శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:59:43

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రికకు నిశ్చితార్థం

సీఎం కేసీఆర్‌ దత్తపుత్రికకు నిశ్చితార్థం

అంబర్‌పేట: కన్నతండ్రి, పినతల్లి చేతుల్లో హింసకు గురైన ప్రత్యూషను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దత్తత తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడా యువతి తనకు నచ్చిన వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నది. హైదరాబాద్‌లోని రాంనగర్‌కు చెందిన చరణ్‌రెడ్డిని పెండ్లి చేసుకోబోతున్నది. ఆదివారం విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో వీరి నిశ్చితార్థం జరిగింది. చరణ్‌రెడ్డి ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ఇతడి తండ్రి మర్రెడ్డి, తల్లి మమత. వీరికి ఇద్దరు కొడుకులు. చరణ్‌రెడ్డి పెద్దవాడు. ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాడు. ప్రత్యూష ఉద్యోగంచేసే దవాఖానలోనే చరణ్‌ బంధువు పని చేస్తున్నది. ఆమె ద్వారా ప్రత్యూష గురించి తెలుసుకొని.. ఇష్టపడ్డాడు. ప్రత్యూషకు కూడా అతడు నచ్చటం తో పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌కు చెప్పటంతో ప్రత్యూషను ప్రగతిభవన్‌కు పిలిపించి మా ట్లాడారు. ఆమె ఇష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి పెండ్లికి ఆనందంగా ఓకే చెప్పారు. నిశ్చితార్థం బాధ్యతను మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పజెప్పారు. ఆ శాఖ కమిషనర్‌ దివ్య దగ్గరుండి పర్యవేక్షించారు. పెండ్లికి తప్పకుండా వస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారని ప్రత్యూష పేర్కొన్నది.