సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 17:25:53

కాకతీయ ప్రధాన కాలువను పరిశీలించిన ఇంజనీర్ల కమిటీ సభ్యులు

కాకతీయ ప్రధాన కాలువను పరిశీలించిన ఇంజనీర్ల కమిటీ సభ్యులు

కరీంనగర్ : జిల్లాలోని తిమ్మాపూర్ నుంచి హుజురాబాద్ వరకు కాకతీయ ప్రధాన కాలువను శనివారం సీనియర్ ఇంజనీర్ల కమిటీ సభ్యులు పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) కాకతీయ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు సీనియర్ ఇంజనీర్ల కమిటీ సభ్యులు ఈఎన్‌సీ పరిపాలనా విభాగం బి నాగేందర్‌రావు, ఈఎన్‌సీ ప్రాజెక్ట్స్ కరీంనగర్ జి అనిల్‌కుమార్, ఈఎన్‌సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ వెంకటేశ్వర్లు ఎస్సారెస్పీ ఎసీఈ, చీఫ్ ఇంజనీర్ బి శంకర్, గోదావరి ఎత్తిపోతల పథకం చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసరావులు కాకతీయ ప్రధాన కాలువను పరిశీలించారు.

ప్రస్తుతం కాకతీయ ప్రధాన కాలువ సామర్థ్యం 8500 క్యూసెక్కులు ఉండగా దీనిని పదివేలకు పెంచేందుకు అనుగుణంగా కార్యచరణ కోసం పరిశీలించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి దశకు చేరుకోగా ఎస్సారెస్పీ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఐదుగురు సీనియర్ ఇంజనీర్లతో కమిటీని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కమిటీ సభ్యులు ఇప్పటికే రెండు, మూడు పర్యాయాలు ఎస్సారెస్పీ కాలువను పరిశీలించారు. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.


logo