందుకున్నాయి.  భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో బీ క్యాటగిరీలో ఉన్న వ్యాపారసంస్థలకు సరి- బేసి విధానంలో మున్సిపల్‌ అధికారులు నంబర్లు వేశారు. భవననిర్మాణాలు, రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కరెంటు బిల్లులు కూడా పెద్దమొత్తంలో చెల్లిస్తున్నారు. రెండురోజుల్లో రూ.38 లక్షలు వసూలైనట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్‌ పన్నులు శుక్రవారం కరీంనగర్‌లో రూ.8 లక్షలవరకు వసూలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో గురువారం నుంచే అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. మున్సిపాలిటీ అధికారులు దుకాణాలకు సరి- బేసి విధానంలో సీరియల్‌ నంబర్లు జారీచేస్తున్నారు. ఈ విధానంలో ఒకరోజు సగం దుకాణాలను తెరిచి ఉంచుతుండగా.. మిగతా సగం ఆ మరుసటి రోజు తెరుస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలు రెడ్‌జోన్‌ నుంచి ఆరెంజ్‌ జోన్‌లోకి రావటంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు కళకళలాడుతున్నా యి. నిర్మాణరంగ కూలీలకు చేతినిండా పని దొరకుతున్నది. మెకానిక్‌ షాపులవద్ద రిపేర్లకోసం ట్రాక్టర్లు క్యూ కట్టాయి. ఖమ్మం నగరంలో సరి, బేసి పద్ధతుల్లో దుకాణదారులు షాపులను తెరుస్తున్నారు. రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శుక్రవారం ఖమ్మంలో దుకాణాలను తనిఖీ చేశారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, నగరపాలక   సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతితో కలిసి నగరంలో విస్తృతంగా పర్యటించారు. సంగా రెడ్డి, సిద్దిపేట, మెదక్‌జిల్లాలో భూ రిజిస్ట్రే షన్లు మొదలయ్యాయి. మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట తదితర మున్సిపాలిటీల్లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించనివారిపట్ల అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని దుకాణాలకు అధికారులు జరిమానాలు విధించారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మాస్కు ధరించని ఓ వ్యక్తికి మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి రూ.1000 జరిమానా వేశారు. నిబంధనలు అతిక్రమించిన 25మందితో గుంజీలు తీయించారు. పరిగి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన నాలుగు దుకాణాల యజమానులకు మున్సిపల్‌ కమిషనర్‌ తేజిరెడ్డి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించిన పదిమంది వ్యాపారులకు ఫైన్‌ వేయగా, చెన్నూరులో శ్రీవాణి జువెలర్స్‌ వర్క్‌షాప్‌కు రూ 5,000, స్నేహశ్రీ కంగన్‌ హాల్‌కు రూ 3,000 జరిమానా వేశారు. శ్రీరాంపూర్‌లో మాస్కుల ధరించకుండా వెళ్తున్న 20 మందికి, ఖమ్మం త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 20 మందికి, జనగామ జిల్లాకేంద్రంలో ఏడుగురికి ఒకొక్కరికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని, కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రామవరంలో ఉన్న  మద్యం దుకాణాలకు రూ.5000, రూ.25,000 జరిమానా వేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఇద్దరు పూజారులతో పాటు 38 మంది హనుమాన్‌ భక్తులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ప్రధానరోడ్డుపై ఉమ్మివేసిన పల్లపు అరుణ్‌ అనే యువకుడికి రూ.200 జరిమానా విధించారు.


logo