ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 02:15:12

టీచర్లలో ఆంగ్ల విశ్వాసం

టీచర్లలో ఆంగ్ల విశ్వాసం

  • ఇంగ్లిష్‌ శిక్షణతో పెరుగుతున్న నమ్మకం
  • నాణ్యమైన విద్యాబోధనకు ఎస్జీటీలు సన్నద్ధం
  • వచ్చే రెండేండ్లలో  10 వేల మందికి శిక్షణ
  • ఆ తర్వాత స్కూల్‌ అసిస్టెంట్లకూ..

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో కొనసాగుతున్న ఇంగ్ల్లిష్‌ లాంగ్వేజీ ఎన్‌రిచ్‌మెంట్‌ కోర్సుకు ప్రాథమిక స్కూల్‌ టీచర్ల(ఎస్జీటీ) నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇంగ్లిష్‌లో నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెరిగి వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతున్నది. ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేలా తయారవుతున్నారు. అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ సహకారంతో ఎస్సీఈఆర్టీ నిర్వహిస్తున్న ఇంగ్లిష్‌ లాంగ్వేజీ శిక్షణ పొందిన ప్రాథమిక స్కూల్‌ టీచర్లలో అనుహ్యమైన మార్పులు వస్తున్నాయి. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేసేందుకు ఎక్కువ చొరవ చూపిస్తున్నారు. తొమ్మిదివారాల పాటు కొనసాగే ఆన్‌లైన్‌ ఇంగ్లిష్‌ శిక్షణ కోర్సులో ప్రవేశం పొందటానికి మరికొంత మంది ఎస్జీటీల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నది. రాష్ట్రంలో దాదాపు ఆరు వేలకు పైగా సర్కారు బడుల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్ల్లిష్‌ మీడియం తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది టీచర్లలో ఇంగ్లిష్‌ నైపుణ్యాలు లేకపోవడాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయులకు ఇంగ్ల్లిష్‌ శిక్షణ ఇవ్వాలని భావించగా, శిక్షణ ఇచ్చేందుకు అజీమ్‌ప్రేమ్‌జీ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ యూనివర్సిటీతో పాఠశాల విద్యాశాఖ గత ఏడాది అవగాహన ఒప్పందం చేసుకుంది. శిక్షణతో పాటు, సర్టిఫికెట కూడా అందజేస్తున్నారు. అది తమకు భవిష్యత్తులో బాగా ఉపయోగపడుతుందని టీచర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

కొత్తగా నోటిఫికేషన్‌ జారీ..

వచ్చే రెండేండ్లలో మొత్తం పదివేల మందికి ఇంగ్లిష్‌ శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు మూడు బ్యాచ్‌లకు శిక్షణ ఇవ్వగా..నాలుగో బ్యాచ్‌ కోసం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. వారందరికీ శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తున్నారు. ప్రతి ఐదుగురికి ఒక మెంటార్‌ను ఏర్పాటుచేశారు. ప్రతివారం ఒక క్లాస్‌తో పాటు వారికి ఇంగ్లిష్‌ భాషపై అసైన్‌మెంట్లు ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందినవారు తిరిగి శిక్షణ ఇచ్చేలా తయారవుతున్నారు. ఇప్పటికే ఎస్‌ఆర్‌పీ, ఈఎల్‌టీసీలు మెంటార్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక స్కూల్‌ టీచర్లకు శిక్షణ పూర్తైన వెంటనే ఉన్నత పాఠశాలలకు చెందిన స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు కూడా శిక్షణ ఇచ్చేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేయనున్నది.logo